Saturday, August 4, 2007

రాకోయీ అనుకోని అతిథి

రాకోయీ అనుకోని అతిథి
కాకి చేత కబురైనా పంపక
రాకోయీ అనుకోని అతిథి

వాకిటి తలుపులు తెరువనె లేదు
ముంగిట ముగ్గులా తీర్చనే లేదు
వేళ కాని వేళా .....
ఈ వేళ కాని వేళ ..... ఇంటికి

రాకోయీ అనుకోని అతిథి
రాకోయీ .....

సిగలో పూవులు ముడవాలంటే ..... సిరిమల్లెలు వికసింపనె లేదు
కన్నుల కాటుక దిద్దాలంటే ..... నిద్దుర నీడలా వీడనే లేదు
పాలు వెన్నలు తేనే లేదు ..... పంచభక్ష్యముల చేయనే లేదు
వేళ కాని వేళా ..... ఈ వేళ కాని వేళ ..... విందుకు

రాకోయీ అనుకోని అతిథి
రాకోయీ .....

ఊరక దారినె పోతూ పోతూ అలసి వచ్చితివో
ఒంటరిగా ఉన్నానని నే తెలిసే వచ్చితివో .....
ఒంటరిగా ఉన్నానని నే తెలిసే వచ్చితివో
రమ్మనుటకు సాహసము చాలదు
పొమ్మనుటా మరియాద కాదది
వేళ కాని వేళా .....ఈ వేళ కాని వేళ ..... త్వరపడి

రాకోయీ అనుకోని అతిథి
కాకి చేత కబురైన పంపక
రాకోయీ అనుకోను అతిథి
రాకోయీ .....

సినిమా : శ్రీరాజరాజేశ్వరీవిలాస్ కాఫీ క్లబ్.
సాహిత్యం : దేవులపల్లి కృష్ణ శాస్త్రి గారు
సంగీతం : పెండ్యాల నాగేశ్వరరావు గారు
గానం : పి.సుశీల గారు

ఈ సినిమా పేరు చిన్నప్పుడు విని ఏదో క్లబ్బు గట్రా యాక్ అనుకోవటం నాకింకా గుర్తు. :) చిన్నప్పుడు రేడియో బెనిఫిట్స్ ఏవంటే కొన్ని మంచి మంచి పాటలు ఇప్పుడు చాలా తక్కువ వినిపించే పాటలు మనసులో ముద్రించుకుపోవటం. నేను పుట్టక ముందు వచ్చిన పాటలు కూడా ఇప్పటికీ గుర్తున్నాయంటే అవి చిన్నప్పుడు ఎక్కువగా రేడియో లో వినటమేనేమో. మరి ఇప్పటి పాటలు ఎందుకు గుర్తుండవు అంటే??? బహుశా పాటలు మరీ ఎక్కువైపోవటం కావచ్చు (మందెక్కువైతే మజ్జిగ పల్చన లాగా) (( మందు అని అర్థం అవుతుందా? వివరణ ఇవ్వటం మంచిదేమో. మందు ఎక్కువ అవటం కాదు మంది ఎక్కువవటం )), రెండో అనుమానం పాటల క్వాలిటీ తగ్గటం, మూడు : వినటానికి టైం లేకపోవటం. నాలుగు : విన్న వెంటనే మర్చిపోవటం. నాలుగు రెండోదానికి పర్పెండుక్యులర్లీ ఈక్వల్.

కృష్ణ శాస్త్రిగారి పాటలు చాలా మటుకు నాకెందుకో అర్థం కావు. కవితలు బానే అర్థం అవుతాయి కానీ పాటలే. ఆయన పాటలకి సంగీతం కట్టటం కష్టం ఏమో అనిపిస్తుంది.

2 comments:

నిషిగంధ said...

కృష్ణశాస్త్రి గారే రాసిన ఇంకో పాట మేఘ సందేశంలోని 'ముందు తెలిసెనా ప్రభూ' కూడా ఇలానే ఉంటుంది కదా.. సాహిత్యం చాలా లలితంగా ఉంటుంది!!

Anonymous said...

ఇప్పటి పాటలు భావ ప్రధానం గా ఉండేవి తక్కువ కదా!
పాత పాటల్లో మనకి ఒక దృశ్యం కనపడుతుంది. సినిమాలోని సన్నివేశానికి పాట వల్ల ఏంతో బలం వచ్చేలా ఉండేవి పాటలు. ఇప్పుడు ఉన్నట్టుండి సన్నివేశం తో సంబంధం లేకుండా ఏదొక మంచి లొకషన్ లోకి వెళ్ళి పాడే duet లే ఎక్కువ.