Monday, July 30, 2007

సిగ్గు చిరునామా

సిగ్గు అనే పదార్ధం ఎలా ఉంటుందో? రూపురేఖలేమిటో? రంగు రుచి ఎలా ఉంటాయో. ఇలా నన్ను నేనే తిట్టుకుంటుంటే (చేసినవన్నీ చేసేసీ లేదా చేస్తూ) ఏదో తుత్తి. హమ్మయ్య తిట్టేసుకున్నాను కాబట్టి ఏం చేసినా ఇంక పర్లేదన్నమాట. దీన్నేదో అంటారు. పదం గుర్తు రావటం లేదు. ఆత్మని చంపుకోవటం టైపులో. అంత భారీ పదం కాదు కానీ. ఇంతకీ నన్ను నేను ఈ రేంజ్ లో తిట్టుకోవటం అవసరమా? ఏమో. అవసరమేనేమో. 48 గంటలుగా కంటి మీద కునుకు లేకుండా శని ఆదివారాలని కూడా లేకుండా ఆఫీసులో రక్తం ధారపోసి ఇంటికి రాగానే బ్లాగుతున్నానంటే, హ్మ్మ్మ్మ్. ఓ సిగ్గా నీవెక్కడా????

Saturday, July 28, 2007

నగుమోము గలవాని

రాగం : మధ్యమావతి
తాళం : ఆది

నగుమోము గలవాని నా మనోహరుని జగమేలు శూరుని జానకివరునీ
నగుమోము గలవాని

దేవాధి దేవుని దివ్య సుందరుని శ్రీ వాసుదేవుని సీతారాఘవునీ
నగుమోము గలవాని

సుజ్ఞాన నిధిని సోమ సూర్య లోచనుని అజ్ఞాన తమమును అణచు భాస్కరునీ
నగుమోము గలవాని

నిర్మలాకారుని నిఖిలాఘహరుని ధర్మాది మోక్షంబు దయసేయు ఘనునీ
నగుమోము గలవాని

బోధతో పలుమారు పూజించి నేనారాధింతు శ్రీ త్యాగరాజసన్నుతుని

నగుమోము గలవాని నా మనోహరుని జగమేలు శూరుని జానకివరునీ
నగుమోము గలవాని

అన్నపూర్ణే విశాలాక్షి

రాగం : శ్యామ
తాళం : ఆది

అన్నపూర్ణే విశాలాక్షి అఖిలభువనసాక్షి కటాక్షి
అన్నపూర్ణే విశాలాక్షి

ఉన్నతగత్త తీర విహారిణి ఓంకారిణి దురితాదినివారిణి
పన్నగాభరణ రాజ్ణ్జీ పురాణి పరమేశ్వర విశేశ్వర భాస్వరి

అన్నపూర్ణే విశాలాక్షి అఖిలభువనసాక్షి కటాక్షి
అన్నపూర్ణే విశాలాక్షి

పాయసాన్నపూరిత మాణిక్యపాత్ర హేమధరి విధృతకరే
కాయజాది రక్షణ నిపుణతరే కాంచనమయ భూషణాంబరధరే
తోయజాసనాది సేవితపరే తుంబురు నారదాదినుతవరే త్రయాతీత మోక్షపదచతురే త్రిపదశోభిత గురుగుహసాదరే


అన్నపూర్ణే విశాలాక్షి అఖిలభువనసాక్షి కటాక్షి
అన్నపూర్ణే విశాలాక్షి


ఈ పాట వింటుంటే అమ్మవారు ఒక చేతిలో పాయసంతో ఉన్న బంగారు పాత్ర పట్టుకుని రెండవ చేతితో బంగారు గరిటె పట్టుకుని చిరునవ్వుతో చూస్తున్నట్టు అనిపిస్తుంది. :)

Friday, July 27, 2007

ఓ మైనా .....

ఓ మైనా ..... ఆ ఆ
నీ గానం నే విన్నా ఆ ..... ఆ ఆ
ఎటు ఉన్నా ..... ఆ ఆ ఆ ..... ఏటవాలు పాట వెంట రానా ..... ఆ ఆ

కమ్మని గీతాలే పంపి రమ్మని పిలిచావే ..... మరి రావే ఇకనైనా .....
కొమ్మలనడిగానే ప్రతి రెమ్మని వెతికానే ..... కనిపించవు కాస్తైనా .....
నీ కోసం వచ్చానే సావాసం తెచ్చానే
ఏదీ రా మరి ఏ మూలున్నా .....

కమ్మని గీతాలే పంపి రమ్మని పిలిచావే ..... మరి రావే ఇకనైనా .....
కొమ్మలనడిగానే ప్రతి రెమ్మని వెతికానే ..... కనిపించవు కాస్తైనా .....
నీ కోసం వచ్చానే సావాసం తెచ్చానే
ఏదీ రా మరి ఏ మూలున్నా .....

కమ్మని గీతాలే పంపి రమ్మని పిలిచావే ..... మరి రావే ఇకనైనా
లాల్లలలల్లల్లా లాలలాలలలల్లల్లా లలలాలాలాలాలాలా .....

ఎవరైనా ..... ఆ ఆ ఆ ..... చూశారా ఎపుడైనా ..... ఆ ఆ ఆ
ఉదయానా ..... ఆ ఆ ఆ ..... కురిసే వన్నెల వానా ..... హో
కరిమబ్బులాంటి నడిరేయి కరిగి కురిసింది కిరణాలుగా
ఒక్కొక్క తారా చినుకల్లె జారి వెలిసింది తొలికాంతిగా ..... ఆ .....
కరిమబ్బులాంటి నడిరేయి కరిగి కురిసింది కిరణాలుగా
ఒక్కొక్క తారా చినుకల్లె జారి వెలిసింది తొలికాంతిగా
నీలాకాశంలో వెండి సముద్రంలా పొంగే .....

కమ్మని గీతాలే పంపి రమ్మని పిలిచావే ..... మరి రావే ఇకనైనా
కొమ్మలనడిగానే ప్రతి రెమ్మని వెతికానే ..... కనిపించవు కాస్తైనా .....

నన్నేనా .....ఆ ఆ ఆ ..... కోరుకుంది ఈ వరాల కోనా ..... హో
ఏలుకోనా ..... ఆ ఆ ఆ ..... కళ్ళ ముందు విందు ఈ క్షణానా ..... హో
సీతాకోకచిలుకా తీసుకుపో నీ వెనుకా వనమంతా చూపించగా .....
ఆ మొక్క ఈ మొలక అన్నీ తెలుసు కనుక వివరించు ఇంచక్కగా .....
సీతాకోకచిలుక తీసుకుపో నీ వెనుక వనమంతా చూపించగా .....
ఆ మొక్క ఈ మొలక అన్నీ తెలుసు కనుక వివరించు ఇంచక్కగా .....
ఈ కారుణ్యంలో నీ రెక్కే దిక్కై రానా .....

కమ్మని గీతాలే పంపి రమ్మని పిలిచావే ..... మరి రావే ఇకనైనా
కొమ్మలనడిగానే ప్రతి రెమ్మని వెతికానే ..... కనిపించవు కాస్తైనా
నీ కోసం వచ్చానే సావాసం తెచ్చానే
ఏదీ రా మరి ఏ మూలున్నా .....

ఆహహహహ్హహ్హా ఓహోహోహోహోహ్హోహ్హో లలలాలా హ్మ్మ్ హ్మ్మ్ హ్మ్మ్ హ్మ్మ్

డూడుడుడుడుడూ ఓహోహొహొహొహొహోహో లలలాలాలాలాలాలా .....

సినిమా : అంతం (1990)
సాహిత్యం : సిరివెన్నెల సీతారామశాస్త్రి
సంగీతం : ఆర్.డి.బర్మన్
నేపధ్యం : చిత్ర

ఈ పాట మొదట్లో నాకస్సలు నచ్చలేదు. బహుశా ఊర్మిళ కారణం అయి ఉంటుంది. కానీ తర్వాత్తర్వాత ఇష్టమైన పాటల లిస్ట్ లో చేరిపోయింది. చిత్ర చాలా హుషారుగా చక్కగా పాడింది కానీ పంటి కింద రాయిలాగా రెక్క అనాల్సిన చోట రక్క అంటుంది.

కరిమబ్బులాంటి నడిరేయి కరిగి కురిసింది కిరణాలుగా ఒక్కొక్క తార చినుకల్లె జారి వెలిసింది తొలికాంతిగా. ఎంత బావుంది ఈ భావన. వర్షాలు అంటే చిరాకు, ఎక్కడికీ వెళ్ళడానికి కుదరదు అంటారు చాలామంది. నిజమే కావచ్చు. అసలే ఎండిపోయిన నది పక్కన ఉన్న హైదరాబాదుకి కూడా వరదలొస్తుంటే ఇంక వర్షాకాలం అంటే ఎవరికి ఇష్టం ఉంటుంది. కానీ శ్రావణమాసంలో తెల్లవారుఝామున వర్షం పడుతుంటే ..... హ్మ్మ్ ..... బావుంటుంది :). కరిమబ్బులాంటి నడిరేయి కరిగిపోవటం అంటే సీతారామశాస్త్రిగారి ఉద్దేశ్యం ఏంటో తెలీదు కానీ నాకైతే ముందురోజు పడ్డ బాధ కానీ కష్టం నష్టం ఏదైనా కానీ రాత్రి తో అంతం అయిపోయి అవన్నీ కరిగి వానలా కురిసి అప్పటిదాకా మిణుకు మిణుకుమన్న నక్షత్రాలన్నీ తొలికాంతి కిరణాలుగా ఒక కొత్త ఉషోదయంతో కొత్త ఆశలతో సరికొత్త రోజుకి ఆహ్వానమేమో అనిపిస్తుంది.

Thursday, July 26, 2007

నగుమోము గనలేని

రాగం : ఆభేరి
తాళం : ఆది

నగుమోము గనలేని నా జాలి తెలిసి నను బ్రోవగ రాదా శ్రీ రఘువర ..... నీ
నగుమోము గనలేని నా జాలి తెలిసి నను బ్రోవగ రాదా శ్రీ రఘువర

నగరాజధర నీదు పరివారులెల్ల ఒగి బోధన జేసేవారలు గారే అటులుండరుగా నీ .....
నగుమోము గనలేని నా జాలి తెలిసి నను బ్రోవగ రాదా శ్రీ రఘువర

ఖగరాజు నీ యానతి విని వేగ చనలేదో
గగనానికి ఇలకు బహుదూరంబనినాడో
జగమేలే పరమాత్మ ఎవరితో మొరలిడుదు
వగ జూపకు తళను నన్నేలుకోరా త్యాగరాజనుత నీ .....

నగుమోము గనలేని నా జాలి తెలిసి నను బ్రోవగ రాదా శ్రీ రఘువర

ఈ కీర్తన ఎందుకు ఇష్టం అని అడిగితే రెండు పేజీల్లో చెప్పటం క్లుప్తంగా చెప్పటం అవుతుందేమో. త్యాగరాజులవారి అన్ని భావాలు ఇందులో కనిపిస్తాయి నాకు. జాలి, వేడుకోలు, అనుమానాలు అన్నింటి కలబోత. నీ చుట్టూ ఉన్న నీ పరివార బృందం నీ మనసు విరిచేసుంటారా, అటువంటివారు కారే లేక పదవయ్యా అన్న నీ ఆనతి విని ఖగరాజు త్వరగా రాలేకపోయాడా లేక గగనానికి భూమికి చాలా దూరం ఉంది వెళ్ళటం కష్టం అన్నాడో, ఇంకా ఏమైందో అని బోలెడు అనుమానాలు వ్యక్తం చేసినా ఓ జగాలనేలే పరమాత్మా నీకు కాక ఇంక ఎవరితో చెప్పుకోను, అన్యధా శరణం నాస్తి, వగ చూపించకు నీ దర్శనాన్ని ప్రసాదించి ఏలుకోవయ్యా అని ప్రార్ధించటం ఇవన్నీ చిన్న చిన్న పదాలలో భావార్ధ ప్రకటన చెయ్యటం త్యాగరాజులవారికే చెల్లింది. :)


పండరీపురం గుళ్ళో ముందర హాల్లో ఒక స్తంభం మీద గజేంద్రమోక్షం చెక్కి ఉంటుంది. అది చూడగానే నాకూ అమ్మకి ఒకేసారి ఈ పాట గుర్తుకు వచ్చింది.

ఖగరాజు నీ ఆనతి విని వేగ చనలేదో గగనానికి ఇలకు బహు దూరంబనినాడో జగమేలే పరమాత్మా ఎవరితో మొరలిడుదు, వగ చూపకు తాళను నన్నేలుకోరా .....

Wednesday, July 25, 2007

ఓపిక లేదు

బ్లాగటానికి ఎంతమాత్రం ఓపిక లేదు. కానీ గొప్ప ఘనకార్యం చేశాను ఈవేళ. నా అంతట నేనే ముక్కల పులుసు పెట్టాను. బీన్స్ కూర, పులుసుతో భోజనం బ్రహ్మాండం. :) పొద్దున ఇంటికి కాల్ చేసి అమ్మ రెసిపీ కనుక్కుని ఈ పూట ప్రయోగం చేశాను. పర్లేదు వంట బానే చెయ్యగలను. క్రెడిట్ అమ్మకే వెళ్తుంది. అమ్మ చేసినంత బాగా కుదరకపోయినా నేను అనుకున్నదానికన్నా బానే వచ్చింది. :)

మళ్ళీ రేపు ఆఫీసుకి వెళ్ళాలి. 9 కి మీటింగ్. హ్మ్మ్మ్మ్. రోజుకి 48 గంటలు. వారానికి ఇరవై రోజులు. అందులో పదిహేను రోజులు వీకెండ్ ఉంటే ఎంత బావుంటుంది. :)))

Tuesday, July 24, 2007

ఏదో ఏదో అన్నది ఈ మసక వెలుతురు

ఏదో ఏదో అన్నది ఈ మసక వెలుతురు
గూటి పడవలో విన్నది కొత్త పెళ్ళికూతురు .....
ఏదో ఏదో అన్నది ఈ మసక మసక వెలుతురు
గూటి పడవలో విన్నది కొత్త పెళ్ళికూతురు

ఒదిగి ఒదిగి కూచుంది బిడియపడే వయ్యారం
ముడుచుకొనే కొలది మరీ మిడిసిపడే సింగారం
సోయగాల విందులకై వేయి కనులు కావాలీ .....

హ్మ్మ్మ్ మ్మ్మ్ మ్మ్

ఏదో ఏదో అన్నది ఈ మసక వెలుతురు
గూటి పడవలో విన్నది కొత్త పెళ్ళికూతురు

నింగిలోని వేలుపులు ఎంత కనికరించారో
నిన్ను నాకు కానుకగా పిలిచి కలిమినొసగేరు
పులకరించు మమతలతో పూల పాన్పు వేసారు

హ్మ్మ్మ్ మ్మ్మ్ మ్మ్

ఏదో ఏదో అన్నది ఈ మసక మసక వెలుతురు
గూటి పడవలో విన్నది కొత్త పెళ్ళికూతురు

ఈ పాట డెభ్భై ఎనభై దశకాల్లో వచ్చిన అపురూపమైన పాటల్లో మొదటిదని నా నమ్మకం. సాహిత్యం ఎంత నిండుగా ఉంటుందో ఈ పాటలో. ప్రేమ,ఇష్టం,సున్నితమైన శృంగారం వీటన్నింటితో చక్కటి మేళవింపు ఈ పాట. "ముడుచుకునే కొలదీ మరీ మిడిసిపడే సింగారం". ముడుచుకోవటం, మిడిసిపడటం రెండూ ఒకదానికొకటి భిన్నమైనవి. ఆ రెంటినీ కలిపి ఒకచోట కూర్చి అపురూపం అనిపించిన ఆ రచయిత శైలి కి జోహార్లనద్దూ. :) సినిమాలో హీరో డబ్బున్నవాడైనా పీటల మీద పెళ్ళి చెడిపోయిన ఒక పేదింటి పిల్లని చేసుకుని కూడా "నింగిలోని దేవతలు ఎంత కనికరించారో నిన్ను నాకు కానుకగా పిలిచి కలిమినొసగేరు" అని అంటాడు. తనకి ఉన్న కలిమికన్నా ఈ కలిమే ఎక్కువ అని ఆ అమ్మాయి పట్ల ఇష్టాన్ని ఎంత చక్కగా చిన్న మాటల్లో చెప్పాడో. సాహిత్యం,మహాదేవన్ గారి సంగీతం చక్కగా కుదిరిన పాట ఇది. రామకృష్ణ గారు పాడిన పాటల్లో అత్యుత్తమం అని నా నమ్మకం.

సినిమా : ముత్యాల ముగ్గు
సంగీతం : కె.వి.మహదేవన్
నటీనటవర్గం : శ్రీధర్, సంగీత, రావుగోపాలరావు, అల్లురామలింగయ్య, కాంతారావు

హిపోక్రసీ అంటే?

చేసేవి చేస్తూనే అబ్బే నేనెక్కడ చేశాను అని అవతలివాళ్ళని నమ్మించే ప్రయత్నమేనా హిపోక్రసీ? అలా చేసేవాళ్ళందర్నీ హిపోక్రాట్స్ అనవచ్చా? ఏమో. తెల్లవారి లేచినది మొదలు ముసుగు వేయని మనిషొకరు కనిపిస్తారేమో అని ఆశించటం క్రమక్రమంగా ఎడారిలో ఎండమావి అవుతోందేమో. ముసుగు వెయ్యద్దు మనసు మీద (చాలా కష్టపడ్డాక ఈ పాటలో ఈ ఒక్క ముక్క అర్థం అయింది నాకు) ఏమో కానీ అవతలివారి మొహానికి ముసుగు, కళ్ళకి గంతలు చాలా ఈజీగా వేసేస్తున్నారు. నాకొక అనుమానం. ఇలా ముసుగులేసుకునేవారికి, వేసేవారికి ఆత్మ అనేది ఉండదా? కనీసం వారికి వారు ఎలా సమాధానం చెప్పుకుంటారు? ఇది ఇంకొక అర్థం కాని ప్రశ్న. ఇది ఆలోచించేకన్నా ఆఫీసు పని చేసుకోవటం సులువేమో. అది కొంచెం అర్థం అవుతుంది. :)

అలిగిన వేళనే చూడాలి

నాకు అత్యంత ఇష్టమైన పాటల్లో ఇదొకటి .....

అలిగిన వేళనే చూడాలి గోకుల కృష్ణుని అందాలు .....
అలిగిన వేళనే చూడాలి .....

రుసరుసలాడే చూపులలోనే .....
రుసరుసలాడే చూపులలోనే .....
ముసి ముసి నవ్వుల చందాలు
అలిగిన వేళనే చూడాలి .....

అల్లన మెల్లన నల్ల పిల్లి వలె వెన్నను దొంగిల గజ్జెలు ఘల్లన .....
అల్లన మెల్లన నల్ల పిల్లి వలె వెన్నను దొంగిల గజ్జెలు ఘల్లన
తల్లి మేలుకొని దొంగను చూసి ..... ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
తల్లి మేలుకొని దొంగను చూసి అల్లరిదేమని అడిగినందుకే .....

అలిగిన వేళనే చూడాలి గోకుల కృష్ణుని అందాలు .....
అలిగిన వేళనే చూడాలి .....

మోహన మురళి గానము వినగా తహతహలాడుచు తరుణులు రాగా .....
మోహన మురళి గానము వినగా తహతహలాడుచు తరుణులు రాగా
దృష్టి తగులునని జడిసి యశోదా .....
దృష్టి తగులునని జడిసి యశోదా తనను చాటుగా దాచినందుకే .....

అలిగిన వేళనే చూడాలి .....

సినిమా : గుండమ్మ కథ
సంగీతం : ఘంటసాల
సాహిత్యం : పింగళి నాగేంద్రరావు
నేపధ్యం : పి.సుశీల
నటీనటవర్గం : సూర్యకాంతం, సావిత్రి, జమున, ఎస్.వి.రంగారావు, ఎన్.టి.రామారావు, ఎ.నాగేశ్వరరావు, రమణారెడ్డి, రాజనాల .....

Monday, July 23, 2007

చాన్నాళ్ళకి :)

ఇక నించైనా కాస్త రెగ్యులర్ గా బ్లాగాలి.

ఈరోజు ఆఫీస్ లో బోలెడుసేపు పని చేశా. ఏంటో ఏ దేశమేగినా ఎందుకాలిడినా ఈ రక్తం ధారపొయ్యటం తప్పదల్లే ఉంది.

ఈరోజంతా వర్షం పడుతూనే ఉంది. సాయంత్రం బైటికి వచ్చి చూస్తే వర్షంలో తడిసిన ప్రకృతి ఎంత బావుందో. ఇన్ని రోజులు గమనించలేదు కానీ ఎంత బావుందో మా ఆఫీసు చుట్టుపక్కల. మా ఆఫీసు ఎత్తుగా కొండ మీద ఉంటుందేమో, చుట్టూ పచ్చని కొండలు. ఏ హంగామా లేకుండా ప్రశాంతంగా ఉన్న పరిసరాలు. పల్లెటూరైనా మొదట్లో విసుక్కున్నా ఇప్పుడు నచ్చుతున్నట్టే ఉంది. :) ఏది నచ్చినా నచ్చకపోయినా మన సాటి భారతీయులు ఎందుకు నచ్చేలా ఉండరు? మిలియన్ డాలర్ ప్రశ్నేమో ఇది. ఎందుకని చూడగానే మొహం తిప్పుకుంటారు? చిన్న చిరునవ్వు నవ్వితే సొమ్మేం పోదు అన్న చిన్న విషయం ఎందుకు పట్టదు? ఎవరినో అడిగితే అన్నారు, నవ్వితే సాన్నిహిత్యం పెరిగి సహాయం చెయ్యమంటారేమో అని. ఇది ఇంకా విడ్డూరంగా అనిపించింది నాకు. పలకరింపుగా చిరునవ్వు నవ్వితే అది సన్నిహితంగా ఉండటం అయిపోతుందా? అయినంత మాత్రాన సహాయం అడిగేస్తారా? ఒకవేళ అడిగినా చెయ్యగలిగితే చేస్తారు లేదంటే లేదు. ఆ మాత్రానికి బెదరటం ఎందుకు? పైగా చెయ్యగలిగిన సహాయం చెయ్యటం తప్పేమీ కాదుగా. ఈ పలకరిస్తే సహాయం అడుగుతారు అన్నమాట కూడా సరికాదని నాకు అనుమానం. ఎందుకంటే ఈ దేశపు వాళ్ళని మొహం ఇంత చేసుకుని మరీ పలకరిస్తారు మరి. :) స్వదేశీయులంటే ఎందుకంత విరక్తో వారికే తెలియాలి.