Tuesday, April 8, 2008

అవీ ..... ఇవీ ..... అన్నీ .....

మళ్ళీ బోల్డు రోజుల తర్వాత.

ఈ మధ్య రోజూ జల్సా పాటలు వింటున్నాను. మొదట విన్నప్పుడు, ఈ దేవిశ్రీప్రసాద్ ఆ బొమ్మరిల్లులో బందీ అయిపోయాడా, ఇంక బైటికి రాడా అని సందేహం వచ్చింది. ఒకే రకంగా అనిపించాయి పాటలు. తినగ తినగ వేము తీయగనుండు లాగా వినగా వినగా ఇప్పుడు ఓ మూడు పాటలు బానే ఉన్నాయనిపిస్తోంది. ఒక పాట మటుకు మొన్నటి వరకు 'హాంటింగ్' టైప్స్ లో వెంటాడింది. ఒక సందేహం అన్నమాట ఆ పాటలో. హీ ఈజ్ సైమన్ సునామీ అని పాట. అమెరికావాళ్ళు ఉప్పెనలకి కూడా అందమైన ఆడవాళ్ళ పేర్లు పెడుతుంటే మనవాళ్ళేంటి మగపేరు అదీ ఎంగిలిపీచు పేరు పెట్టారు సునామీకి అని డౌట్. సరే మనవాళ్ళకి అదో పిచ్చి అని డిసైడ్ అయ్యాను. మొన్నెందుకో హెడ్ ఫోన్స్ పెట్టుకుని వింటుంటే అర్థం అయింది. హీ ఈజ్ ఎ హ్యూమన్ సునామీట. :O ఈజ్, ఎ, హ్యూమన్ కలిప్పారేసరికి నాకట్టా వినిపించింది. :( ఈస్ అని పలికాడు పైగా. ఆ కలపటం, పలకటం వెరసి అయోమయం.

ఇలాంటిదే ఆ మధ్య ఇంకోటి.

పోకిరి సినిమాలో పాట ఇది. పెన్ దొరకగానే రారా అని పాడుతోంది పాడినావిడ. ఎన్ని సార్లు విన్నా పెన్ దొరగ్గానే రావటం ఏంటో ఒక పట్టాన అర్థం కాలేదు. సరే, దర్శక నిర్మాతలు ఎప్పుడూ చెప్తూండే ' సిట్యుయేషనల్ ' సాంగ్ అంటే ఇదేనేమో, హీరోయిన్ పెన్ పారేసుకుని, వెతికి కనబడగానే రమ్మని హీరోకి చెప్తూ పాడుతోందేమో అని ఊహించేసుకున్నాను (మన సినిమాల్లో ఇలాంటి సెన్స్ లెస్ సీన్లు చాలా మామూలు కదా అందుకే అలా ఊహించే ధైర్యం చేశా). తర్వాత అర్థం అయింది. 'పెందరకడనే రారా' అని.

వినికిడిలోపమా? ఏమో :(((((

పోకిరి అంటే ఇంకో పాట గుర్తొస్తోంది. జగడమే ..... సమరమే ట." ఆ దేవుడె దిగివస్తున్నా, ఆకసమే దిగిపడుతున్నా,బిన్ లాడెన్ ఎదుటే నిలుచున్నా " (ఇవి బానే వినిపించాయి, డౌట్లేమీ లేవు. :P కానీ .....) అర్థం ఉందా ఈ లైన్‌కి? దేవుడు దిగి రావటం, బిన్ లాడెన్ ఎదురుగా నించోవటం రెండూ ఒకటేనా? దేవుడు కనిపించకుండా సృష్టిని నడిపిస్తాడు. ఈ లాడెను ఎక్కడో దాక్కుని కనిపించకుండా అమాయకుల చేత విధ్వంసాలు చేయిస్తుంటాడు. కనిపించకపోవడం అన్నదే ఇద్దరి మధ్య కామను. అంతమాత్రాన ఈ దయ్యాన్ని తీసుకెళ్ళి దేవుడి గాటన కట్టేస్తారా? ఇద్దరూ సమానులే అన్న అర్థం వచ్చేలా రాస్తారా? నాకైతే అస్సలు నచ్చలేదు ఈ ముక్క.