Monday, August 27, 2007

ఆలోకయే శ్రీ బాలకృష్ణం

ఆలోకయే శ్రీ బాలకృష్ణం సఖి ఆనంద సుందర తాండవకృష్ణం

నవనీత ఖండ దధి చోర కృష్ణం భక్త భవ పాశ బంధమోచన కృష్ణం


నీల మేఘ శ్యామాసుందర కృష్ణం నిత్య నిర్మలానంద బోధ లక్షణ కృష్ణం

చరణ నిక్వణిత నూపుర కృష్ణం కర సంగత కనక కంకణ కృష్ణం

కింకిణీ జాల ఘణ ఘణిత కృష్ణం లోక శంకిత తారావళి మౌక్తిక కృష్ణం


సుందర నాసా మౌక్తిక శోభిత కృష్ణం నందనందనం అఖండ విభూతి కృష్ణం

కంఠోప కంఠ శోభి కౌస్తుభ కృష్ణం కలి కల్మశ తిమిర భాస్కర కృష్ణం

వంశీనాద వినోద సుందర కృష్ణం పరమహంస కుల శంసిత చరిత కృష్ణం

గోవత్స బృంద పాలక కృష్ణం కృత గోపికాబాల కేళన కృష్ణం

నంద సునందాది వందిత కృష్ణం శ్రీ నారాయణ తీర్థ వరద కృష్ణం

ఆలోకయే శ్రీ బాలకృష్ణం సఖి ఆనంద సుందర తాండవకృష్ణం

నారాయణ తీర్థుల వారి కృతి
రాగం : తోడి

లేత పచ్చ ఆకులు .....

లేత పచ్చ ఆకులు .....
రేయి నల్ల వక్కలు .....
వెన్నెలంటి సున్నము .....
ఈ మూడు కలిసి మెలిసి పండినప్పుడే .....
తాంబూలం .... అరుణమందారం ..... అదే కళ్యాణం

లేత పచ్చ ఆకులు .....
రేయి నల్ల వక్కలు .....
వెన్నెలంటి సున్నము .....
ఈ మూడు కలిసి మెలిసి పండినప్పుడే .....
తాంబూలం .... అరుణమందారం ..... అదే కళ్యాణం

నీటిలోని కలువకి నింగిలోని జాబిలికి ఏనాడో జరిగింది కవితా కళ్యాణం
కడలిలోని ఉప్పుకి అడవిలోని ఉసిరికి ఏనాడో జరిగింది రసనా కళ్యాణం
రవికులజుడు రాముడికి భూమిపుత్రి సీతకి జరిగింది కళ్యాణం .....
లోక కళ్యాణం ..... అదే దాంపత్యం ..... ఇదీ తాంబూలం

లేత పచ్చ ఆకులు .....
రేయి నల్ల వక్కలు .....
వెన్నెలంటి సున్నము .....
ఈ మూడు కలిసి మెలిసి పండినప్పుడే .....
తాంబూలం .... అరుణమందారం ..... అదే కళ్యాణం

పలుకుతల్లి చిలకకి పడుచు గోరింకకి జరుగుతోంది అనాదిగా మాట వరస కళ్యాణం
రేయి పగలు రెంటినీ ఆలుమగలుగా చేసి జరుగుతోంది ప్రతిరోజు సంధ్యా కళ్యాణం
పసుపులాంటి పార్వతికి సున్నమంటి శివుడికి జరిగింది పారాణి కళ్యాణం
జరిగింది ఆ ఊ మా సంగమం .....
ఆ ఊ మా సంగమం
ఓం ఓం ఓం

సినిమా : కళ్యాణతాంబూలం
గానం : సుశీల గారు, ఎస్.పి.బాలసుబ్రమణ్యం

Sunday, August 26, 2007

సీతా కల్యాణ వైభోగమే ..... రామా కల్యాణ వైభోగమే

సీతా కల్యాణ వైభోగమే ..... రామా కల్యాణ వైభోగమే

పవనజస్తుతిపాత్ర పావనచరిత్ర
రవి సోమ వరనేత్ర రమణీయగాత్ర

సీతా కల్యాణ వైభోగమే ..... రామా కల్యాణ వైభోగమే

భక్తజన పరిపాల భరిత శరజాల
భుక్తి ముక్తిద లీల భూదేవపాల

సీతా కల్యాణ వైభోగమే ..... రామా కల్యాణ వైభోగమే

పామరాసురభీమ పరిపూర్ణకామ
శ్యామ జగదభిరామ సాకేతధామ

సీతా కల్యాణ వైభోగమే ..... రామా కల్యాణ వైభోగమే

సర్వలోకాధార సమరైకధీర
గర్వ మానసదూర కనకాఘధీర

సీతా కల్యాణ వైభోగమే ..... రామా కల్యాణ వైభోగమే

నిగమాగమవిహార నిరుపమశరీర
నగధరాగవిధార నతలోకాధార

సీతా కల్యాణ వైభోగమే ..... రామా కల్యాణ వైభోగమే

పరమేశనుతగీత భవజలధిపోత
తరని కులసంజాత త్యాగరాజనుత

సీతా కల్యాణ వైభోగమే ..... రామా కల్యాణ వైభోగమే

త్యాగరాజ కృతి

రాగం : శంకరాభరణం

Saturday, August 25, 2007

కళ్యాణవైభోగమే .....

విడిపోము మనము .....
ఈ ఎడబాటు క్షణము .....
ఆపైన కళ్యాణము

కళ్యాణవైభోగమే .....
కళ్యాణవైభోగమే ..... శ్రీ సీతారాముల కళ్యాణమే
మన మాంగల్యధారణ శుభలగ్నమే .....
కళ్యాణవైభోగమే ..... శ్రీ సీతారాముల కళ్యాణమే
మన మాంగల్యధారణ శుభలగ్నమే .....
కళ్యాణవైభోగమే .....

అనుకున్న కొన్నాళ్ళ వనవాసము ..... మునుముందు కావాలి మధుమాసము .....
అనుకున్న కొన్నాళ్ళ వనవాసము ..... మునుముందు కావాలి మధుమాసము
మన ప్రేమ తుదిలేని ఆకాశము .....
మన ప్రేమ తుదిలేని ఆకాశము ..... ప్రతిరోజు పూర్ణిమా శ్రావణము

కళ్యాణవైభోగమే ..... శ్రీ సీతారాముల కళ్యాణమే
మన మాంగల్యధారణ శుభలగ్నమే .....
కళ్యాణవైభోగమే .....

మరులెల్ల మరుమల్లె విరిమాలగా ..... మురిపాల ముత్యాలె తలంబ్రాలుగా .....
మరులెల్ల మరుమల్లె విరిమాలగా ..... మురిపాలముత్యాలె తలంబ్రాలుగా
హృదయాల నాదాలె వేదాలుగా .....
హృదయాల నాదాలె వేదాలుగా ..... మన అంతరంగాలే వేదికగా

కళ్యాణవైభోగమే .....

వలచాము నిలిచాము ఒక దీక్షగా ..... మనసైన మనసొకటే సాక్షిగా .....
వలచాము నిలిచాము ఒక దీక్షగా ..... మనసైన మనసొకటే సాక్షిగా
గెలిచాము కలిశాము దివి మెచ్చగా .....
ఆ ఆ ఆ ఆ ఆ ఆ
గెలిచాము కలిశాము దివి మెచ్చగా ..... కలకాలముందాము నులివెచ్చగా

కళ్యాణవైభోగమే ..... శ్రీ సీతారాముల కళ్యాణమే
మన మాంగల్యధారణ శుభలగ్నమే .....
కళ్యాణవైభోగమే .....

సినిమా : శ్రీ సీతారాముల కళ్యాణం
సాహిత్యం : ఆత్రేయ గారు
సంగీతం : కె.వి.మహదేవన్ గారు
గానం : పి.సుశీల గారు, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం

ఈ పాట ఎందుకు ఇష్టం అంటే ..... ఏమో కానీ ఇష్టం. :)

శంకరాభరణం డాబా ఇల్లు

కె.విశ్వనాథ్ గారి సినిమాలలో ఇళ్ళు భలే నచ్చుతాయి నాకు. పూరి గుడిసెలైనా చక్కగా మంచి డిజైన్స్ తో ఏ ఏరు పక్కనో చుట్టూ దడి ఉండి లోపల బాగా విచ్చుకున్న బంతిపూల మొక్కలు హ్మ్మ్మ్ ..... వెంటనే అక్కడికి వెళ్ళి ఉండాలనిపిస్తుంది. :) ఇందాక శంకరాభరణంలో సామజవరగమనా పాట చూశాను. అందులో రెండో చరణం వేసవి రేయిలా లో ఒక డాబా ఇల్లు చూపిస్తారు. ఎదురుగా కొండలు వాటి మధ్య ఒక నది వంపులు తిరిగి ఉంటుంది. వర్ణించనలవి కాని అందమైన అద్భుత దృశ్యం. ఆ ఇల్లు ఎక్కడ ఉందో, ఎక్కడ షూట్ చేశారో తెలీదు కానీ అసలా ఇల్లు కట్టుకున్నవారిది ఎంత చక్కటి అభిరుచి అయ్యుండాలి. అదృష్టవంతులు. మామూలు రోజుల్లోనే అంత చక్కటి దృశ్యాన్ని చూస్తూ అన్నీ మర్చిపోవచ్చు. ఇంక పౌర్ణమి రోజుల్లో చెప్పక్కరలేదేమో. వెన్నెల ఆ నీళ్ళ మీద పడి రిఫ్లెక్ట్ అవుతూ ..... ప్రకృతిని మించిన సౌందర్యం ఇంకెక్కడ ఉంది? ఇంకా రెండు రోజుల్లో శ్రావణ పౌర్ణమి. ఇప్పటికిప్పుడు మేఘాల మీద కూచుని అక్కడికి చేరుకుంటే ..... పక్కన ఉన్న బుజ్జి స్విమ్మింగ్ పూల్ లో వెన్నెల పడి ఇంత బావుంటే ఇంక ఆ నదిలో అలల మీద వెన్నెల కిరణాలు తేలుతూ సాగిపోతుంటే ..... ఆ ఇల్లు అలా ఉందో లేదో, ఆ కొండలు, నది అలా ఉన్నాయో లేవో, మన భూఆక్రమణదారులు వాటిని ఇంకా అలానే ఉంచారో లేదో. అన్నీ అప్పటిలానే ఉంటే, ఆ ఇల్లు నాకు అమ్మేస్తే ఎంత బావుంటుందో (దారుణమైన ఆలోచనే కానీ ..... బావుంటుంది :)).

ఘనాఘన సుందరా కరుణారసమందిరా .....

హరి ఓం ..... హరి ఓం ..... హరి ఓం

ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ

ఘనాఘనసుందరా కరుణారసమందిరా .....
ఘనాఘనసుందరా కరుణారసమందిరా
అది పిలుపో ..... మేలుకొలుపో
నీ పిలుపో ..... మేలుకొలుపో
అది మధురమధురమధురమౌ ఓంకారమో
పాండురంగ ..... పాండురంగ .....
ఘనాఘనసుందరా కరుణారసమందిరా .....

ప్రాభాతమంగళ పూజా వేళ
నీ పదసన్నిధి నిలబడి .....నీ పదపీఠిక తలనిడి .....
ప్రాభాతమంగళ పూజా వేళ
నీ పదసన్నిధి నిలబడి
నీ పదపీఠిక తలనిడి
నిఖిల జగతి నివాళులిడదా .....
నిఖిల జగతి నివాళులిడదా
వేడదా ..... కొనియాడదా .....
పాండురంగ ..... పాండురంగ .....

ఘనాఘనసుందరా కరుణారసమందిరా .....

గిరులు ఝరులు విరులు తరులు
నిరతము నీ పాదధ్యానమే .....నిరతము నీ నామగానమే .....
గిరులు ఝరులు విరులు తరులు
నిరతము నీ పాదధ్యానమే .....నిరతము నీ నామగానమే .....
సకలచరాచరలోకేశ్వరేశ్వరా .....
సకలచరాచరలోకేశ్వరేశ్వర
శ్రీకరా ..... భవహరా .....
పాండురంగ ..... పాండురంగ .....

ఘనాఘనసుందరా కరుణారసమందిరా .....
పాండురంగ ..... పాండురంగ .....పాండురంగ ..... పాండురంగ .....
పాండురంగ ..... పాండురంగ .....పాండురంగ ..... పాండురంగ .....
పాండురంగ ..... పాండురంగ .....పాండురంగ ..... పాండురంగ .....
పాండురంగ ..... పాండురంగ .....పాండురంగ ..... పాండురంగ .....

సినిమా : భక్త తుకారాం
సంగీతం : ఆదినారాయణరావు గారు
గానం: గానగంధర్వ ఘంటసాల గారు

ఇంకాసేపట్లో తెల్లవారుతుంది. తూరుపురేఖలు విచ్చుకుంటాయి. ఇంతకన్నా మంచి సమయం ఏది ఈ పాట వినటానికి? :)

Wednesday, August 22, 2007

ఋతురాగాలు

వాసంత సమీరంలా
నునువెచ్చని గ్రీష్మంలా
సారంగసరాగంలా
అరవిచ్చిన లాస్యంలా
ఒక శ్రావణ మేఘంలా .....
ఒక శ్రావణ మేఘంలా
శరచ్చంద్రికల అలలా
హేమంత తుషారంలా
నవ శిశిర తరంగంలా
కాలం జాలం లయలో కలల అలల సవ్వడిలో
సాగే జీవనగానం అణువణువున ఋతురాగం .....
సాగే జీవనగానం అణువణువున ఋతురాగం
వాసంత సమీరంలా .....
నునువెచ్చని గ్రీష్మంలా
సారంగసరాగంలా
అరవిచ్చిన లాస్యంలా .....

చిన్నప్పుడు బాగా చూసిన సీరియల్ ఋతురాగాలు. 4.00 కి అనుకుంటా వచ్చేది. ఎంత పరుగున ఇంటికి వచ్చి చూసేదాన్నో అమ్మతో కలిసి. ఈ పాట టైటిల్ సాంగ్ ఆ సీరియల్ కి. బంటి మ్యూజిక్ డైరెక్టర్. పాడింది సునీత.

జీవితం కూడా కాలగమనం లాంటిదే కదా. కాలానికి ఋతువులున్నట్టే జీవితానికి కూడా ఋతువులుంటాయి అనిపిస్తుంది. గ్రీష్మంలో ఎండలలాగానే కష్టాలు, వసంతంలానే కొత్త ఊహలు, వర్షాకాలంలాంటి బాధలు, శిశిరంలో మంచులానే ఏమీ చెయ్యలేని నిస్సహాయతలు, శరత్తులలాంటి సరదాలు, హేమంతంలాంటి సంతోషాలు, ఉత్తేజాలు. అన్ని ఋతువులనీ స్పృశిస్తూ కాలం సాగినట్టే జీవితం కూడా బాధలనీ, సంతోషాలనీ, ఆనందాలనీ, కష్టాలనీ, నష్టాలనీ, ఆశలనీ అన్నింటినీ స్పృశిస్తూ గమ్యాన్ని చేరుతుంది. కాలానికి జీవితానికి తేడా ఒకటే. జీవితానికి గమ్యం ఉంది. కానీ కాలం అనంతం. ఏ జీవితం కోసం ఆగకుండా సాగుతూనే ఉంటుంది.

Sunday, August 19, 2007

వారం vs వారాంతం

ఈరోజు మా ఊళ్ళో వెంకన్న కళ్యాణం. బాగా జరిగింది. సాయంత్రం గ్రోసరీ షాపింగ్ తో సరిపోయింది. వీకెండ్ అయిపోయింది. వీకెండ్స్ ఎందుకు కళ్ళు మూసి తెరిచేలోగా అయిపోతాయి? మళ్ళీ ఉరుకుల పరుగుల జీవితం. వారాంతం కోసం ఎదురు చూసినంత సమయం పట్టదు అది హుష్ కాకి అని ఎగిరిపోవటానికి. వీక్ డేస్ రెండు ఉండి వీకెండ్ ఐదురోజులుంటే ఎంత బావుంటుంది. ;)

మా ఊళ్ళో చలి పెరుగుతోంది. వేసం కాలం అయిపోయిందనుకోవచ్చేమో.

Saturday, August 18, 2007

ఎడంకాలితో ఫెడీ ...............

మర్చిపోయాను. నాకు ఇంకొంతమందిని కూడా ఎడం కాలితో ఫెడీమని తన్నుదాం అని ఉంటుంది. "సీత నువ్వెవడివిరా నన్ను అడవికి పొమ్మనటానికి అని రాముడిని ఆనాడే అడిగి ఉంటే " ఈ టైప్ డైలాగులు సినిమాలలో నవలల్లో సో కాల్డ్ ఫెమినిస్ట్ ఉపన్యాసాల్లో చాలాసార్లు విన్నాను. అసలు వాళ్ళని వాళ్ళు ఏమనుకుంటారో నాకర్థం కాదు. రాముడిని ఆనాడు సీత అడిగుంటే ఆవిడ సీత అయ్యేది కాదు. ఇదిగో ఈ అడిగిన, అడిగించిన వాళ్ళలానే ఉండేది. అసలు రాముడిని, రాముడు చేసిన పనులని ప్రశ్నించే స్థాయి ఉందా వీళ్ళకి? రాముడు తండ్రి చెప్పిన మాట కోసం భార్యని తీసుకుని నారవస్త్రాలు ధరించి అడవికి వెళ్ళాడు. అడవికి వెళ్ళటం పక్కన పెట్టి వీళ్ళల్లో తండ్రి మాట వినేవారెందరు? పెళ్ళాం మాట విని తల్లితండ్రులని ఇంటి నుండి వెళ్ళగొట్టని వారెందరు?

రాముడు ఏది చేసినా ధర్మాన్ని అనుసరించి చేశాడే తప్ప అధర్మం చెయ్యలేదు. కొడుకుగా తండ్రి మాట వినాలన్న ధర్మాన్ని ఆచరించి అడవికి వెళ్ళాడు. ఆ ధర్మాన్ని ఆచరించే కైకేయి ఆవిడ వరాన్ని వెనక్కి తీసుకుంటాను రాజ్యానికి రమ్మని అభ్యర్ధించినా వెళ్ళలేదు. సీత మీద పూర్తి నమ్మకం ఉన్నా అరణ్యవాసం తర్వాత ఆయనే రాజు అవుతాడని సీతాదేవి రాణి అవుతుందని తెలుసు కాబట్టే ఆ రాజ్యధర్మాన్ని అనుసరించి సీతని అగ్నిప్రవేశం చెయ్యమన్నాడు. ఎవరికోసమైతే కన్నీరుమున్నీరుగా ఏడ్చి కోతిమూకలతో వెళ్ళి రాక్షసుల మీద గెలుపు సాధించాడో అటువంటి సీతని అగ్నిపాలు ఎందుకు చేస్తాడు రాముడు? ఆయనకి తెలుసు సీత అగ్నిపునీత అయితే రాజ్యానికి వెళ్తూనే ఆవిడ మీద ఎటువంటి నిందా పడదనీ, ఆవిడ గురించి గొప్పగా చెప్పుకుంటారనీ. అగ్నిప్రవేశం అప్పుడు సీతకి ఏదన్నా అయితే నష్టం రాముడికే కానీ ఇంకెవరికీ కాదుగా? అయినా రాముడు సీతని అగ్నిప్రవేశం చెయ్యమన్నాడంటే అది రాజ్యధర్మం, పతిధర్మం ఆచరించే.

చాకలివాడు సీత మీద నింద వేస్తే ఆ నింద నిజం కాదని తెలుసు కానీ రాజుగా ప్రజల అభిప్రాయాలనీ ఇష్టాఇష్టాలనీ గౌరవించాలి. రాజు స్థానంలో ఉన్నప్పుడు ఆలోచించాల్సింది కేవలం ప్రజల గురించే. రాజుగా పదవీస్వీకారం చెయ్యగానే వ్యక్తిగతజీవితం గురించి ఆలోచించటం మానెయ్యాలి. తన సుఖాలని పక్కనబెట్టి ప్రజల గురించి ఆలోచించాలి. అంతే కానీ ఈ కాలం నాయకులలా ప్రజల సుఖం కోసం నా జీవితాన్ని పునరంకితం చేస్తాను అని నోటి చివర మాటలు చెప్పటం కాదు. రాముడు కూడా రాజుగా చెయ్యవలసిన ధర్మాన్ని చేశాడు. సీతకి దూరం అవ్వాల్సొస్తుందని లక్ష్మణుడిని, భరతుడిని, శతృఘ్నుడిని రాజ్యభారం తీసుకోమంటే వారు తీసుకోకపోతే పెద్దకొడుకుగా ఇంక తప్పక రాజ్యధర్మాన్ని ఆచరించి సీతని అడవికి వెళ్ళమన్నాడు. తన సుఖం తను చూసుకునేవాడైతే చాకలివాడు కాదు కదా కన్నతల్లి చెప్పినా సీతని అడవికి పంపేవాడు కాదుగా. సరే పేరు కోసం పంపాడు అనుకుందాం. కనీసం తన సుఖం కోసం రెండో పెళ్ళి అయినా చేసుకునేవాడుగా?. ఎందుకు ఒకే మాట, ఒకే బాణం, ఒకే భార్య అన్న సూత్రాన్ని నమ్మాడు, ఆచరించాడు?

ప్రతి అడ్డమైనవాడికీ ఆ రాముడు లోకువైపోయాడు. ఆయన చేసిన ఘోరమైన తప్పేంటంటే ఈ వెధవాయిల కోసం తన భార్యని దూరం చేసుకోవటం, పిల్లల బాల్యాన్ని అనుభవించకపోవటం, ఒంటరితనాన్ని అనుభవించటం. వీళ్ళకి కావలసింది రామరాజ్యం కాదు, రాముడి వంటి రాజూ కాదు. వీళ్ళకి కావలసింది పరాయి పాలనే. వాళ్ళు నెత్తిన కూచుని అన్నివైపులనించి అణిచేస్తుంటే అప్పుడు హాయిగా ఉంటుంది. ఇలాంటివాళ్ళని ఇంకో నాలుగైదు ఎడంకాళ్ళు అప్పు తెచ్చుకుని మరీ తందాం అనిపిస్తుంది. ఒక్క ఎడం కాలు సరిపోదు వీళ్ళకి.

మేల్కొలుపు ఎప్పుడు?

శ్రీరామనామాలు శతకోటి. ఆయన నామం తేనెకన్నా, చెరుకురసంకన్నా రుచి అన్నారు రామదాసు. బ్రహ్మరుద్రాదులకు సతతము ఆత్మమంత్రమైన రామనామ భజన చెయ్యమంటారు త్యాగరాజస్వామి. రామనామం రామబాణంతో సమానం అని సాక్షాత్తూ హనుమంతులవారే అన్నారు. శ్రీరామ అన్న మూడక్షరాల నామానికి దాసులయినవారెందరు. నాకు నచ్చే పేర్లలో శ్రీరామ్ ఒకటి. వినటానికి ఎంత బావుంటుందో. అసలు విష్ణువు అన్ని అవతారాల్లోకి నాకు నచ్చినది రాముడి అవతారం. మిగతా అవతారాల్లో దేవుడు కాబట్టి మాయలని, శక్తిని చూపించాడేమో కానీ రాముడి అవతారంలో ఆయన సాధించిన ఘనత అంతా ఒక మానవుడిగా, సాధారణ మనిషిగా. కొడుకుగా ఎలా ఉండాలో, భర్తగా ఎలా ఉండాలో, అన్నగా, రాజుగా ఏ ధర్మాలని పాటించాలో మాటల్లో చెప్పలేదు. చేసి చూపించాడు. అటువంటి ఆదర్శపురుషుడు పుట్టిన స్థలంలో గుడి లేకపోవటం శోచనీయం. అయోధ్యకి వెళ్ళినప్పుడు నిజంగా కడుపులో మెలిపెట్టి తిప్పినంత బాధ వేసింది. ధర్మాన్ని ఆచరించటం నేర్పిన రాముడి నెత్తిన కేవలం ఒక గొడుగులాంటి గుడ్డ అడ్డం పెట్టి ఉండటం చూస్తే ఏ రామభక్తుడికైనా పట్టరాని దు:ఖం కలుగుతుందేమో. ఆయన దర్శనం కోసం వెళ్ళినప్పుడు రకరకాల సెక్యూరిటీ చెక్స్ ని దాటుకుంటూ అఖరికి మంచినీళ్ళ సీసా కూడా తీసుకెళ్ళడానికి లేకుండా ..... మన దేశంలో మన ఇష్టదైవాన్ని దర్శించుకోవటానికి ఇన్ని రెస్ట్రిక్షన్స్ ఏంటో అర్థం కాదు. కనీసం ఆయన నెత్తిన ఎండా వానా బారినపడకుండా ఒక గూడు ఉందా అంటే అదీ లేదు. మహారాజు ఆయన. రామరాజ్యం అంటే ఇలా ఉంటుంది అని చూపించిన రవికులశేఖరుడు. ఈరోజు తల దాచుకోవటానికి గూడు కూడా లేదు. కాశీకి వెళ్తే అక్కడ ఉండవలసిన చోట గుడి లేదు. మధురకి వెళ్తే అక్కడా అంతే. సరే. అవన్నీ ఎప్పుడో జరిగాయి, పరాయి పాలనలో ఉన్నప్పుడు, అందుకే మనమేమీ చెయ్యలేకపోయాం అనుకుందాం. కానీ ఈరోజు? ఎప్పుడో యుగాల క్రితం నిర్మించినది అయినా చెక్కుచెదరకుండా ఉన్న సేతువుని ఎందుకు ధ్వంసం చెయ్యటం? ఎందుకింత అధమ స్థితిలో ఉన్నాం మనం? కట్టటం ఎలానూ చేతకాదు. ఉన్నవాటిని కూడా చెడగొట్టుకోవటం మనకి తెలిసినట్టు ఇంకెవరికీ తెలియదేమో. ఇదేమిటయ్యా అని అడిగితే కరడుగట్టిన హిందూవాది అయిపోతారు. ఎవరింటికన్నా వెళ్ళి వాళ్ళ వస్తువులు నాశనం చేస్తే వాళ్ళు ఊరుకోరుగా. కనీసం ఇదేంటని అయినా అడుగుతారుగా. ఆ అడగటం హిందూవాదో ఇస్లాంవాదో అవటం అయిపోతుందా? గట్టిగా అడిగితే మతమౌఢ్యం అంటారు. అసలు హిందుత్వం మతం ఎలా అయింది? హిందుత్వం అంటే ఒక సంస్కృతి కానీ మతం కానే కాదు. ఆ సంస్కృతి నించి మిగతా మతాలు పుట్టుకొచ్చాయి అన్నది జగమెరిగిన నిజం. మరింక హిందుత్వానికి ఎవరికి తోచిన అర్థాలు వాళ్ళిచ్చేసుకుని నాలిక ఎటు తిరిగితే అటు మాట్లాడటంలో అర్థం ఉందా? మనదేశంలో మనకి గౌరవం నిలవాలంటే ఏం చెయ్యాలి? సాధ్వి రితంభర చెప్పిన మాట గుర్తొస్తోంది. సాత్వికంగానే ఉండు. మంచిగానే మాట్లాడు. కానీ వేలికి సుదర్శనచక్రం ధరించి మాట్లాడు. ఎదుటివాడికి తను తప్పు మాట్లాడితే ఆ సుదర్శనచక్రాన్ని ఉపయోగిస్తావనే భయం కలగాలి. అప్పుడు నీకు రావలసిన గౌరవం నీకు దక్కుతుంది. ఆవిడ నూరుశాతం కరెక్ట్ కదూ.

శ్రీరామ నామాలు శతకోటి .....

ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ .....

శ్రీరామ నామాలు శతకోటి .....
ఒక్కొక్క పేరు బహుతీపి ..... బహుతీపి
శ్రీరామ నామాలు శతకోటి .....

తండ్రి ఆనతి తలదాల్చు తనయుడు దశరధరామయ్య స్థవనీయుడు .....
తండ్రి ఆనతి తలదాల్చు తనయుడు దశరధరామయ్య స్థవనీయుడు
కడుమేటి విలు విరిచి కలికిని చేపట్టు కళ్యాణరామయ్య కమనీయుడు ..... కమనీయుడు

శ్రీరామ నామాలు శతకోటి .....
ఒక్కొక్క పేరు బహుతీపి ..... బహుతీపి

శ్రీరామ నామాలు శతకోటి .....

సుదతి జానకి తోడ శుభ సరసమాడేటి సుందరరామయ్య సుకుమారుడు .....
సుదతి జానకి తోడ శుభ సరసమాడేటి సుందరరామయ్య సుకుమారుడు
కోతిమూకలతో ..... ఆ ఆ ఆ
కోతిమూకలతో లంక పై దండెత్తు కోదండరామయ్య రణధీరుడు ..... రణధీరుడు

శ్రీరామ నామాలు శతకోటి .....
ఒక్కొక్క పేరు బహుతీపి ..... బహుతీపి
శ్రీరామ నామాలు శతకోటి .....

పవమానసుతుడు పాదాలు పట్టగా పట్టాభిరామయ్య పరంధాముడు .....
పవమానసుతుడు పాదాలు పట్టగా పట్టాభిరామయ్య పరంధాముడు
అవనిలో సేవించు ఆశ్రితుల పాలించు అచ్యుతరామయ్య అఖిలాత్ముడు ..... అఖిలాత్ముడు

శ్రీరామ నామాలు శతకోటి .....
ఒక్కొక్క పేరు బహుతీపి ..... బహుతీపి
శ్రీరామ నామాలు శతకోటి .....

సినిమా : మీనా
సంగీతం : రమేష్ నాయుడు
గానం : పి.సుశీల గారు

విజయనిర్మల దర్శకత్వం వహించిన మొదటి సినిమా. సినిమా నేను చూడలేదు కానీ ఈ సినిమా తీసింది యద్దనపూడి సులోచనారాణి గారి నవల మీనా ఆధారంగా. సాధారణంగా నవలని సినిమాగా తీసేటప్పుడు చాలా మార్పులు చేస్తారు. నవల నచ్చినవారికి సాధారణంగా సినిమా నచ్చదు. కానీ ఈ సినిమాని యథాతథంగా తీసిందట విజయనిర్మల. అందుకే సినిమా కూడా బావుంటుంది అని అన్నారు. చూడాలి ఎప్పుడో.

మీనా నవల నాకు చాలా బాగా నచ్చిన నవల. ఇందుకు నచ్చింది అని చెప్పటం కష్టం. బహుశా పల్లెటూరి వాతావరణం. అందులో హీరో హీరోయిన్లు చాలా సాధారణమైనవారు కావటం, ఏమో ఇదీ అని చెప్పటం కష్టమే. కానీ నాకు ఎంత బాగా నచ్చిన నవలంటే ఇప్పటికి పదుల సంఖ్యలో చదివుంటాను. చదివీ చదివీ మా ఇంటి పుస్తక భాండాగారంలొ ఆ పుస్తకం చిరిగింది కూడా. :)

ఈ సినిమాలో పాటలు అన్నీ బావుంటాయి. ముఖ్యంగా మల్లెతీగవంటిది పాట చాలా అర్థవంతమైన పాట. దాని గురించి ఇంకోసారి.

Friday, August 17, 2007

ఆగకోయి భారతీయుడా

ఈరోజు ఒక ఆర్టికల్ చదివాను. ఇండియా అమెరికా స్థాయికి రావాలంటే చాలా యేళ్ళు పడుతుందని ప్రస్తుతం దరిదాపుల్లో లేదని ఒక సర్వేలో తేల్చారట. సర్వే చేసి నిజం తెలుసుకోవాలనుకునేంత దడ పుట్టించామా? పర్వాలేదు. ఈ లెక్కన ఆ భయాన్ని నిజం చెయ్యటం ఎంతో దూరంలో లేదు.


ఆగకోయి భారతీయుడా కదలి సాగవోయి ప్రగతిదారులా .....

జడకుప్పెలు, నాగరం, చామంతిబిళ్ళ

వెలుగు నీడలులో పాడవోయి భారతీయుడా పాట రాద్దామని చాలారోజుల తర్వాత ఆ పాట విన్నాను. ఆ సినిమాలో పాటలన్నీ నచ్చుతాయి నాకు కానీ ఈ పాట కొంచెం స్పెషల్. పాట భావం, అర్థం, గానం ఇవన్నీ ఒక కారణం అయితే ఇందులో రాజసులోచన చాలా నచ్చుతుంది నాకు. తెలుగింటి చీరకట్టు, నడుముకి వడ్డాణం, బారెడు జడకి కుప్పెలు, చామంతిబిళ్ళ, పాపిటబిళ్ళ అన్నీ కలిసి అసలు సిసలు ఆంధ్రుల ఆడపడుచులా ఉంటుంది. అసలు జడకుప్పెలు నాగరం చామంతిబిళ్ళ ఇవన్నీ ఇప్పుడు కనిపిస్తున్నాయా? నేను పుట్టినప్పుడు ఇవి కొందామని హైదరాబాదులో బంగారు కొట్లన్నీ తిరిగారట మా వాళ్ళు. అసలవేంటి అని అడిగారట షాప్ వాళ్ళు. ఇంక లాభం లేదని కోస్తాకి వెళ్ళి కొనుక్కొచ్చారు. ఏం లాభం? :( ఈ ఉరుకులు పరుగుల కాలంలో అవి పెట్టుకునేంత జుట్టు మెయింటైన్ చేసే తీరికా ఓపికా ఎక్కడున్నాయి. బారెడు జడలన్నీ మూరెడు పోనీటెయిల్స్ అయ్యాయి. బంగారం ధర పెరిగిందని చంకలు గుద్దుకుంటూ వాటిని భద్రంగా లాకర్లో పెట్టుకోవటం తప్ప ఇంకేం చెయ్యగలం. :(

Thursday, August 16, 2007

కలయా!!! నిజమా!!!

ఈరోజు వింతగా 6.00 కి ఇంటికి వచ్చేశాను. నేనేనా, ఇది నిజమేనా అని నమ్మటానికి చెయ్యి చాలాసార్లు చాలాసేపు గిల్లుకున్నాను. ఇప్పుడీ గాట్లు ఎప్పుడు తగ్గుతాయో ఏంటో.

కలయో!!! నిజమో!!! వైష్ణవమాయో!!! తెలిసీ తెలియని అయోమయములో ..... టట్టరటట్టరటట్టరటా .....

ఈరోజు ఆలూ కూర్మా. అదేంటో ఊహగా చేసినా బానే కుదిరింది. హేంటో!!! ఇదివరకు స్పూను తప్ప గరిట ఎలా ఉంటుందో కూడా తెలీదు. ఇప్పుడు గరిటలు ఎడాపెడా తిప్పేస్తున్నాను. ఇదివరకు వంట మీద ఆసక్తి పెద్ద ఉండేది కాదు. కానీ ఇక్కడికి వచ్చాక ఇంటరెస్ట్ పెరిగింది అంటే కారణం ఏమై ఉంటుంది? గత్యంతరం లేకా? ఏమో!!!

Wednesday, August 15, 2007

పాడవోయి భారతీయుడా ..... ఆడి పాడవోయి విజయగీతిక .....

పాడవోయి భారతీయుడా ..... ఆడి పాడవోయి విజయగీతిక ..... ఆ ఆ ..... ఆ ఆ
పాడవోయి భారతీయుడా ..... ఆడి పాడవోయి విజయగీతిక ..... ఆ ఆ ..... ఆ ఆ
నేడే స్వాతంత్ర్యదినం ..... వీరుల త్యాగఫలం .....

నేడే స్వాతంత్ర్యదినం ..... వీరుల త్యాగఫలం .....
నేడే నవోదయం ..... నీదే ఆనందం .....

ఓ ఓ ఓ ఓ .....

పాడవోయి భారతీయుడా ..... ఆడి పాడవోయి విజయగీతిక ..... ఆ ఆ ..... ఆ ఆ
పాడవోయి భారతీయుడా .....

ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ

స్వాతంత్ర్యం వచ్చెననీ సభలే చేసి సంబరపడగానే సరిపోదోయి .....
స్వాతంత్ర్యం వచ్చెననీ సభలే చేసి సంబరపడగానే సరిపోదోయి
సాధించిన దానికి సంతృప్తిని పొంది అదే విజయమనుకుంటే పొరపాటోయి .....
ఆగకోయి భారతీయుడా ..... కదలి సాగవోయి ప్రగతి దారులా ..... ఆ ఆ ..... ఆ ఆ
ఆగకోయి భారతీయుడా ..... కదలి సాగవోయి ప్రగతి దారులా ..... ఆ ఆ ..... ఆ ఆ
ఆగకోయి భారతీయుడా .....

ఆకాశం అందుకొనే ధరలొకవైపు ..... అదుపులేని నిరుద్యోగమింకొకవైపు
ఆకాశం అందుకొనే ధరలొకవైపు ..... అదుపులేని నిరుద్యోగమింకొకవైపు
అవినీతి బంధుప్రీతి చీకటిబజారు అలముకొన్న నీ దేశం ఎటు దిగజారు
కాంచవోయి నేటి దుస్థితి ..... ఎదిరించవోయి ఈ పరిస్థితీ .....
కాంచవోయి నేటి దుస్థితి ..... ఎదిరించవోయి ఈ పరిస్థితీ .....
కాంచవోయి నేటి దుస్థితి .....

పదవీవ్యామోహాలు ..... కులమతభేదాలు ..... భాషాద్వేషాలు చెలరేగే నేడు .....
పదవీవ్యామోహాలు ..... కులమతభేదాలు ..... భాషాద్వేషాలు చెలరేగే నేడు
ప్రతి మనిషి మరియొకని దోచుకొనేవాడే .....
ప్రతి మనిషి మరియొకని దోచుకొనేవాడే
తన సౌఖ్యం తన భాగ్యం చూసుకొనేవాడే .....
స్వార్ధమీ అనర్ధ కారణం ..... అది చంపుకొనుటే క్షేమదాయకం .....
స్వార్ధమీ అనర్ధ కారణం ..... అది చంపుకొనుటే క్షేమదాయకం
స్వార్ధమీ అనర్ధ కారణం .....

సమసమాజ నిర్మాణమే నీ ధ్యేయం ..... నీ ధ్యేయం .....
సకలజనుల సౌభాగ్యమే నీ లక్ష్యం ..... నీ లక్ష్యం .....
సమసమాజ నిర్మాణమే నీ ధ్యేయం .....
సకలజనుల సౌభాగ్యమే నీ లక్ష్యం .....
సమసమాజ నిర్మాణమే నీ ధ్యేయం .....
సకలజనుల సౌభాగ్యమే నీ లక్ష్యం .....
ఏకదీక్షతో గమ్యం చేరిననాడే
లోకానికి మన భారతదేశం అందించునులే శుభసందేశం .....
లోకానికి మన భారతదేశం అందించునులే శుభసందేశం .....
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ .....
లోకానికి మన భారతదేశం అందించునులే శుభసందేశం
లోకానికి మన భారతదేశం అందించునులే శుభసందేశం

సినిమా : వెలుగునీడలు
సంగీతం : పెండ్యాల నాగేశ్వరరావు గారు
గానం : ఘంటసాల గారు, సుశీల గారు

భారతమాతకు జేజేలు .....

భారతమాతకు జేజేలు .....
బంగరు భూమికి జేజేలు .....
భారతమాతకు జేజేలు
బంగరు భూమికి జేజేలు
ఆసేతుహిమాచల సస్యశ్యామల జీవధాత్రికి జేజేలు .....
ఆసేతుహిమాచల సస్యశ్యామల జీవధాత్రికి జేజేలు

భారతమాతకు జేజేలు .....
బంగరు భూమికి జేజేలు .....

ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ .....
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ .....
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ

ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ

త్రివేణిసంగమ పవిత్ర భూమి
నాల్గు వేదములు పుట్టిన భూమి
గీతామృతమును పంచిన భూమి
పంచశీల బోధించిన భూమి .....
పంచశీల బోధించిన భూమి

భారతమాతకు జేజేలు
బంగరు భూమికి జేజేలు .....

శాంతిదూతగా వెలసిన బాపు .....
జాతిరత్నమై వెలిగిన నెహ్రూ .....
శాంతిదూతగా వెలసిన బాపు
జాతిరత్నమై వెలిగిన నెహ్రూ
విప్లవవీరులు ..... వీరమాతలు .....
విప్లవవీరులు ..... వీరమాతలు
ముద్దుబిడ్డలై మురిసే భూమి .....

భారతమాతకు జేజేలు .....
బంగరు భూమికి జేజేలు .....

సహజీవనము ..... సమభావనము
సమతావాదము వేదముగా
ప్రజాక్షేమము ..... ప్రగతిమార్గము
లక్ష్యములైన విలక్షణభూమి .....
లక్ష్యములైన విలక్షణభూమి

భారతమాతకు జేజేలు .....
బంగరు భూమికి జేజేలు .....
ఆసేతుహిమాచల సస్యశ్యామల జీవధాత్రికి జేజేలు .....
భారతమాతకు జేజేలు
బంగరు భూమికి జేజేలు

ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ

సినిమా : బడిపంతులు వీడియో
సంగీతం : కె.వి.మహదేవన్ ఆడియో
గానం : ఘంటసాల గారు

Monday, August 13, 2007

కృష్ణా నీ బేగనే బారో

కృష్ణా నీ బేగనే బారో .....
బేగనే బారో ముఖవన్నే తోరో
కృష్ణా నీ బేగనే బారో .....


కాలాలందిగీ గజ్జే నిలదబావులి
నీలవర్ణనే నాట్యమాడుతా బారో

కృష్ణా నీ బేగనే బారో .....

ఉడియల్లి ఉడుగజ్జె బెరళల్లి ఒన్నుగుర
కొరళోల్లు హాగిద వైజయంతిమాలే

కృష్ణా నీ బేగనే బారో .....

కాశి పీతాంబర కైయల్లి కొళలు
పూసిత శ్రీగంధ మయోల్లు గమా గమా

కృష్ణా నీ బేగనే బారో .....

తాయిగే బాయల్లి కృష్ణా ..... బాయల్లి
తాయిగే బాయల్లి జగవన్ను తోరిద
జగధోధ్ధారక నమ్మ ఉడుపి శ్రీకృష్ణా

కృష్ణా నీ బేగనే బారో .....
ముఖవన్నే తోరో
కృష్ణా నీ బేగనే బారో
ముజ్జగవనే తోరో
కృష్ణా నీ బేగనే బారో .....

వ్యాసరాయలవారి కృతి
రాగం : యమునాకల్యాణి

ఉడుపి శ్రీకృష్ణుడి మీద పాట. ఉడుపిలో అలంకరణ చాలా బావుంటుందిట కృష్ణుడికి. ఫొటోస్ చూశాను కానీ ఉడుపి వెళ్ళలేదు. శృంగేరి వెళ్ళినప్పుడు మరీ రెండు రోజుల షార్ట్ ట్రిప్ అవటంతో ఉడుపి వెళ్ళలేకపోయాము. కానీ హొరనాడు చూశాం. అమ్మవారు ఎంత బావుందో. చుట్టూ ప్రకృతి ఎంత బావుందో. మేఘాలు చాలా కిందగా వెళ్తూ మనలని తాకుతాయా అన్నట్టు ఉంటాయి. చుట్టూ పచ్చటి అడవి. మేము ఏనుగులని చూశాము. అక్కడి స్థానికుల నమ్మకం ప్రకారం దేవుడి దర్శనం అయ్యాక ఏనుగు కనిపిస్తే చాలా మంచిదట.

శృంగేరి చుట్టుపక్కలే ఉడుపి, ధర్మస్థల అన్నీ రెండూ రోజుల్లో కవర్ చెయ్యచ్చుట. ఈసారి చూడాలి.

Sunday, August 12, 2007

అలవాటు లేని పని.

వంట అయ్యేసరికి 10.00 అయింది. చేసింది ఏంటి అంటే వంకాయ అల్లం కొత్తిమీర కూర, తోటకూర పులుసు. నేను తొందరగా వంట చెయ్యటం ఎప్పుడు నేర్చుకుంటానో ఏంటో.

గరుడ గమన రా రా

గరుడ గమన రా రా నను నీ కరుణనేలుకోరా ..... రామా
పరమ పురుష ఏ వెరపు లేక నీ మరుగుజొచ్చితిని అరమర సేయక
గరుడ గమన రా రా నను నీ కరుణనేలుకోరా ..... రామా

పాలకడలి శయన దశరధబాల జలజనయన
పాలముంచినను నీట ముంచినా
నీ పాలబడితినిక జాలము సేయక

గరుడ గమన రా రా నను నీ కరుణనేలుకోరా ..... రామా

ఏల రావు స్వామీ నను ఇపుడేలుకోవదేమి
ఏలువాడవని చాల నమ్మితిని
ఏల రావు కరుణాలవాల హరి

గరుడ గమన రా రా నను నీ కరుణనేలుకోరా ..... రామా

ఇంత పంతమేలా భద్రగిరీశ వర కృపాలా
చింతలణచి శ్రీరామదాసుని అంతరంగపతివై రక్షింపుము

గరుడ గమన రారా నను నీ కరుణనేలుకోరా ..... రామా
పరమ పురుష ఏ వెరపు లేక నీ మరుగుజొచ్చితిని అరమర సేయక
గరుడ గమన రా రా నను నీ కరుణనేలుకోరా ..... రామా

భద్రాచల రామదాసు కీర్తన
రాగం : పంతువరాళి

రామదాసు గారి కృతులు కొన్నే తెలుసు చాలామందికి. ఆయన రాసిన కొన్ని అపురూపమైన పాటలు ప్రాచుర్యంలో లేవు. ఈ పాట నిత్య సంతోషిణి, ఎస్.పి.బాలసుబ్రమణ్యం పాడగా విన్నాను. రెండూ నచ్చలేదు. ఎస్.పి అయితే మరీ సినిమా పాటలానే పాడాడు. మా అమ్మమ్మ పాడిందే బావుంది.

Saturday, August 11, 2007

మీరజాలగలడా .....

మీరజాలగలడా .....
మీరజాలగలడా నా యానతి వ్రతవిధాన మహిమన్ సత్యాపతి .....
మీరజాలగలడా నా యానతి వ్రతవిధాన మహిమన్ సత్యాపతి .....
మీరజాలగలడా నా యానతి వ్రతవిధాన మహిమన్ సత్యాపతి .....

నటనసూత్రధారి మురారి ఎటుల దాటగలడో నా యానతి వ్రతవిధాన మహిమన్ సత్యాపతి .....
నటనసూత్రధారి మురారి ఎటుల దాటగలడో నా యానతి వ్రతవిధాన మహిమన్ సత్యాపతి .....

మీరజాలగలడా నా యానతి వ్రతవిధాన మహిమన్ సత్యాపతి .....

సుధాప్రణయజలధిన్ వైదర్భికి ఈడ తావు గలదే నాతోనిక వాదులాడగలడా సత్యాపతి .....
సుధాప్రణయజలధిన్ వైదర్భికి ఈడ తావు గలదే నాతోనిక వాదులాడగలడా సత్యాపతి .....

మీరజాలగలడా నా యానతి వ్రతవిధాన మహిమన్ సత్యాపతి .....

మధుర మధుర మురళీగానరసాస్వాదనమున ఆ ఆ ఆఆఆఆ ఆ ఆ
మధుర మధుర మురళీగానరసాస్వాదనమున
అధర సుధారస మదినే గ్రోలగ .....
అధర సుధారస మదినే గ్రోలగ .....

మీరజాలగలడా నా యానతి వ్రతవిధాన మహిమన్ సత్యాపతి .....
మీరజాలగలడా నా యానతి వ్రతవిధాన మహిమన్ సత్యాపతి .....
మీరజాలగలడా .....

సినిమా : శ్రీకృష్ణ తులాభారం
సంగీతం : ఘంటసాల గారు
గానం : పి.సుశీల గారు

పి.సుశీల పాటల్లో ఒక అత్యుత్తమమైన పాట. ఆవిడ గొంతులోనే సత్యభామ మనసులో భావాలన్నీ పలికించారు. ముఖ్యంగా సుధాప్రణయజలధిన్ వైదర్భికి ఈడ తావు గలదే నాతోనిక వాదులాడగలడా సత్యాపతి చరణంలో ఆ గర్వం , కృష్ణుడు ఇంక పూర్తిగా తనవాడే అన్న నమ్మకం గొంతులోనే పలికించారు. జమున గారి నటన కూడా ఒక హైలైట్ ఈ పాటకి. ఎస్.వరలక్ష్మి కూడా పాడారు కానీ ఎందుకో నాకు సుశీల గారి పాటే బావుంది అనిపిస్తుంది.

బోలే రే పపీహరా .....

బోలే రే పపీహరా ..... పపీహరా
బోలే రే పపీహరా ..... పపీహరా
నిత్ ఘన్ బర్సే నిత్ మన్ ప్యాసా ..... ఆ ఆ ఆ ఆ ఆ
నిత్ మన్ ప్యాసా నిత్ మన్ తరసే .....

బోలే రే పపీహరా .....
బోలే రే పపీహరా ..... పపీహరా
బోలే రే పపీహరా .....

పల్కో పర్ ఎక్ బూంద్ సజాయే .....
బైఠీ హూ సావన్ లే జాయే .....
జాయే పీకే దేశ్ మే బర్సే .....
జాయే పీకే దేశ్ మే బర్సే .....
నిత్ మన్ ప్యాసా నిత్ మన్ తరసే .....

బోలే రే పపీహరా .....
బోలే రే పపీహరా ..... పపీహరా
బోలే రే పపీహరా .....

సావన్ జో సందేశా లాయే .....
సావన్ జో సందేశా లాయే
మేరీ ఆంఖ్ సే మోతీ పాయే .....
మేరీ ఆంఖ్ సే మోతీ పాయే
జాన్ మిలే బాబూల్ కే ఘర్ సే .....
జాన్ మిలే బాబూల్ కే ఘర్ సే
నిత్ మన్ ప్యాసా నిత్ మన్ తరసే .....

బోలే రే పపీహరా .....
బోలే రే పపీహరా ..... పపీహరా
బోలే రే పపీహరా .....

సినిమా : గుడ్డి
సంగీతం : వసంత్ దేశాయ్
సాహిత్యం : గుల్జార్
గానం : వాణీ జయరాం గారు


వాణీ జయరాం గారిని తలుచుకోగానే మొదట గుర్తొచ్చేది ఈ పాటే కదా. ఈ పాట విన్నాక లతకి దడ పుట్టి వాణీ జయరాం గారికి ఆఫర్స్ రానీకుండా చేశారన్నది ప్రచారంలో ఉన్న కథ. అంత మంచి గొంతు, పాడగల సత్తా ఉన్న వాణీ జయరాం గారికి తర్వాత పెద్దగా అఫర్స్ రాలేదంటే ఇలాంటి కథలని నమ్మాలనిపిస్తుంది.

ఒక బృందావనం ..... సోయగం

ఒక బృందావనం ..... సోయగం
ఎద కోలాహలం ..... క్షణక్షణం
ఒకే స్వరం సాగేను తీయగా
ఒకే సుఖం విరిసేను హాయిగా

ఒక బృందావనం ..... సోయగం

నే సందెవేళ జాబిలీ
నా గీతమాల ఆమనీ
నా పలుకు తేనె కవితలే
నా కులుకు చిలకపలుకులే
నే కన్న కలల మేడ నందనం
నాలోని వయసు ముగ్ధమోహనం
ఒకే స్వరం సాగేను తీయగా
ఒకే సుఖం విరిసేను హాయిగా

ఒక బృందావనం ..... సోయగం

నే మనసు పడిన వెంటనే
ఓ ఇంద్రధనుసు పొందునే
ఈ వెండి మేఘమాలనే
నా పట్టు పరుపు చేయనే
నే సాగు బాట జాజిపూవులే
నాకింక సాటి పోటి లేదులే
ఒకే స్వరం సాగేను తీయగా
ఒకే సుఖం విరిసేను హాయిగా

ఒక బృందావనం ..... సోయగం
ఒకే స్వరం సాగేను తీయగా
ఒకే సుఖం విరిసేను హాయిగా
ఒక బృందావనం ..... సోయగం

సినిమా : ఘర్షణ (1988)
సంగీతం : ఇళయరాజా
గానం : వాణీ జయరాం

ఈ పాట కేవలం వాణీ జయరాం గారి కోసం వినాలి. ఆవిడ గొంతు నిజంగా దేవుడి వరం అనుకోవాలి. పి. లీల, పి.సుశీల గార్ల తర్వాత నాకు నచ్చిన గొంతు వాణీ జయరాం గారిది. అసలీ పాటలో ఆవిడ గొంతు తీగలా ఒకే విధంగా సాగుతుంది. ఈ పాట హిట్ అవటానికి 100% కారణం వాణీ జయరాం గారే. ఆవిడ గొంతు, ఆ పాడిన పధ్ధతి మూలంగానే ఈ పాట నచ్చింది నాకు.

సమ్ టైమ్స్ విన్నింగ్ ఈజ్ ఎవ్రీథింగ్.

ఇప్పుడే ఒక మంచి సినిమా చూసి వస్తున్నాను. గత మూడు వారాలుగా ఆఫీసులో రక్తం చిందించి చిందించి ఇంక చిందించటానికి రక్తం మిగలక సరే శుక్రవారం కదా తొందరగా ఇంటికి వచ్చి బోలెడు రెస్ట్ తీసుకుందాం అనీ శని ఆదివారాలు ఎవరికీ దొరకకుండా ఎంచక్కా బజ్జుందాం అని మన పంచ వర్ష ప్రణాళికలాగా ఈ వారాంతానికి ఒక ప్రణాళిక పకడ్బందీగా వేశాను. కానీ మధ్యానం ఫోన్. సినిమాకి వెళ్దాం. ఈరోజే రిలీజ్ టికెట్స్ బుక్ చేస్తున్నాను అని. అప్పటికే మా డామేజర్ ఈరోజు కూడా నా సాయంత్రం ఆఫీసుకి బలి ఇద్దామని వీర లెవెల్ లో ప్లానేస్తున్నాడు. సందిగ్ధ పరిస్థితి. ఏం చెయ్యాలో ఏమవుతుందో తెలీదు. చెప్పొద్దూ. చిరాకేసింది. కానీ ఎలాగో ఎనిమిదింటికి ఆఫీసు నించి బైటపడి ఇంటికి చేరుకున్నాను. అప్పటికి సినిమా పేరేంటో కూడా తెలీదు. ఏదో హిందీ సినిమా అని 10.00 కి షో అనీ తెలుసు. అంతే. సరే 9.15 కి బైల్దేరి మెల్లగా వెళ్ళి. పాపకారం, మౌంటెన్ డ్యూ కొనుక్కుని థియేటర్ లో సెటిల్ అయ్యాం. అప్పటికి 5 నిమిషాలు అయింది సినిమా స్టార్ట్ అయి. ఎవరో హాకీ యమా సీరియస్ గా ఆడుతున్నాడు. ఎవరా అని చూస్తే షారుక్ ఖాన్. అరే! షారుక్ ఖాన్ సినిమా కొత్తది రిలీజ్ అయిందా అని కొంచెం ఇంటరెస్ట్ పెరిగి చూడటం మొదలెట్టాను. సినిమా అయ్యేవరకు కదలలేదు.

సినిమా కథ టూకీగా,

కబీర్ ఖాన్ ఇండియా హాకీ టీమ్ కి కెప్టెన్. వరల్డ్ కప్ ఫైనల్స్ లో పాకిస్తాన్ చేతిలో ఓడిపోతుంది ఇండియా టీం. కబీర్ ఖాన్ పాకిస్తాన్ వాళ్ళతో చేతులు కలిపాడనీ, డబ్బుల కోసం దేశానికి ద్రోహం చేశాడనీ, ముస్లిం కాబట్టి టెర్రరిస్ట్ అనీ బోలెడు విమర్శలు వస్తాయి. హాకీ బోర్డ్ చైర్మన్ కూడా షారుక్ ని దోషి గా నమ్ముతాడు. షారుక్ ని టీమ్ నించి పీకేస్తారు. వాళ్ళు ఉండే మొహల్లాలో కూడా దేశద్రోహి అని ముద్ర వేస్తారు. చివరికి షారుక్ ఆ ఇల్లు వదిలి తల్లిని తీసుకుని ఎక్కడికో వెళ్ళిపోతాడు. ఏడేళ్ళ తర్వాత హాకీ వరల్డ్ కప్ కి ఇండియన్ విమెన్ హాకీ టీమ్‌ని పంపించాలి అనుకుని హాకీ బోర్డ్ ఒక నిర్ణయం తీసుకుంటుంది. ఎలాగు ఓడిపోయేదే కాబట్టి సరదాగా హాకీ ఆడటం రాని వారిని అయినా సరే కోచ్ గా నియమించి గడిపేద్దాం అనుకుంటారు. అప్పుడూ షారుక్ రంగప్రవేశం చేసి తను కోచ్ గా ఉండి ఎవరికీ ఆశలు నమ్మకాలు ఏ మాత్రం లేని భారతీయ ఆడవాళ్ళ హాకీ టీమ్‌ని ప్రపంచ కప్ లో గెలిపిస్తాడు.


కొంచెం లగాన్ పోలికలు ఉన్నాయి ప్లస్ చివరికి ఏమవుతుందో కూడా తెలిసిపోతుంది. ఇలాంటి సినిమాలలో కథ కన్నా కథనానికి ప్రాముఖ్యత ఎక్కువ. అది దర్శకుడు చక్కగా మెయింటైన్ చేశాడు. ఎక్కడా చెప్పదలచుకున్న పాయింటు నించి డీవియేట్ అవటం కానీ చెప్పాలనుకున్నదాని కన్నా ఎక్కువ చెప్పటం కానీ లేదు. నీట్ గా చెప్ప్దలచుకున్నది స్పష్టంగా చెప్పారు. అలా అని కేవలం ప్రపంచ కప్ లో గెలవటం ఒకటే పాయింటు కాకుండా రెండు మూడు చేర్చినా ఎక్కడా బోర్ కొట్టించలేదు. భారద్దేశ ముస్లింస్ టెర్రరిస్ట్స్ కారు, వాళ్ళకి దేశభక్తి ఉంటుంది అన్నది ఒక పాయింటు అయితే, హాకీ మన దేశ అధికారిక ఆట అయినా క్రికెట్ కంటే చాలా తక్కువ ఆదరణ ఉండటం గురించి, భారతీయ స్త్రీలు కేవలం వంటింటి కుందేళ్ళు కారనీ, వాళ్ళకీ కెరియర్ చాలా ముఖ్యమనీ, కేవలం ఒకరికి భార్యగా మిగిలిపోవటానికి వారు ఎంత మాత్రం అంగీకరించరనీ ఇలా చాలా పాయింట్లు కవర్ చేశారు. కానీ ఎక్కడా దేన్నీ జీళ్ళపాకంలా సాగదీయలేదు.

రకరకాల రాష్ట్రాలనించీ రకరకాల అంతస్థులనించీ భాషాభేదాలతో విచిత్రమైన మనస్తత్వాలతో వచ్చిన 16 మంది అమ్మాయిలని ఒక చోట చేర్చి వాళ్ళల్లో టీం స్పిరిట్ నింపి ఆత్మవిశ్వాసం పెంచి ఆటని ఆటగా కాక ఒక లక్ష్యంగా ఎలా మార్చుకోవాలో, మార్చుకుని ఎలా సాధించాలో చక్కగా చెప్పాడు. షారుక్ కూడా ఎక్కడా షారుక్ లా అనిపించలేదు. కబీర్ ఖానే కనిపించాడు. అదొకటి నచ్చింది. వెర్రి మొర్ర్రి బాలీవుడ్ హీరో వేషాలెయ్యకుందా బాగా చేశాడు. షారుక్ ఇంకా ఇద్దరు ముగ్గురు నుక్కడ్ సీరియల్ లో వాళ్ళు తప్ప మిగతా అందరూ కొత్తవాళ్ళు. ముఖ్యంగా అమ్మాయిలు చక్కగా చేశారు. పాటలు అన్నీ బాక్ గ్రౌండ్ లో వచ్చేవే. కానీ బావున్నాయి. విన్నింగ్ షాట్ సీన్ ఇంకా కొంచెం క్రిస్పీగా తీస్తే బావుండేది అనిపించింది. చూడాల్సిన సినిమా. నేను రికమెండ్ చేస్తాను. ఇంతకీ సినిమా పేరు చెప్పలేదు కదా. చక్ దే ఇండియా.

నాకు బాగా నచ్చింది, అమ్మాయిల దగ్గర షారుక్ అనే మాట.

" ముఝే స్టేట్స్ కే నాం న సునాయీ దేతే హై నా దిఖాయీ దేతే హై. సిర్ఫ్ ముల్క్ కే నాం దిఖాయీ దేతీ హై. ఇండియా. "

మనం దేశం కోసం మొదట ఆలోచించాలనీ, ఆడాలనీ తర్వాత టీం గురించి ఆలోచించాలనీ ఆ తర్వాత తన గురించి ఆలోచించాలనీ అంటాడు. ఎంత నిజం కదా. :)

సినిమాలో అన్నట్టు " సమ్ టైమ్స్ విన్నింగ్ ఈజ్ ఎవ్రీథింగ్. "

కుచ్ కరియే కుచ్ కరియే
నస్ నస్ మేరీ ఖౌలే హోయే కుచ్ కరియే .....
కుచ్ కరియే కుచ్ కరియే
బస్ బస్ బడా బోలే అబ్ కుచ్ కరియే
హో కొయీ తో చల్ జిద్ ఫడియే
డూబే దరియే యా మరియే
హాయే..కొయీ తో చల్ జిద్ ఫడియే
డూబే దరియే యా మరియే .....

చక్ దే .....
హో చక్ దే ఇండియా
చక్ దే .....
హో చక్ దే ఇండియా

నో వేర్ టు రన్ నో వేర్ టు హైడ్
దిస్ ఈజ్ ద టైం టు డూ ఇట్ నౌ

Thursday, August 9, 2007

నే తొలిసారిగా కలగన్నది నిన్నే కదా .....

నే తొలిసారిగా కలగన్నది నిన్నే కదా
నా కళ్ళెదురుగా నిలుచున్నది నువ్వే కదా
స్వప్నమా నువ్వు సత్యమో తేల్చి చెప్పవేం ప్రియతమా
మౌనమో మధురగానమో తనది అడగవేం హృదయమా
ఇంతలో చేరువై అంతలో దూరమై అందవా స్నేహమా .....

నే తొలిసారిగా కలగన్నది నిన్నే కదా
నా కళ్ళెదురుగా నిలుచున్నది నువ్వే కదా .....

రెక్కలు తొడిగిన తలపు నువే కాదా నేస్తమా
ఎక్కడ వాలను చెప్పు నువే సావాసమా
హద్దులు చెరిపిన చెలిమి నువై నడిపే దీపమా
వద్దకు రాకని ఆపకిలా అనురాగమా
నడకలు నేర్పిన ఆశవు కదా
తడబడనీయకు కదిలిన కథ
వెతికే మనసుకు మమతే పంచుమా .....

నే తొలిసారిగా కలగన్నది నిన్నే కదా
నా కళ్ళెదురుగా నిలుచున్నది నువ్వే కదా .....

ప్రేమా నీతో పరిచయమే ఏదో పాపమా
అమృతమనుకొని నమ్మటమే ఒక శాపమా
నీ ఒడి చేరిన ప్రతి మదికి బాధే ఫలితమా
తీయని రుచి గల కటిక విషం నువ్వే సుమా
పెదవుల పై చిరునవ్వుల దగా
కనపడనీయవు నిప్పుల సెగ
నీటికి ఆరని మంటల రూపమా .....

నీ ఆటేమిటో ఏనాటికి ఆపవు కదా
నీ బాటేమిటో ఏ జంటకి చూపవు కదా
తెంచుకోనీవు పంచుకోనీవు ఇంత చెలగాటమా
చెప్పుకోనీవు తప్పుకోనీవు నీకు ఇది న్యాయమా
పేరులో ప్రణయమా తీరులో ప్రళయమా .....
పంతమా ..... బంధమా .....

నీ ఆటేమిటో ఏనాటికి ఆపవు కదా
నీ బాటేమిటో ఏ జంటకి చూపవు కదా .....


సినిమా : సంతోషం
సాహిత్యం : సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు
సంగీతం : ఆర్.పి.పట్నాయక్
గానం : ఉష

అసలీ పాట పాడింది ఉష అంటే నేను మొదట్లో నమ్మలేదు. ఆ అమ్మాయి గొంతు చాలా మార్పుగా ఉంది ఈ పాటలో. ఆ అమ్మాయి పాడుతా తీయగాలో పాడిన శివశంకరీ ఇంకా గుర్తుంది. చాలా బాగా పాడింది. అప్పుడు ఆ అమ్మాయి గెలుస్తుందా గెలవదా అని తెగ చూసేవాళ్ళం. :)

Wednesday, August 8, 2007

ఫెడీఈఈఈఈఈ

నాకెందుకో దేవుడు లేడు అనేవాళ్ళని ఫెడీమని ఒక్కటిచ్చుకోవాలనిపిస్తుంది. వాళ్ళు కన్న ఇద్దరు ముగ్గురు పిల్లలనే సవ్యంగా పెంచటం చేతకాదు. కానీ ఇన్ని కోట్ల మందిని సృష్టించి పంచ భూతాల ద్వారా సహజమైన వనరులనిచ్చి ఏది ఎలా ఉపయోగించుకోవాలో ఆలోచించుకునే బుధ్ధినిచ్చి ఎంత చేసినా ఆయన ఉనికినే ప్రశ్నిస్తున్నారంటే ..... హ్మ్మ్మ్. కొంతమంది ఉంటారు. దేవుడు ఉన్నాడంటే ఒప్పుకోరు మరి సృష్టి ఎలా నడుస్తోందయ్యా అంటే ఏదో బలీయమైన శక్తి ఉంది అంటారు. సరే. ఆ శక్తే దేవుడు అనుకోవచ్చు కదా అంటే. అబ్బెబ్బే!!! దేవుడు లేడు అంటారు. మరి ఆ బలీయమైనదేమిటయ్యా అంటే ఏదో శక్తి. సరే!!! శక్తి అంటే అమ్మవారే కదా, ఆ బలీయమైన శక్తి అమ్మవారు అనుకోవచ్చు కదా అంటే మళ్ళీ అబ్బెబ్బెబ్బే!!! మరి వాళ్ళకి దేవుడు అంటే విరక్తో దేవుడు అన్న పదం అంటే విరక్తో నాకు అర్థం కాదు. ఇదిగో ఇలాంటివాళ్లని చూస్తేనే ఫెడీమని ఒక్కటిచ్చుకో బుధ్ధి వేస్తుంది.

Tuesday, August 7, 2007

ఎవరయ్యుంటారు?

ఎవరు నేర్పించారు పూలకి పొద్దు పొడవక ముందే పూయాలని? రకరకాల రంగుల్లో మధ్య పుప్పొడి చెదరకుండా ఆ పుప్పొడి రంగు వేరుగా పూల రంగు వేరుగా, కొన్ని పూలు మరీ రంగులు రంగులుగా ఎవరు నేర్పించి ఉంటారు? ఇంట్లో ఉన్న బిస్కెట్ కలర్ మందారాన్ని చూస్తే నాకెప్పుడూ ఆశ్చర్యమే. మధ్యలో మరూన్ కలర్ ఎప్పుడూ దాని సరిహద్దు దాటి బైటికి రాలేదు. అలా ఎవరు నేర్పించారు? నేను నా టీం ఎంత కష్టపడి పని చేసినా క్యూ.ఏ. వాళ్ళు ఎప్పుడూ రెడీగా ఉంటారు బగ్స్ లిస్ట్ తో. మరి ఈ సహజంగా ప్రకృతి సిధ్ధంగా ఏర్పడినవాటిలో ఎందుకు మనం బగ్స్ , డిఫెక్ట్స్ కనిపెట్టలేకపోతున్నాము? నాస్తికవాదులారా కాస్త సమాధానం ఇస్తారా?

ఎవరు నేర్పేరమ్మ ఈ కొమ్మకు

ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
ఎవరు నేర్పేరమ్మ ఈ కొమ్మకు

పూలిమ్మనీ రెమ్మ రెమ్మకు .....
ఎవరు నేర్పేరమ్మ ఈ కొమ్మకు పూలిమ్మనీ రెమ్మ రెమ్మకు
ఎంత తొందరలే హరి పూజకు ప్రొద్దు పొడవకముందే పూలిమ్మనీ .....
ఎవరు నేర్పేరమ్మ ఈ కొమ్మకు పూలిమ్మనీ రెమ్మ రెమ్మకు

కొలువైతివా దేవి నాకోసము .....
కొలువైతివా దేవి నాకోసము
తులసీ ..... తులసీ దయాపూర్ణకలశీ
మల్లెలివి నా తల్లి వరలక్ష్మికి ..... ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
మల్లెలివి నా తల్లి వరలక్ష్మికి .....
మొల్లలివి నన్నేలు నా స్వామికి

ఎవరు నేర్పేరమ్మ ఈ కొమ్మకు పూలిమ్మనీ రెమ్మ రెమ్మకు
ఎంత తొందరలే హరి పూజకు ప్రొద్దు పొడవకముందే పూలిమ్మనీ .....

ఏ లీల సేవింతు ఏమనుతు కీర్తింతు .....
ఏ లీల సేవింతు ఏమనుతు కీర్తింతు
సీత మనసే నీకు సింహాసనం
ఒక పువ్వు పాదాల ..... ఒక దివ్వె నీ మ్రోల .....
ఒక పువ్వు పాదాల ..... ఒక దివ్వె నీ మ్రోల
ఒదిగి నీ ఎదుట ఇదే వందనం .....
ఇదే వందనం .....

సినిమా : ఈనాటి బంధం ఏనాటిదో
సాహిత్యం : దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు
సంగీతం : ఎస్.రాజేశ్వరరావు గారు
గానం : పి.సుశీల గారు

Saturday, August 4, 2007

కృష్ణ పక్షం

సౌరభములేల చిమ్ము పుష్పవ్రజంబు?
చంద్రికలనేల వెదజల్లు చందమామ?
ఏల సలిలంబు పారు? గాడ్పేల విసరు?
ఏల నా హృదయంబు ప్రేమించు నిన్ను?

మావిగున్న కొమ్మను మధుమాసవేళ
పల్లవము మెక్కి కోయిల పాడుటేల?
పరుల తనయించుటకో? తన బాగు కొరకో
గానమొనరింపక బ్రతుకు గడవబోకో?


కృష్ణ శాస్త్రి గారిని తలుచుకోగానే ఈ కవిత గుర్తొచ్చింది. ప్రేమించటాన్ని ఎంత సహజమైనదిగా వివరించారో. గాలి ఎందుకు వీస్తోందో, సూర్యుడు వెలుగెందుకు ఇస్తున్నాడో, చంద్రుడు ఠంచనుగా వెన్నెలనెందుకు ఇస్తున్నాడో, ప్రేమ ఎందుకు పుడుతుందో ఎవరూ చెప్పలేరు. కొన్ని జంటలని చూస్తే నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఏ రకంగా ప్రేమించుకున్నారా వాళ్ళు అని. పొడుగు పొట్టి లావు సన్నం రంగు రూపం ఎందులోనూ సారూప్యత ఉండదు. కొన్నైతే మరీ ఎక్స్ ట్రీం కేసెస్ చూశాను. ఎలా ప్రేమ కలిగింది అన్నది ఎంత బుర్ర బద్దలు కొట్టుకున్నా అర్థం కాలేదు. ఫైనల్ గా నాకు అర్థం అయింది ఒక్కటే ప్రేమని ప్రేమించగలం కానీ పుట్టించలేము. కాని ఎవరో అన్నట్టు ప్రేమని ప్రేమగా ఎగతాళి చేసేవారే ఎక్కువ. ప్రేమని అర్థం చేసుకోవాలంటే ప్రేమ పిపాసి అయ్యుండాలా? కానీ ప్రేమ పిపాసుల కన్నా పిశాచులే ఎక్కువ ఉంటే మరి ప్రేమెక్కడా?

పూట పూట నీ పూజ కోసమని పూవులు తెచ్చాను
ప్రేమ భిక్ష నువ్వు పెట్టగలవని దోసిలి ఒగ్గాను
నీ అడుగులకు మడుగులొత్తగా ఎడదను పరిచాను
నీవు రాకనే అడుగు పడకనే నలిగిపోయాను

రాకోయీ అనుకోని అతిథి

రాకోయీ అనుకోని అతిథి
కాకి చేత కబురైనా పంపక
రాకోయీ అనుకోని అతిథి

వాకిటి తలుపులు తెరువనె లేదు
ముంగిట ముగ్గులా తీర్చనే లేదు
వేళ కాని వేళా .....
ఈ వేళ కాని వేళ ..... ఇంటికి

రాకోయీ అనుకోని అతిథి
రాకోయీ .....

సిగలో పూవులు ముడవాలంటే ..... సిరిమల్లెలు వికసింపనె లేదు
కన్నుల కాటుక దిద్దాలంటే ..... నిద్దుర నీడలా వీడనే లేదు
పాలు వెన్నలు తేనే లేదు ..... పంచభక్ష్యముల చేయనే లేదు
వేళ కాని వేళా ..... ఈ వేళ కాని వేళ ..... విందుకు

రాకోయీ అనుకోని అతిథి
రాకోయీ .....

ఊరక దారినె పోతూ పోతూ అలసి వచ్చితివో
ఒంటరిగా ఉన్నానని నే తెలిసే వచ్చితివో .....
ఒంటరిగా ఉన్నానని నే తెలిసే వచ్చితివో
రమ్మనుటకు సాహసము చాలదు
పొమ్మనుటా మరియాద కాదది
వేళ కాని వేళా .....ఈ వేళ కాని వేళ ..... త్వరపడి

రాకోయీ అనుకోని అతిథి
కాకి చేత కబురైన పంపక
రాకోయీ అనుకోను అతిథి
రాకోయీ .....

సినిమా : శ్రీరాజరాజేశ్వరీవిలాస్ కాఫీ క్లబ్.
సాహిత్యం : దేవులపల్లి కృష్ణ శాస్త్రి గారు
సంగీతం : పెండ్యాల నాగేశ్వరరావు గారు
గానం : పి.సుశీల గారు

ఈ సినిమా పేరు చిన్నప్పుడు విని ఏదో క్లబ్బు గట్రా యాక్ అనుకోవటం నాకింకా గుర్తు. :) చిన్నప్పుడు రేడియో బెనిఫిట్స్ ఏవంటే కొన్ని మంచి మంచి పాటలు ఇప్పుడు చాలా తక్కువ వినిపించే పాటలు మనసులో ముద్రించుకుపోవటం. నేను పుట్టక ముందు వచ్చిన పాటలు కూడా ఇప్పటికీ గుర్తున్నాయంటే అవి చిన్నప్పుడు ఎక్కువగా రేడియో లో వినటమేనేమో. మరి ఇప్పటి పాటలు ఎందుకు గుర్తుండవు అంటే??? బహుశా పాటలు మరీ ఎక్కువైపోవటం కావచ్చు (మందెక్కువైతే మజ్జిగ పల్చన లాగా) (( మందు అని అర్థం అవుతుందా? వివరణ ఇవ్వటం మంచిదేమో. మందు ఎక్కువ అవటం కాదు మంది ఎక్కువవటం )), రెండో అనుమానం పాటల క్వాలిటీ తగ్గటం, మూడు : వినటానికి టైం లేకపోవటం. నాలుగు : విన్న వెంటనే మర్చిపోవటం. నాలుగు రెండోదానికి పర్పెండుక్యులర్లీ ఈక్వల్.

కృష్ణ శాస్త్రిగారి పాటలు చాలా మటుకు నాకెందుకో అర్థం కావు. కవితలు బానే అర్థం అవుతాయి కానీ పాటలే. ఆయన పాటలకి సంగీతం కట్టటం కష్టం ఏమో అనిపిస్తుంది.

Friday, August 3, 2007

ఆ ఆ ఆ

జగమే మారినదీ మధురముగా ఈ వేళా .....
జగమే మారినదీ మధురముగా ఈ వేళా
కలలూ కోరికలూ తీరినవీ మనసారా
జగమే మారినదీ మధురముగా ఈ వేళా .....


మనసాడెనే మయూరమై పావురములు పాడే ..... ఎల పావురములు పాడే
మనసాడెనే మయూరమై పావురములు పాడే ..... ఎల పావురములు పాడే
ఇదే చేరెను గోరువంక రామ చిలుక చెంత అవి అందాల జంట .....
ఇదే చేరెను గోరువంక రామ చిలుక చెంత అవి అందాల జంట
నెనరు కూరిమి ఈనాడే పండెను .....
నెనరు కూరిమి ఈనాడే పండెను
జీవితమంతా చిత్రమైన పులకింతా .....

జగమే మారినదీ మధురముగా ఈ వేళా .....
కలలూ కోరికలూ తీరినవీ మనసారా
జగమే మారినదీ మధురముగా ఈ వేళా .....

విరజాజులా సువాసనా స్వాగతములు పలుక ..... సుస్వాగతములు పలుక
తిరుగాడును తేనెటీగ తీయదనము కోరి ..... అనురాగాలా తేలి
ఎదలో ఇంతటి సంతోషమెందుకో .....ఎదలో ఇంతటి సంతోషమెందుకో
ఎవ్వరి కోసమో ..... ఎందుకింత పరవశమో .....

జగమే మారినదీ మధురముగా ఈ వేళా .....
కలలూ కోరికలూ తీరినవీ మనసారా
జగమే మారినదీ మధురముగా ఈ వేళా .....

సినిమా : దేశద్రోహులు
నటీనటవర్గం : ఎన్.టి.రామారావు, దేవిక
సంగీతం : సాలూరి రాజేశ్వరరావు గారు
గానం : ఘంటసాల గారు, సుశీల గారు.

ఈ పాట వింటుంటే మనకి కూడా ఈ లోకం మధురంగా ఉన్నట్టు కలలు కోరికలు తీరినట్టు అనిపించదూ? ఈ మధ్య అదేదో ' ఫీల్ ' అని వాడుతున్నారే అలా ఉందనిపిస్తుంది ఈ పాట. ఇదే పాట ఘంటసాల గారు పాడిన సోలో వర్షన్ కూడా ఉంది. అందులో చివరి రెండు లైన్లు
కమ్మని భావమే కన్నీరై నిండెను
ప్రియమగు చెలిమి సాటిలేని కలిమి
అని ఉంటాయి.
పైన పాటని డ్యూయెట్ అనవచ్చా అన్నది అనుమానం నాకు. ఎందుకంటే పాట అంతా సుశీల పాడగా చివరి రెండు లైన్లు ఘంటసాల పాడతారు. వీనుల విందు ఈ పాట.

అర్థం కాని (లేని) తెలుగు పదాలు

ఆత్మవంచన అంటే ఇంకో పదం గుర్తొచ్చింది. నయవంచన. వంచన అంటే మోసం. బానే ఉంది. మరి నయ అంటే? నయవంచన, వంచన ఒకటే అర్థం అయితే మరి నయ అనే తోక ఎందుకు ఉన్నట్టు? నమ్మించి మోసం చెయ్యటం అనా? అంటే నయ లేదా నయం అంటే నమ్మించటం అనా అర్థం? కొత్త పదం కనుక్కున్నానోచ్. ఇది పక్కన పెడితే, మోసం చేసేది నమ్మించగలిగితేనే కదా. మరి వంచనకి నయవంచనకి తేడా ఏంటి? అచ్చ తెలుగు పదాల అర్థాలు కూడా తెలియని పరిస్థితి. :(

ఇందాక చిమటా మ్యూజిక్ లో వీక్లీ సాంగ్స్ లో పాటల్లో ఒక పదం చూసి గమ్మత్తుగా ఉందే అర్థం ఏమయ్యుంటుందో అని విన్నాను. 'హృదయంగమం' ఆ పదం. నీరాజనంలో నిను చూడక నేనుండలేను. నాకు ఒక రకంగా నచ్చని పాట. కానీ ఆ పదం ఎలా వాడారా అని విన్నాను. అర్థం లేని పదం అనిపించింది. మన ప్రతి సంగమం ఒక హృదయంగమం అంటే ఏంటో నాకేమీ అర్థం కాలేదు. పదాలని సృష్టించటం అంటే ఎడం చేత్తో ఎడా పెడా రాసి పడెయ్యటమేనా? ఏంటో! ఉన్న పదాలని చక్కగా వాడుకుంటే చాలు కదా. ఈ కొత్తవి సృష్టించాలనే తాపత్రయం ఎందుకు?

గుర్తొచ్చింది!!! గుర్తొచ్చింది!!!

నాకా పదం గుర్తొచ్చిందోచ్. ఆత్మ వంచన. హమ్మయ్య. ఇప్పుడు ప్రశాంతంగా ఉంది. ఇన్ని రోజులు ఆత్మని చంపుకోవడం, ఆత్మ ద్రోహం ఇలాంటి పదాలు గుర్తొచ్చి నిద్ర లేకుండా బ్లాగటం అంత పెద్ద తప్పా అని ఉలిక్కిపడేలా చేశాయి. ఆత్మ వంచన కూడా కొద్దో గొప్పో భారీ పదమే కానీ అర్థం అయ్యేసరికి కొంచెం టైం పడుతుంది. ఈ లోపల మర్చిపోవచ్చు. మరీ ఆత్మ ద్రోహం అంటే చంద్రబాబు, ఎన్.టి.రామారావు ఎపిసోడ్ తో అందరికీ అర్థం తెలిసిపోయి నాలిక చివరి పదం అయిపోయింది. :p