Wednesday, August 22, 2007

ఋతురాగాలు

వాసంత సమీరంలా
నునువెచ్చని గ్రీష్మంలా
సారంగసరాగంలా
అరవిచ్చిన లాస్యంలా
ఒక శ్రావణ మేఘంలా .....
ఒక శ్రావణ మేఘంలా
శరచ్చంద్రికల అలలా
హేమంత తుషారంలా
నవ శిశిర తరంగంలా
కాలం జాలం లయలో కలల అలల సవ్వడిలో
సాగే జీవనగానం అణువణువున ఋతురాగం .....
సాగే జీవనగానం అణువణువున ఋతురాగం
వాసంత సమీరంలా .....
నునువెచ్చని గ్రీష్మంలా
సారంగసరాగంలా
అరవిచ్చిన లాస్యంలా .....

చిన్నప్పుడు బాగా చూసిన సీరియల్ ఋతురాగాలు. 4.00 కి అనుకుంటా వచ్చేది. ఎంత పరుగున ఇంటికి వచ్చి చూసేదాన్నో అమ్మతో కలిసి. ఈ పాట టైటిల్ సాంగ్ ఆ సీరియల్ కి. బంటి మ్యూజిక్ డైరెక్టర్. పాడింది సునీత.

జీవితం కూడా కాలగమనం లాంటిదే కదా. కాలానికి ఋతువులున్నట్టే జీవితానికి కూడా ఋతువులుంటాయి అనిపిస్తుంది. గ్రీష్మంలో ఎండలలాగానే కష్టాలు, వసంతంలానే కొత్త ఊహలు, వర్షాకాలంలాంటి బాధలు, శిశిరంలో మంచులానే ఏమీ చెయ్యలేని నిస్సహాయతలు, శరత్తులలాంటి సరదాలు, హేమంతంలాంటి సంతోషాలు, ఉత్తేజాలు. అన్ని ఋతువులనీ స్పృశిస్తూ కాలం సాగినట్టే జీవితం కూడా బాధలనీ, సంతోషాలనీ, ఆనందాలనీ, కష్టాలనీ, నష్టాలనీ, ఆశలనీ అన్నింటినీ స్పృశిస్తూ గమ్యాన్ని చేరుతుంది. కాలానికి జీవితానికి తేడా ఒకటే. జీవితానికి గమ్యం ఉంది. కానీ కాలం అనంతం. ఏ జీవితం కోసం ఆగకుండా సాగుతూనే ఉంటుంది.

No comments: