Saturday, August 18, 2007

ఎడంకాలితో ఫెడీ ...............

మర్చిపోయాను. నాకు ఇంకొంతమందిని కూడా ఎడం కాలితో ఫెడీమని తన్నుదాం అని ఉంటుంది. "సీత నువ్వెవడివిరా నన్ను అడవికి పొమ్మనటానికి అని రాముడిని ఆనాడే అడిగి ఉంటే " ఈ టైప్ డైలాగులు సినిమాలలో నవలల్లో సో కాల్డ్ ఫెమినిస్ట్ ఉపన్యాసాల్లో చాలాసార్లు విన్నాను. అసలు వాళ్ళని వాళ్ళు ఏమనుకుంటారో నాకర్థం కాదు. రాముడిని ఆనాడు సీత అడిగుంటే ఆవిడ సీత అయ్యేది కాదు. ఇదిగో ఈ అడిగిన, అడిగించిన వాళ్ళలానే ఉండేది. అసలు రాముడిని, రాముడు చేసిన పనులని ప్రశ్నించే స్థాయి ఉందా వీళ్ళకి? రాముడు తండ్రి చెప్పిన మాట కోసం భార్యని తీసుకుని నారవస్త్రాలు ధరించి అడవికి వెళ్ళాడు. అడవికి వెళ్ళటం పక్కన పెట్టి వీళ్ళల్లో తండ్రి మాట వినేవారెందరు? పెళ్ళాం మాట విని తల్లితండ్రులని ఇంటి నుండి వెళ్ళగొట్టని వారెందరు?

రాముడు ఏది చేసినా ధర్మాన్ని అనుసరించి చేశాడే తప్ప అధర్మం చెయ్యలేదు. కొడుకుగా తండ్రి మాట వినాలన్న ధర్మాన్ని ఆచరించి అడవికి వెళ్ళాడు. ఆ ధర్మాన్ని ఆచరించే కైకేయి ఆవిడ వరాన్ని వెనక్కి తీసుకుంటాను రాజ్యానికి రమ్మని అభ్యర్ధించినా వెళ్ళలేదు. సీత మీద పూర్తి నమ్మకం ఉన్నా అరణ్యవాసం తర్వాత ఆయనే రాజు అవుతాడని సీతాదేవి రాణి అవుతుందని తెలుసు కాబట్టే ఆ రాజ్యధర్మాన్ని అనుసరించి సీతని అగ్నిప్రవేశం చెయ్యమన్నాడు. ఎవరికోసమైతే కన్నీరుమున్నీరుగా ఏడ్చి కోతిమూకలతో వెళ్ళి రాక్షసుల మీద గెలుపు సాధించాడో అటువంటి సీతని అగ్నిపాలు ఎందుకు చేస్తాడు రాముడు? ఆయనకి తెలుసు సీత అగ్నిపునీత అయితే రాజ్యానికి వెళ్తూనే ఆవిడ మీద ఎటువంటి నిందా పడదనీ, ఆవిడ గురించి గొప్పగా చెప్పుకుంటారనీ. అగ్నిప్రవేశం అప్పుడు సీతకి ఏదన్నా అయితే నష్టం రాముడికే కానీ ఇంకెవరికీ కాదుగా? అయినా రాముడు సీతని అగ్నిప్రవేశం చెయ్యమన్నాడంటే అది రాజ్యధర్మం, పతిధర్మం ఆచరించే.

చాకలివాడు సీత మీద నింద వేస్తే ఆ నింద నిజం కాదని తెలుసు కానీ రాజుగా ప్రజల అభిప్రాయాలనీ ఇష్టాఇష్టాలనీ గౌరవించాలి. రాజు స్థానంలో ఉన్నప్పుడు ఆలోచించాల్సింది కేవలం ప్రజల గురించే. రాజుగా పదవీస్వీకారం చెయ్యగానే వ్యక్తిగతజీవితం గురించి ఆలోచించటం మానెయ్యాలి. తన సుఖాలని పక్కనబెట్టి ప్రజల గురించి ఆలోచించాలి. అంతే కానీ ఈ కాలం నాయకులలా ప్రజల సుఖం కోసం నా జీవితాన్ని పునరంకితం చేస్తాను అని నోటి చివర మాటలు చెప్పటం కాదు. రాముడు కూడా రాజుగా చెయ్యవలసిన ధర్మాన్ని చేశాడు. సీతకి దూరం అవ్వాల్సొస్తుందని లక్ష్మణుడిని, భరతుడిని, శతృఘ్నుడిని రాజ్యభారం తీసుకోమంటే వారు తీసుకోకపోతే పెద్దకొడుకుగా ఇంక తప్పక రాజ్యధర్మాన్ని ఆచరించి సీతని అడవికి వెళ్ళమన్నాడు. తన సుఖం తను చూసుకునేవాడైతే చాకలివాడు కాదు కదా కన్నతల్లి చెప్పినా సీతని అడవికి పంపేవాడు కాదుగా. సరే పేరు కోసం పంపాడు అనుకుందాం. కనీసం తన సుఖం కోసం రెండో పెళ్ళి అయినా చేసుకునేవాడుగా?. ఎందుకు ఒకే మాట, ఒకే బాణం, ఒకే భార్య అన్న సూత్రాన్ని నమ్మాడు, ఆచరించాడు?

ప్రతి అడ్డమైనవాడికీ ఆ రాముడు లోకువైపోయాడు. ఆయన చేసిన ఘోరమైన తప్పేంటంటే ఈ వెధవాయిల కోసం తన భార్యని దూరం చేసుకోవటం, పిల్లల బాల్యాన్ని అనుభవించకపోవటం, ఒంటరితనాన్ని అనుభవించటం. వీళ్ళకి కావలసింది రామరాజ్యం కాదు, రాముడి వంటి రాజూ కాదు. వీళ్ళకి కావలసింది పరాయి పాలనే. వాళ్ళు నెత్తిన కూచుని అన్నివైపులనించి అణిచేస్తుంటే అప్పుడు హాయిగా ఉంటుంది. ఇలాంటివాళ్ళని ఇంకో నాలుగైదు ఎడంకాళ్ళు అప్పు తెచ్చుకుని మరీ తందాం అనిపిస్తుంది. ఒక్క ఎడం కాలు సరిపోదు వీళ్ళకి.

6 comments:

Anonymous said...

:)) chaalaa baagundi , mOraa

పద్మ said...

Thanks Sankoo. :)

kalhara said...

:) Too frank.

పద్మ said...

:)

Vinay Chakravarthi.Gogineni said...

mm good

ekkado chadivanu..actual ga vaalmiki raamaayanamlo just rama pattabhishekam varike vndanta....

లలిత said...

హమ్మయ్య! చదివి చాలా ఆనందం కలిగింది... ఉత్తుత్తి నాస్తికవాదుల వాదాలు అర్ధంలేని నిజంగా విసుగు కలిగినప్పుడూ ఇలాంటివి చదివితే మనసుకు హాయిగా ఉంటుంది.