Wednesday, June 30, 2010

5వ కాలిఫోర్నియా సాహితీ సదస్సు

5వ కాలిఫోర్నియా సాహితీ సదస్సు అని బ్రహ్మానందం గారి బ్లాగ్'లో చూడగానే వెళ్ళాలన్న సంకల్పం కలిగింది. బ్రహ్మానందం గారు కూడా వెంటనే వివరాలు అవి పంపి రమ్మని ఆహ్వానించారు. అలా మా ఊరి నించి 390 మైళ్ళ దూరంలో జరిగిన సాహితీ సదస్సులో ఎటెండెన్స్ వేయించుకుని వచ్చాను.

జూన్ ౧౮,శుక్రవారం డ్రైవ్ చేసి రాత్రికి మిల్పిటస్ చేరుకుని రాత్రికి చక్కగా రెస్ట్ తీసుకుని పొద్దున ఠంచనుగా పదింటికల్లా సదస్సు జరిగే కమ్యూనిటీ సెంటర్లో ఉండాలన్న బృహత్తర ప్రణాళిక కొన్ని అనివార్య కారణాల వల్ల రూపాంతరం జెంది శుక్రవారం డ్రైవ్ కాస్తా శనివారం పొద్దున విమానం అయింది. ఆ విమానం కూడా నా తొందరకి తగ్గట్టే ఆలస్యం చేసి తీరిగ్గా శాంఫ్రాన్సిస్కో ఏర్ పోర్ట్'లో దించింది. అక్కడి నించి మిల్పిటస్ వెళ్ళి రిఫ్రెష్ అయి సదస్సు జరిగే ప్రాంతానికి వెళ్ళేసరికి భోజనాలకి స్వాగతం పలికే వేళ అయింది. లోలికి అడుగు పెట్టగానే తాటిపామల మృత్యుంజయుడు గారు రండి రండి అని ఆహ్వానించారు. భోజనాలు అయిన వెంటనే జె. గోపాలకృష్ణ గారు మతసాహిత్యాలు - ఆంతర్యాల గురించి ప్రసంగించారు. లంచ్ తర్వాత మతసాహిత్యం లాంటి భారీ విషయం మీద ఉపన్యాసం అనేసరికి చాలా కుతూహలం కలిగింది. కానీ, గోపాలకృష్ణ గారు వివాదాస్పద విషయాల జోలికి వెళ్ళకుండా మనలో చాలామందికి భగవంతుడి మీద ఉండే చిన్న చిన్న (అతి) నమ్మకాల గురించి మాట్లాడారు. మనం చేసే పాపాలన్నీ చేసి దేవుడికో కొబ్బరికాయ కొట్టేస్తే పాపాలన్నీ పటాపంచలవుతాయి అనుకుంటాం. కానీ పాపం దారి పాపానిదే, పుణ్యం దారి పుణ్యానిదే. దేవుడు తండ్రిలాంటి వాడు కాబట్టే బిడ్డ తప్పు దారిలో వెళుతుంటే శిక్షించైనా సరైన దారిలో పెట్టే తండ్రిలానే పాపాలు చేసినప్పుడు, పొగిడారు కదా, కానుకలిచ్చారు కదా అని పొంగిపోకుండా ఆ పాపాలకి శిక్షించే తీరతాడు అని బాగా చెప్పారు.

తర్వాత కె.వరలక్ష్మి గారు తమ కథా పరిణామం గురించి వివరించారు. ఆవిడ తన అనుభవాన్ని కథగా రాసి అందులో తను తన పక్షాన నిలబడి తన వాదన మటుకే వినిపించటం రచయిత్రిగా తప్పని గ్రహించి ఆ తరువాత తమ కథా రచనలలో ఆ తప్పు జరగకుండా జాగ్రత్త పడిన తీరు వివరించారు. వరలక్ష్మి గారివి రంగనాయకమ్మ గారి లాంటి ' స్త్రీవాద ' రచనలన్నారు ఎవరో. కానీ వారి మాటతీరు అదీ సో కాల్డ్ ఫెమినిస్ట్ అనిపించలేదు. వారి పుస్తకాలు కొన్ని తీసుకున్నాను. చదవాలి.

వరలక్ష్మి గారి తర్వాత జెజ్జాల కృష్ణమోహన్ గారు పద్యం లయాత్మకం ఛందస్ అంటూ ఛందస్సు తీరు తెన్ను వివరించారు. చిన్నప్పుడెప్పుడో స్కూల్లో నేర్చుకుని కాలేజ్'లో చేరగానే మర్చిపోయిన గురువు లఘువులని గుర్తు చేసారు. వీరు తయారు చేసిన టెంప్లేట్ ఉపయోగించి ఎవరైనా పద్యాలని రాయచ్చు అన్నారు. వచ్చే లాంగ్ వీకెండ్ చేసే పనుల్లో పద్యం రాయటం ఒకటి ఉత్పలమాలలో. :)

నాకు గౌరీకృపానందన్ గారి ప్రసంగం కూడా బాగా నచ్చింది. చాలా సింపుల్ గా ఉన్నారు. యండమూరి నవలలు చాలా మటుకు, యద్దనపూడి నవలలు కొన్ని ఓల్గావి ఇంకా కొన్ని నవలలు అనువాదం చేశారట. కత్తికి రెండువైపులా పదును ఉన్నట్లు తమిళం నించి తెలుగుకి కూడా అనువాదం చేశారట. మరి వీరు అనువాదం చేసినవో కాదో నాకు తెలీదు కానీ కొన్ని అనురాధారమణన్, శివశంకరిగార్ల రచనలు చదివాను. నా అభిమాన తమిళ రచనలవి. అనురాధా రమణన్ మరణం సాహిత్యలోకానికి తీరని లోటు.

వేమూరి వెంకటేశ్వరరావు గారు తెలుగు భాషకి వచ్చిన ఇక్కట్ల గురించి చాలా హాస్యంగా వివరించారు. బర్కీలి యూనివర్సిటీలో తెలుగుని బోధిస్తూ అమెరికాలో తెలుగు వ్యాప్తి చెందటానికి కృషి చేస్తున్న వెంకటేశ్వరరావు గారి బాధ అర్థం చేసుకోతగ్గది. కొంతమంది, కాదు చాలా మంది భాష వింటుంటే వారు మాట్లాడేది తెలుగేనా అని సందేహం వస్తుంది. పోనీ ఇంగ్లిష్ అన్నా సరిగ్గా మాట్లాడతారా అంటే అదీ లేదు. రెంటికి చెడ్డ రేవడుకి ప్రతిరూపాలు. తెలుగులోనే మాట్లాడాలి అంటూ తెలుగులో మంటనక్కలని, అంతర్జాలాలని సృష్టించే పెద్దలు అటు వైపు దృష్టి పెట్టి వారికి సహాయం చేసి తెలుగు వ్యాప్తికి దోహదపడితే బావుంటుందేమో.

తర్వాత స్వీయ కవితా పఠనం. ఇందులో నాకు అన్నీ బానే ఉన్నాయి కానీ కొన్ని ఇంకొంచెం ఎక్కువ నచ్చాయి.

గీత గారి కవిత వారి పాపాయి గురించి. అందులో ఒక లైన్ నాకు చాలా నచ్చింది.
" నెలకో బాధ నిలబడనీకుండా చేసినా
ఎటు ఒత్తిగిల్లీ నిద్రపోలేకున్నా
బైటి లోకపు ద్వారపాలకురాలినై
రాత్రింబగళ్లు నీ కోసమే పహారా కాస్తున్నా "

కాకపోతే చిరు చిన్న పాపాయి అన్న పద ప్రయోగం నాకు అర్థం కాలేదు. చిరు, చిన్న రెంటికీ ఒకటే అర్థం ఉన్నప్పుడు, రెంటినీ ఉపయోగించాల్సిన అవసరం నాకు తెలీలేదు. గీత గారి పుస్తకం కూడా తీసుకున్నాను. అది కూడా చదవాలి.

కృష్ణ అక్కులు గారి గాలి సోదరుల కవిత బావుంది. ఉక్కు కవచాలున్నా సరే వీరితో పెట్టుకున్న వారు గాల్లో కొట్టుకుపోతారు అని వీరి భావన. :)

నేమాన గోపాల్ గారు, మధు ప్రఖ్య, శారద, ఉపాధ్యాయుల కృష్ణమూర్తి గారు, తల్లాప్రగడ రావు గారు, సరస్వతి దర్భ గారు, వరప్రసాద్ గారి స్వీయ కవితా పఠనంతో సదస్సు ముగిసింది.

పొద్దున జరిగిన కార్యక్రమాలు నేను మిస్ అవటం వలన కొన్ని మంచి ప్రసంగాలు వినలేకపోయాను; అపర్ణ గునుపూడి గారి ' స్త్రీ నాడు నేడు ', ప్రఖ్య మధుబాబు గారి ' సాహిత్యంలో ప్రకృతి - ఋతంభర ', మృత్యుంజయుడు గారి ' రావిశాస్త్రి కథల్లో వర్ణనలు ', వంశీ ప్రఖ్య గారి ' తెలుగు సంస్కృతముల సంబంధము - కొత్త కోణం ', కె.వి.ఎస్.రామారావు గారి ' ధ్వనులు, శ్లేషలు ', బోయ జంగయ్య గారి ప్రసంగం.

మొత్తానికి నాకు చాలా నచ్చింది. ఎప్పుడు వర్క్, వర్క్'లో రక్తదానం (ఎగైన్ రక్తపాతం కాదని మనవి) వగైరాలతో టైం తెలీకుండా గడిచిపోయే నాకు ఈ సాహితీ సదస్సు నిజంగా ఒక ఆటవిడుపు. మధ్య మధ్యలో క్విజ్ రూపేణా అడిగిన ప్రశ్నలు, వాటి సమాధానాల ద్వారా కొన్ని తెలియని విషయాలని తెలుసుకున్నాను. :)

కొత్త పరిచయాలు, కొత్త దృక్పధాలు మంచైనా, చెడైనా, ఒప్పుకున్నా, విభేదించినా మనిషికి ఉత్తేజాన్ని ఇస్తాయి, కొత్త ఆలోచనలు కలిగిస్తాయి. ఆ కొత్త ఆలోచనలు జీవనగమ్యాన్ని, గమనాన్ని మార్చేయగలవు. సంగీత, సాహిత్యాలకి సంబంధించిన ఏ సమావేశానికైనా ఇక నించి క్రమం తప్పక వెళ్ళాలన్నదే నా కొత్త ఆలోచన. :)

Thursday, June 10, 2010

భారతీయత - నా అభిప్రాయం

Well, adding to Karthik's points అని కత్తి గారి సైట్లో కామెంట్ మొదలెట్టాను. చూస్తే ఒక పోస్ట్ సైజ్ కి పెరగటంతో అక్కడ కామెంట్ పెట్టటం కన్నా ఇక్కడ పోస్ట్ వెయ్యటం బావుంటుందనిపించి, ఇదిగో ఇలా.

భారతీయత - నా అభిప్రాయం

ఇక్కడ అనగా అమెరికాలో, in fact in all the countries I lived or visited so far except for India, high school అవగానే పిల్లలు బైటికి వెళ్ళిపోతారు. అప్పటి నించి వాళ్ళ కష్టాలు వాళ్ళే పడతారు. అందుకే ఇక్కడి విద్యాధికుల సంఖ్య కూడా తక్కువ ఎందుకంటే ఆ వయసుకి సరైన నిర్ణయాలు తీసుకునే వయసు, అనుభవం వాళ్ళకి ఉండవు. ప్రభుత్వపు ఫ్రీ చదువు ఉండదు. 17 యేళ్ళ తర్వాత తల్లితండ్రుల దగ్గర ఉండటం అవమానంగా భావిస్తారు ఇక్కడి పిల్లలు. ఇక్కడ స్థిరపడ్డ మాకు తెలిసిన భారతీయ కుటుంబంలో ఆడపిల్ల తనని అలా వెళ్ళనివ్వలేదని ఈ మధ్యే రెండు సార్లు ఆత్మహత్యాయత్నం చేసింది కూడా. కానీ భారత దేశంలో పిల్లలు చదువుకుని స్థిరపడేవరకు తల్లితండ్రులు వారితోనే ఉంటారు. వారి మంచీ, చెడ్డా చూస్తారు. మరి ఈ కొత్త జనరేషన్ తల్లితండ్రులు ఠాఠ్, నాకీ భారతీయ విలువలు అనవసరం, నువ్వు నీ ఏడుపేదో ఏడు, మాతో ఉండొద్దంతే అని పిల్లల్ని తన్ని తగలేస్తే తప్ప. :)

ఇక కుటుంబ వ్యవస్థ విషయానికి వస్తే వీళ్ళకి కుటుంబ విలువలు తెలీవు అన్నది ఎంత అబధ్ధమో వీళ్ళు వ్యవస్థని భారతీయుల్లా గట్టి పునాది వేసుకుని నిలబెట్టుకుంటారనటం కూడా అబధ్ధం. వీళ్ళు కుటుంబానికి విలువ ఇస్తారు, తల్లితండ్రులని, అక్కచెళ్ళెళ్ళని ప్రేమిస్తారు. కానీ ఎవరైనా, ఏదైనా వారికి వారి తర్వాతే. భార్యైనా, భర్తైనా, పిల్లలైనా ఎవరైనా "తమ" తర్వాతే. భారత దేశంలో పిల్లలు పుట్టిన తరువాత విడాకులు తీసుకునేవారి సంఖ్య ఎంతుండొచ్చు? పిల్లలు పెరిగి పెద్దవారైన తరువాత విడాకులు తీసుకునేవారి సంఖ్య ఎంతుండొచ్చు? ఒకసారి పెళ్ళి అయ్యాక భార్య, భర్త ఇద్దరూ సద్దుకుపోతూ సంసారాన్ని ముందుకు లాగాలనే చూస్తారు కానీ విడిపోయి ఏదో సాధిద్దాం అనుకోరు. కనీసం అది భారతీయ తత్వం కాదు. కానీ ఇక్కడ? ఉదాహరణకి అమెరికా అధ్యక్ష పదవికి పోటీ చేసిన Al Gore, ఆయన భార్య 40 ఏళ్ళ వైవాహిక జీవితం అనంతరం విడాకులు తీసుకున్నారు. ఇంక ఆయన పిల్లలు ఇద్దరూ అదే దారిలో నడిచారంటే వింతేమీ కాదు కదా. భారతదేశంలో నలభైయేళ్ళ వైవాహిక జీవితం తర్వాత విడాకులు తీసుకోవటం అన్నది ఊహలోకి కూడా రాదు ఎవరికీ. అది మంచేనా లేక చెడా, ఇష్టం ఉన్నా లేకపోయినా జీవితాంతం సద్దుకుపోవాలా అన్న విషయం ఇక్కడ అప్రస్తుతం. కానీ కుటుంబ వ్యవస్థ పటిష్టంగా ఉంటేనే దేశం కూడా పటిష్టంగా మనగలుగుతుంది. పిల్లలు ఎలా పెరుగుతారు, వాళ్ళ జీవితాన్ని ఎలా తీర్చిదిద్దుకుంటారు అనేది తల్లితండ్రుల మీద చాలా ఆధారపడి ఉంటుంది. పిల్లలకి సాధారణంగా తల్లితండ్రులే రోల్ మోడల్స్ అవుతారు దేశంలోనైనా. వారు చిన్నప్పటినించి చూసిన ప్రవర్తనే వారికి ఆచరణీయం అనిపిస్తుంది సాధారణంగా. అది తల్లితండ్రులని కావిట్లో మోసి పుణ్యక్షేత్రాలు చూపించిన శ్రవణుడికైనా, మీనాన్నకి నువ్వు తీసిన గొయ్యి రేపు నీకు తియ్యాలి కదయ్యా అనే పిల్లవాడికైనా. అందుకే భారతదేశంలో కుటుంబవ్యవస్థకి అంత విలువ, అందుకే అది అంత పటిష్టమైన పునాది మీద నిలబడగలిగింది.

ఇక "వీళ్ళు ఎగేసుకెళ్ళేదీ అక్కడికే. అక్కడికి వెళ్ళి డాలర్లు సంపాదిస్తేగానీ భారతీయత వీళ్ళకు బూతద్దంలో పెట్టినట్లుకనిపించదు." విషయానికి వస్తే, మొట్టమొదట చిన్న కరెక్షన్. భూతద్దం అనుకుంటాను బూతద్దం కాదేమో. :( అర్థం దరిద్రంగా మారింది బూతద్దం అనేసరికి.

ఎవరైనా ఎక్కడికైనా వెళ్ళేది బ్రతుకుతెరువు కోసమే కదా. వెళ్ళింది అమెరికా అయినా, అమలాపురం అయినా, బెంగుళూరు అయినా చదువు కోసమో, బ్రతుకుతెరువు కోసమో తప్ప భారతీయత తెలుసుకోవటం కాదు కదా. లెక్కన, తెలుగువాళ్ళు కన్నడదేశానికి వెళ్తేనే వాళ్ళకి తెలుగుతనం, మహారాష్ట్రీయులకి పక్కన ఉన్న గుజరాత్ వెళ్తేనే శివాజి గుర్తొస్తాడు అన్నట్టుంది. :) అయినా ఇందులోనూ తప్పు లేదేమో. భారతదేశంలో ఉండి కూడా భారతీయ విలువలు తెలియకుండా ఉండటం కన్నా పరాయి దేశంలో ఉండి తెలుసుకుని ఆరాధించటం తప్పు కాదేమో.

"They have an institutional mechanism to take care of old."

I don''t think Karthik meant machine in his comment. Anyways, could you please explain what that mechanism is? కిందపడి లేవలేకపోతే మెళ్ళో ఉన్న విజిల్ ఊదితే ఎక్కడో ఉన్న కాప్స్ కి పిలుపంది వాళ్ళు వచ్చి రక్షించటం అంటారా? లేక నడవటానికి చేతకాక రకరకాల బటన్స్ ఉన్న చక్రాల బండి "కొనుక్కుని" రోజులు భారంగా గడపటం అంటారా? Do you even have an idea about how hard senior citizens here have to work to earn even at the age of 70 and above to meet their basic minimum needs? their insurance premiums?

ఇక ఆప్యాయత విషయానికి వస్తే మీరన్నది కరక్టే, ఆప్యాయతలు చాలా ఎక్కువ. సంవత్సరానికి ఒకసారి మదర్స్ డే, ఫాదర్స్ డే అంటూ పూలు, కేక్స్ పంపించి వాళ్ళ ఆప్యాయతని చాటుకుంటారు. :)

మిడిల్ క్లాస్ అని అంత తేలిగ్గా అనేసారు మరి మీరు హై క్లాస్ వారా మిడిల్ క్లాస్ అంటే చిన్నచూపుకి? లేక లో క్లాస్ వారా మిడిల్ క్లాస్ అంటే కుళ్ళుకోవటానికి? :)

నిజమే, మనం భారతీయ విలువలతో అమెరికాని లేక ఇతర దేశాల్ని కొలవకూడదు. మరి ఇతర దేశాలకి సంబంధించిన వేటితోనైనా భారతదేశాన్ని ఎందుకు కొలవటం? అది తప్పు కాదా? ఎందుకు భారతదేశం అంటే ఇంత చులకన? అదీ దేశంలోనే ఉంటూ? కొంచెం ఎక్కువ ప్రజాస్వామ్యం ఉంటే ఇదేనేమో జరిగేది. ఎక్కడైనా, వ్యవస్థలోనైనా, దేశంలోనైనా అన్నీ అద్భుతమైనవే ఉండవు. అలా ఉంటే అది రామరాజ్యమే అవుతుంది. మంచిని తీసుకోకుండా ద్వేషాన్ని వెల్లగక్కడం వల్ల ఉపయోగం ఏముంది? మనిషి మీద ద్వేషం ఉంటే మనిషి మీద వెదజల్లండి. అది మీకు మీకు పరిమితం అవుతుంది కానీ ఒక దేశాన్ని, దేశపు విలువల్ని విమర్శించి ప్రపంచంలో తీవ్రవాదం కన్నా ప్రమాదమైనది స్వేచ్చగా మాట్లాడి, మనగలిగే ప్రజాస్వామ్యం అనిపించేలా చెయ్యకండి.
"