Wednesday, June 30, 2010

5వ కాలిఫోర్నియా సాహితీ సదస్సు

5వ కాలిఫోర్నియా సాహితీ సదస్సు అని బ్రహ్మానందం గారి బ్లాగ్'లో చూడగానే వెళ్ళాలన్న సంకల్పం కలిగింది. బ్రహ్మానందం గారు కూడా వెంటనే వివరాలు అవి పంపి రమ్మని ఆహ్వానించారు. అలా మా ఊరి నించి 390 మైళ్ళ దూరంలో జరిగిన సాహితీ సదస్సులో ఎటెండెన్స్ వేయించుకుని వచ్చాను.

జూన్ ౧౮,శుక్రవారం డ్రైవ్ చేసి రాత్రికి మిల్పిటస్ చేరుకుని రాత్రికి చక్కగా రెస్ట్ తీసుకుని పొద్దున ఠంచనుగా పదింటికల్లా సదస్సు జరిగే కమ్యూనిటీ సెంటర్లో ఉండాలన్న బృహత్తర ప్రణాళిక కొన్ని అనివార్య కారణాల వల్ల రూపాంతరం జెంది శుక్రవారం డ్రైవ్ కాస్తా శనివారం పొద్దున విమానం అయింది. ఆ విమానం కూడా నా తొందరకి తగ్గట్టే ఆలస్యం చేసి తీరిగ్గా శాంఫ్రాన్సిస్కో ఏర్ పోర్ట్'లో దించింది. అక్కడి నించి మిల్పిటస్ వెళ్ళి రిఫ్రెష్ అయి సదస్సు జరిగే ప్రాంతానికి వెళ్ళేసరికి భోజనాలకి స్వాగతం పలికే వేళ అయింది. లోలికి అడుగు పెట్టగానే తాటిపామల మృత్యుంజయుడు గారు రండి రండి అని ఆహ్వానించారు. భోజనాలు అయిన వెంటనే జె. గోపాలకృష్ణ గారు మతసాహిత్యాలు - ఆంతర్యాల గురించి ప్రసంగించారు. లంచ్ తర్వాత మతసాహిత్యం లాంటి భారీ విషయం మీద ఉపన్యాసం అనేసరికి చాలా కుతూహలం కలిగింది. కానీ, గోపాలకృష్ణ గారు వివాదాస్పద విషయాల జోలికి వెళ్ళకుండా మనలో చాలామందికి భగవంతుడి మీద ఉండే చిన్న చిన్న (అతి) నమ్మకాల గురించి మాట్లాడారు. మనం చేసే పాపాలన్నీ చేసి దేవుడికో కొబ్బరికాయ కొట్టేస్తే పాపాలన్నీ పటాపంచలవుతాయి అనుకుంటాం. కానీ పాపం దారి పాపానిదే, పుణ్యం దారి పుణ్యానిదే. దేవుడు తండ్రిలాంటి వాడు కాబట్టే బిడ్డ తప్పు దారిలో వెళుతుంటే శిక్షించైనా సరైన దారిలో పెట్టే తండ్రిలానే పాపాలు చేసినప్పుడు, పొగిడారు కదా, కానుకలిచ్చారు కదా అని పొంగిపోకుండా ఆ పాపాలకి శిక్షించే తీరతాడు అని బాగా చెప్పారు.

తర్వాత కె.వరలక్ష్మి గారు తమ కథా పరిణామం గురించి వివరించారు. ఆవిడ తన అనుభవాన్ని కథగా రాసి అందులో తను తన పక్షాన నిలబడి తన వాదన మటుకే వినిపించటం రచయిత్రిగా తప్పని గ్రహించి ఆ తరువాత తమ కథా రచనలలో ఆ తప్పు జరగకుండా జాగ్రత్త పడిన తీరు వివరించారు. వరలక్ష్మి గారివి రంగనాయకమ్మ గారి లాంటి ' స్త్రీవాద ' రచనలన్నారు ఎవరో. కానీ వారి మాటతీరు అదీ సో కాల్డ్ ఫెమినిస్ట్ అనిపించలేదు. వారి పుస్తకాలు కొన్ని తీసుకున్నాను. చదవాలి.

వరలక్ష్మి గారి తర్వాత జెజ్జాల కృష్ణమోహన్ గారు పద్యం లయాత్మకం ఛందస్ అంటూ ఛందస్సు తీరు తెన్ను వివరించారు. చిన్నప్పుడెప్పుడో స్కూల్లో నేర్చుకుని కాలేజ్'లో చేరగానే మర్చిపోయిన గురువు లఘువులని గుర్తు చేసారు. వీరు తయారు చేసిన టెంప్లేట్ ఉపయోగించి ఎవరైనా పద్యాలని రాయచ్చు అన్నారు. వచ్చే లాంగ్ వీకెండ్ చేసే పనుల్లో పద్యం రాయటం ఒకటి ఉత్పలమాలలో. :)

నాకు గౌరీకృపానందన్ గారి ప్రసంగం కూడా బాగా నచ్చింది. చాలా సింపుల్ గా ఉన్నారు. యండమూరి నవలలు చాలా మటుకు, యద్దనపూడి నవలలు కొన్ని ఓల్గావి ఇంకా కొన్ని నవలలు అనువాదం చేశారట. కత్తికి రెండువైపులా పదును ఉన్నట్లు తమిళం నించి తెలుగుకి కూడా అనువాదం చేశారట. మరి వీరు అనువాదం చేసినవో కాదో నాకు తెలీదు కానీ కొన్ని అనురాధారమణన్, శివశంకరిగార్ల రచనలు చదివాను. నా అభిమాన తమిళ రచనలవి. అనురాధా రమణన్ మరణం సాహిత్యలోకానికి తీరని లోటు.

వేమూరి వెంకటేశ్వరరావు గారు తెలుగు భాషకి వచ్చిన ఇక్కట్ల గురించి చాలా హాస్యంగా వివరించారు. బర్కీలి యూనివర్సిటీలో తెలుగుని బోధిస్తూ అమెరికాలో తెలుగు వ్యాప్తి చెందటానికి కృషి చేస్తున్న వెంకటేశ్వరరావు గారి బాధ అర్థం చేసుకోతగ్గది. కొంతమంది, కాదు చాలా మంది భాష వింటుంటే వారు మాట్లాడేది తెలుగేనా అని సందేహం వస్తుంది. పోనీ ఇంగ్లిష్ అన్నా సరిగ్గా మాట్లాడతారా అంటే అదీ లేదు. రెంటికి చెడ్డ రేవడుకి ప్రతిరూపాలు. తెలుగులోనే మాట్లాడాలి అంటూ తెలుగులో మంటనక్కలని, అంతర్జాలాలని సృష్టించే పెద్దలు అటు వైపు దృష్టి పెట్టి వారికి సహాయం చేసి తెలుగు వ్యాప్తికి దోహదపడితే బావుంటుందేమో.

తర్వాత స్వీయ కవితా పఠనం. ఇందులో నాకు అన్నీ బానే ఉన్నాయి కానీ కొన్ని ఇంకొంచెం ఎక్కువ నచ్చాయి.

గీత గారి కవిత వారి పాపాయి గురించి. అందులో ఒక లైన్ నాకు చాలా నచ్చింది.
" నెలకో బాధ నిలబడనీకుండా చేసినా
ఎటు ఒత్తిగిల్లీ నిద్రపోలేకున్నా
బైటి లోకపు ద్వారపాలకురాలినై
రాత్రింబగళ్లు నీ కోసమే పహారా కాస్తున్నా "

కాకపోతే చిరు చిన్న పాపాయి అన్న పద ప్రయోగం నాకు అర్థం కాలేదు. చిరు, చిన్న రెంటికీ ఒకటే అర్థం ఉన్నప్పుడు, రెంటినీ ఉపయోగించాల్సిన అవసరం నాకు తెలీలేదు. గీత గారి పుస్తకం కూడా తీసుకున్నాను. అది కూడా చదవాలి.

కృష్ణ అక్కులు గారి గాలి సోదరుల కవిత బావుంది. ఉక్కు కవచాలున్నా సరే వీరితో పెట్టుకున్న వారు గాల్లో కొట్టుకుపోతారు అని వీరి భావన. :)

నేమాన గోపాల్ గారు, మధు ప్రఖ్య, శారద, ఉపాధ్యాయుల కృష్ణమూర్తి గారు, తల్లాప్రగడ రావు గారు, సరస్వతి దర్భ గారు, వరప్రసాద్ గారి స్వీయ కవితా పఠనంతో సదస్సు ముగిసింది.

పొద్దున జరిగిన కార్యక్రమాలు నేను మిస్ అవటం వలన కొన్ని మంచి ప్రసంగాలు వినలేకపోయాను; అపర్ణ గునుపూడి గారి ' స్త్రీ నాడు నేడు ', ప్రఖ్య మధుబాబు గారి ' సాహిత్యంలో ప్రకృతి - ఋతంభర ', మృత్యుంజయుడు గారి ' రావిశాస్త్రి కథల్లో వర్ణనలు ', వంశీ ప్రఖ్య గారి ' తెలుగు సంస్కృతముల సంబంధము - కొత్త కోణం ', కె.వి.ఎస్.రామారావు గారి ' ధ్వనులు, శ్లేషలు ', బోయ జంగయ్య గారి ప్రసంగం.

మొత్తానికి నాకు చాలా నచ్చింది. ఎప్పుడు వర్క్, వర్క్'లో రక్తదానం (ఎగైన్ రక్తపాతం కాదని మనవి) వగైరాలతో టైం తెలీకుండా గడిచిపోయే నాకు ఈ సాహితీ సదస్సు నిజంగా ఒక ఆటవిడుపు. మధ్య మధ్యలో క్విజ్ రూపేణా అడిగిన ప్రశ్నలు, వాటి సమాధానాల ద్వారా కొన్ని తెలియని విషయాలని తెలుసుకున్నాను. :)

కొత్త పరిచయాలు, కొత్త దృక్పధాలు మంచైనా, చెడైనా, ఒప్పుకున్నా, విభేదించినా మనిషికి ఉత్తేజాన్ని ఇస్తాయి, కొత్త ఆలోచనలు కలిగిస్తాయి. ఆ కొత్త ఆలోచనలు జీవనగమ్యాన్ని, గమనాన్ని మార్చేయగలవు. సంగీత, సాహిత్యాలకి సంబంధించిన ఏ సమావేశానికైనా ఇక నించి క్రమం తప్పక వెళ్ళాలన్నదే నా కొత్త ఆలోచన. :)

4 comments:

సావిరహే said...

బాగుంది మీ సాహితి సదస్సు సంగతులు ,మేము యూయస్ లో అనుభుతినిచ్చారు !
మీ విశ్లేషణ కూడా మహా బ్లాగు బ్లాగు !

రవి said...

నాకిష్టమైన ప్రముఖులను మీరు కలుసుకున్నందుకు సంతోషంగా ఉంది.

పద్మ said...

ధన్యవాదాలు సావిరహే గారు, రవి గారు.

Anonymous said...

బావుంది పద్మా. చిరు చిన్న పాపాయి అంటే బహుశా అతి చిన్న పాపాయి అనేమో. అక్కడ ఇంకా పుట్టని పిల్ల అనే అర్థంలో వాడారేమో అనిపించింది.

రాధీ.