Thursday, September 29, 2011

అందని ద్రాక్ష అప్రజాస్వామ్యమా?

దొరక్క దొరక్క కాస్త టైం దొరికితే అది కాస్తా నిన్న ఒక చెత్త పోస్ట్ చదవటం లో వేస్ట్ చేసుకున్నాను. టూకీగా ఆ పోస్ట్ విషయం ఏంటంటే  భారత దేశం తప్ప ప్రపంచంలో ఎక్కడైనా సరే ఉండేవాళ్ళకి దేశభక్తి ఉండదు. వాళ్ళకి ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే హక్కు లేదు. ఇంకా స్పెసిఫిక్ గా భారతదేశానికి సంబంధించి ఏ విషయము మాట్లాడకూడదు. ఎందుకంటే పరాయి దేశంలో బతుకుతున్నారు కాబట్టి. కానీ ఆ రాసినాయన, ఇంకా ఇటువంటి 'భావజాలం' ఉన్నవాళ్ళు మటుకు పరాయి దేశం నించి ఎటువంటి సిధ్ధాంతాన్నైనా తెచ్చుకుని దాని గురించి పేజీలకి పేజీలు చెత్త రాయచ్చు. పిసరంత అయినా అర్థం ఉందనిపిస్తోందా? నాకనిపించలేదు. అక్కడే కామెంట్ రాద్దామనుకుంటే అదేదో వారి బ్లాగు వారిష్టం అన్నారు. అందుకని ఇక్కడ ఇలా.

వారా పోస్ట్ లో అన్నది, నాకు చిర్రెత్తుకొచ్చింది ఇండియాలో చదువుకుని, ఇండియా డబ్బులతో పెరిగి అమెరికాకి దాస్యం చేస్తూ అమెరికా పౌరసత్వం కోసం తహతహలాడుతూ వగైరా వగైరా ...... ఈ చెత్త చాలా మంది అనగా/రాయగా విన్నాను/చూశాను. ఎప్పుడూ ఒకటే సామెత గుర్తొస్తుంది. "ఆడలేక మద్దెల ఓడినట్టు." భారతంలో పుట్టి అక్కడ చదువుకుంటే ఇంక అక్కడే ఉద్యోగం చేసుకుంటూ ఉండాలా? అలా ఉంటేనే దేశానికి సేవ చేసినట్టా? భారతంలో బతుకుతూ ఈ దేశం నాకేమిచ్చింది అని దేశాన్ని తిట్టిపోసేవాళ్ళు, పరాయి దేశపు సిధ్ధాంతాలు మన దేశకాలమాన పరిస్థితులకి నప్పుతాయా లేదా అని కూడా ఆలోచించకుండా కబుర్లు చెప్పేవాళ్ళు సేవ చేసినట్టా లేక పరాయి దేశంలో ఉండి కూడా దేశానికి ఏదో రకంగా ఉపయోగపడాలని తపన పడేవాళ్ళకున్నట్టా దేశభక్తి? ఇదివరకు మా వాళ్ళ దగ్గర ఒక డ్రైవర్ ఉండేవాడు. వాడు పిల్లల్ని కనటం తప్ప ఇంకే పని లేనట్టు కనేసి ఈ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం నాకేం చేసిందమ్మా, నేనెందుకు ఓటెయ్యాలి. నా పిల్లల్ని పోషిస్తోందా అని అడిగేవాడు. ఇష్టం వచ్చినట్టు కనేసావు, నీ పిల్లల్ని నువ్వే కదా పోషించుకోవాలి అంటే  నన్ను నా పిల్లల్ని ఈ ప్రభుత్వమే పోషించాలి అని వాదించేవాడు. అలా ఉంది వీళ్ళ వాదన కూడా.

భారతంలో చదువుకుంటే అక్కడే ఉద్యోగం చెయ్యాలి. ఇంక వేరే దేశాల్లో ఊడిగాలు చెయ్యకూడదనుకుంటే మరి గాంధి, నెహ్రూ ఇంకా వీళ్ళు పూజించే ప్రముఖుల్ని చాలా మందినే నిలదీయాలి కదా. మరి వాళ్ళందరూ ఇతర దేశాల్లో చదువుకుని భారతానికి తిరిగొచ్చినవారే కదా. మరి వీరి లెక్కన ఆ దేశానికి సేవ చెయ్యాలి కదా అక్కడ చదువుకున్నందుకు? లేదా ప్రాధమిక విద్య భారతంలో చేశారు కాబట్టి వాళ్ళని రెండు ఖండాలుగా నరికి ఒక ఖండం ఒక దేశానికి ఇంకో ఖండం ఇంకో దేశానికి ఋణం తీర్చుకోటానికి పంపించాలంటారా?

దేశానికి సేవ అక్కడ ఉండే చెయ్యక్కరలేదు. నా చుట్టుపక్కలే, ఇక్కడ ఉన్నవాళ్ళని చూస్తే భారతానికి ఏదో రూపం లో సేవ చేస్తూనే ఉన్నారు.  నన్నే తీసుకుంటే, నేను భారతంలో ఆరుగురు ఆడపిల్లలని దత్తత తీసుకుని చదివిస్తున్నాను. వచ్చే ఏడాది ఇంకో ముగ్గురు అమ్మాయిలని దత్తత తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నాను. అక్కడ ఉన్న నా ప్రాపెర్టీస్ కి ప్రతి సంవత్సరం టాక్స్ కడుతున్నాను. అక్కడ కొన్ని శరణాలయాలకి ప్రతి సంవత్సరం డబ్బులు పంపిస్తున్నాను. ఈ సంపాదించిన డబ్బులకి ఇక్కడ టాక్స్ కడుతున్నాను. ఇక్కడ చాలా తరచుగా డొనేట్ చేస్తుంటాను. పెంచిన దేశానికి, ఉంటున్న దేశానికి కొద్దో గొప్పో సేవ చేస్తున్నట్టే అనుకుంటున్నాను. భారతంలో ఉండి కూడా ఇవన్నీ ఖచ్చితంగా చెయ్యచ్చు కానీ ఇక్కడ ఉండటం మూలాన పరిధి చాలా పెరిగింది. ఒక మామూలు ఉద్యోగం చేస్తూ తొమ్మిదిమంది ఆడపిల్లలని దత్తత తీసుకుని చదివించటం భారతంలో సులభమా? ఇది ఒక రకంగా స్త్రీ జనోధ్ధరణ కాదా? లేక తనకన్నా పెద్దదైనా వదిన్ని జాలిపడి పెళ్ళి చేసుకున్న మరిది చేసేది స్త్రీ జనోధ్ధరణ? ఇంతకీ అమెరికన్ భారతీయులని తిట్టిపోస్తూ రాతలు  రాసిన శేఖర్ గారు దేశానికి ఏ రకమైన సేవ చేశారో కాస్త చెప్పగలరా? ఇలాంటి రాతలు రాయటం తక్క? పరాయి దేశం లో ఉన్నంత మాత్రాన కని పెంచిన దేశానికి పరాయి అయిపోరు. ఎక్కడ పుట్టినవారు అక్కడ ఉండే ఋణం తీర్చుకోవాలి అనుకుంటే ఇంక హైదరాబాదులో చదువుకున్నవాళ్ళు అక్కడే ఉద్యోగం చేసుకోవాలి. బెంగుళూరు లేదా మరో ఊరు వెళ్ళకూడదు. అమలాపురం లో చదువుకున్నవాడు అక్కడే ఉండాలి. వెరసి బావిలో కప్పకు మల్లే తయారవ్వాలి. ఈ రాసినాయన లాగా. కాస్త చుట్టూ ప్రపంచాన్ని చూడండి. పరాయి దేశం వెళ్ళినా అక్కడ తమదైన అస్థిత్వాన్ని నిలుపుకుని ఆ దేశానికి, పుట్టిన దేశానికి పేరు తెచ్చిన గొప్పవారిని కాస్త గమనించండి.

మీరనే ఈ పరాయి దేశం అమెరికాలో ఎన్ని భారతీయులు స్థాపించిన సంస్థలున్నాయో తెల్సా? అవన్నీ భారతీయులకి/భారతదేశానికి ఎంతెంత మద్దతు ఇస్తుంటాయో తెల్సా? ఎన్ని సేవా సంస్థలున్నాయో తెల్సా? ఇక్కడ మా హిందూ స్వయం సేవక సంఘాలు ఎన్నెన్ని ఉన్నాయో అవి ఏ రకంగా మన దేశ గౌరవాన్ని నిలుపుతూ ఇక్కడి వాళ్లకి మన గొప్పదనం చెప్తూ ఎన్ని రకాలుగా సేవలు చేస్తున్నాయో తెల్సా? బీచెస్ క్లీన్ చెయ్యటంలో కానీ,
ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు కానీ వాళ్లకి తోచినట్టుగా సేవ చేస్తారు. కానీ అస్థిత్వాన్ని కోల్పోరు.

 నిజమే ఇక్కడ గ్రీన్ కార్డ్ కోసం పౌరసత్వం కోసం తహతహలాడతారు. కొన్ని అదనపు సౌకర్యాలు సులభంగా దొరుకుతున్న చోట మనిషి ఆశ పడకుండా ఉంటాడా? అంత మాత్రాన దేశభక్తి లేనట్టా? భారతంలో మటుకు ఉన్న ఊళ్ళో కాక వేరే పెద్ద ఊళ్ళో జీతం, ఇంకొన్ని సౌకర్యాలు  ఎక్కువ ఇస్తారంటే వెళ్ళకుండానే ఉంటారా?

ఉన్న ఊరొదిలి ఏ దేశానికైనా, ఏ ప్రాంతానికైనా వెళ్ళేది పొట్టకూటి కోసం, కొత్త విషయాలు నేర్చుకోవాలన్న ఆసక్తి మీద, ఏదో సాధించాలన్న తపన తీర్చుకోవటం కోసం.

అందని ద్రాక్ష పుల్లన. కరక్టే. కానీ అంత మాత్రాన భూమిలోంచి పుట్టిన తీగకి కాసిన పళ్ళు ఆ భూమికే అందనంత ఎత్తులో ఉన్నాయి అని తిట్టిపోయటం మూర్ఖత్వం. అంత ఎత్తున ఉన్నా ఆ పళ్ళు కిందకి భూమి వైపే వేళ్ళాడుతూ ఉంటాయి. వాటి వేళ్ళు అక్కడే ఉన్నాయని తెలుసు కాబట్టి, చాలామంది ఎన్.ఆర్.ఐల లాగా.