Tuesday, August 25, 2009

పురుషాకృతివో స్త్రీవో ..... ఎవరివో నీవెవరివో .....

తిరుమల మందిర సుందరా పాట నాకు, మా అమ్మకి చాలా ఇష్టమైన భక్తి పాటల్లో ఒకటి. రాగం, భావం అత్యద్భుతంగా ఉంటాయి ఈ పాటలో.

ఆ మధ్య ఈ పాట MP3 దొరక్క గిలగిలలాడిన నాకు తన దగ్గర ఉందని చెప్పి వెంటనే పంపించిన నిషికి బోలెడు థాంక్స్ చెప్పుకోవాలి.

తిరు వీధుల మెరిసే దేవదేవుడు అని అన్నమయ్య పాడారేమో కానీ ఇలాంటి భక్తి పాటలు వినిపించే ప్రతి ఇంట్లో పలికించే ప్రతి హృదిలో ఆ దేవదేవుడు మెరుస్తూనే ఉంటాడు.

పాలకడలిలో పవళించిన ఆ లక్ష్మీవిభుడివో తెలీదు, వెండికొండపై నిత్యం ధ్యానంలో ఉండే అర్థనారీశ్వరుడివో తెలీదు, ముగురమ్మల మూలపుటమ్మవైన త్రిజగన్మాతవో తెలీదు కానీ కాంతులు చిందిస్తూ అందర్నీ ఆకర్షించే నీ ముఖబింబము ఒక్క ఘడియ చూసినా అదే ఈ జన్మకి చాలు (అనుకుంటాం కానీ ఆయన రూపం అయస్కాంతం కాదూ, అక్కడ ఉన్న వాలంటీర్స్ తోసెయ్యకపోతే గోవింద నామస్మరణ చేస్తూ ఆ దేవదేవుడి దర్శనం చేసేవారెవరైనా అక్కడినించి కదులుతారా ఘడియలు దాటినా?) నీ గుడి వాకిట దీపమై వెలుగుతూ ఒక్క రాత్రి మనగలిగినా ఆ సేవ చాలు స్వామీ నీ పాదపద్మాలపై పువ్వునై ఒక్క క్షణం నిలిచినా నా జన్మ ధన్యత కాంచును దేవదేవా.

ఈ పాట వినప్పుడల్లా మా తాతగారు రాసిన దేవదేవ మోక్షపథము తెల్పవేమిరా అన్న పాట గుర్తొస్తుంది. ఆ పాట కూడా నీవరివో తెలీదు, అఖరికి పురుషాకృతివో, స్త్రీవో కూడా తెలీదు అని వస్తుంది. భగవంతుడు వైష్ణవుడు అనీ, శైవుడు అనీ, హిందువనీ, ముస్లిం అనీ నానా విధాలుగా తిట్టుకుంటాం కొట్టుకుంటాం. కానీ ఆఖరికి ఆ భగవత్‌స్వరూపం స్త్రీ రూపమో, పురుష రూపమో తెలీదు, ఆ స్వరూపానికి ఒక రూపం ఉందో లేదో తెలీదు కానీ నేను గొప్ప నా దేవుడు గొప్ప అని జుట్టు జుట్టు పట్టుకోటానికి తయారైపోతాము.

మా అమ్మ చెప్పే మాట నాకెప్పుడు నచ్చుతుంది. ఒక ఆర్టిస్ట్ ని అందమైన అమ్మాయి బొమ్మ గీయమంటే తన దృష్టిలో అందమైన అమ్మాయి ఎలా ఉంటుందో ఊహించి గీస్తాడు. అదే బొమ్మ ఇంకొక కళాకారుడిని గీయమంటే అతనూ అలానే ఊహించి గీస్తాడు. ఈ రెండు బొమ్మలు రెండు కళ్ళు ముక్కు నోరు ఉండటం తప్ప ఇంకెందులోనూ కలవవు. చూడకుండా ఊహించి గీసిన బొమ్మకి, చూడకుండా మనం ఊహించి మదిలో నిల్పుకుని పూజించే దేవుడికి తేడా ఉందా? నీళ్ళు గ్లాసులో పోస్తే అదే ఆకారాన్ని సంతరించుకుంటాయి. అవే నీళ్ళు గిన్నెలో పోస్తే గిన్నె ఆకారంలోనే కనిపిస్తాయి. అంతమాత్రం చేత అవి రెండు వేరే వేరే నీళ్ళు అనగలమా? గ్లాస్‌లో మినరల్ వాటర్ , గిన్నెలో టాప్ వాటర్ అని ఎవరైనా వితండవాదం చేస్తే ఎవరేం చెయ్యలేరనుకోండి. అది వేరే విషయం.

భగవంతుడు నిరాకరస్వరూపుడు అంటారు. కానీ మనం ధ్యానం కోసం వీలుగా ఆ దేవుడికి రూపం సృష్టించుకున్నాం. ఆ రూపాన్నే పూజిస్తున్నాం. కానీ అదే ఆయన శాశ్వత రూపం అని కనిపించే ఆయన ఇంకొక రూపాన్ని తిట్టిపోస్తాం. ఏంటో. ఇలా మాట్లాడానని నన్ను నాస్తికురాలిననో, కమ్యూనిస్ట్ టైపు ఆస్తికురాలిననో అనుకోకండి. నన్ను అల్లహ్ ఓ అక్బర్ అనమన్నా అంటాను కానీ నా రాముడిని పల్లెత్తు మాట అన్నా ఊరుకోను. ఆ నాలిక చీరెయ్యటానికి కత్తి పక్కన పెట్టుకునే తిరుగుతాను. :P