Thursday, February 28, 2008

ఫెమినిస్టులు - పనికిమాలిన రాతలు

మొత్తానికి ఈరోజుకి తీరింది బ్లాగటానికి. ఇలా బ్లాగటం అంటుంటే వాగటం అన్నట్టు లేదు? రెంటికీ పెద్ద తేడా ఉన్నట్టు నాకైతే అనిపించదు. వాగుతున్నప్పుడు ఎదుట కూచున్న ఒకరో, ఇద్దరో, ఇంకా ఎక్కువమందో పాపం చెవులు మూసుకోలేక అదేదో సినిమాలో బ్రహ్మానందంలా దీనంగా మొహం పెట్టుకుని కూచునుంటారు. ఆ మొహాలు చూడలేక, చూసినా అమిత ఇష్టంగా ఇస్తున్న ఉపన్యాసరసధారని ఆపలేక వాగేవాళ్ళు కష్టాలు పడతారు. కొంతమంది ఆ మొహాలు చూసి ఆనందంతో వీరావేశంగా విజృంభిస్తారు. అది వేరే విషయం. కానీ బ్లాగేటప్పుడు ఆ కష్టాలు ఉండవు. ఇష్టం వచ్చినట్టు బ్లాగుకోవచ్చు. చదివేవాళ్ళు చదువుతారు. ఇష్టం లేనివాళ్ళు సింపుల్‌గా బ్రౌజర్ అనే పదార్ధాన్ని మూసేస్తారు. బోల్డుమంది చదివే ఉంటార్లే అన్న సంబరం బ్లాగరులదైతే, హమ్మయ్య తప్పించుకున్నాం అనే ఆనందం చదువరిది. కాకపోతే ఈ ఇష్టం వచ్చినట్టు అనే విషయం బ్లాగుల వరకే పరిమితం చేస్తే బానే ఉంటుంది. ఎందుకంటే సాధారణంగా బ్లాగ్స్ అనేవి వ్యక్తిగతమైనవి కాబట్టి. కానీ పబ్లిక్ సైట్స్ లో ఇష్టం వచ్చినట్టు రాసేసి నన్నెవ్వరూ ఏకకూడదో అంటే ఎలా కుదురుతుంది? ఈ మధ్య ఒక స్నేహితుడు చెప్తే ఎప్పుడు వెళ్ళే సైట్‌లోనే అంతగా ఎప్పుడూ వెళ్ళని ఆర్టికల్స్ సెక్షన్‌లో ఒక కవిత (అనబడే పనికిమాలిన రాత) చదివాను. కవయిత్రి అంతకుముందు రాసిన ఒక కవిత (అనబడే ఇంకో పనికిమాలిన రాత)కి వచ్చిన స్పందన భరించలేక తన ప్రతిస్పందన ఇంకో కవిత రూపంలో ఇచ్చిందన్నమాట.ఆవిడ బాధేంటంటే(లేదా గోల అనాలేమో) అసలీ భూమ్మీద ఆడదానికి వచ్చే కష్టాలన్నింటికీ కారణం మగవాడు అని. మగవాడన్న జీవి భూమ్మీద లేకపోతే స్త్రీ మహా సుఖంగా బతుకుతుంది అని ఆవిడ ఉవాచ. స్త్రీ స్వాభిమానానికి విలువ లేదని మహా దీనంగా చెప్పింది. అసలా కవితలో ఒక్క ముక్కన్నా అర్థవంతమైనది ఉంటుందేమో అని చాలా ఓపిగ్గా చివరివరకు చదివాను. చివరిలో ఆవిడ పేరు చూసి పొట్ట చెక్కలయ్యేంత నవ్వు వచ్చింది. ఆ విషయం తర్వాత చెప్తాను. అసలు ఆవిడ వాదనలో రెండు పాయింట్లు ప్రస్ఫుటంగా కనిపించాయి.

1. స్త్రీల కష్టకారణం పురుషుడు.
2. స్త్రీ స్వాభిమానానికి విలువ లేదు.

మొదటి పాయింటు నాకెప్పుడు అర్థం కాదు. ఎందుకు ఎప్పుడు ఆడవాళ్ళ కష్టాలకి మగవాళ్ళని కారణభూతం చేస్తారు? మగవాడేనా ఎప్పుడూ భూతం, దయ్యం? ఎంతమంది తాటకి, శూర్పణఖలు లేరు? ఒకప్పుడు స్త్రీ చదువుకి దూరంగా ఉండటం కానేమి కుటుంబ పరిస్థితులు కారణం కానేమి సమాజం పోకడలు కానివ్వండి ఆడది ఒక అడుగు వెనక్కే ఉండవలసి వచ్చింది. కానీ కాలం మారింది. కాలంతో పాటు సమాజమూ మారింది. సమాజంతో పాటు మనుషులు మారుతున్నారు. నేటి స్త్రీ అడుగు పెట్టని చోటేది? తన సత్తా చాటని రంగం ఏది? గగనాంగనాలింగనోత్సాహియై అన్నట్టు ఆకాశం అందుకోవటానికి ప్రయత్నిస్తున్న ఈరోజుల్లో కూడా ఇంకా ఆడది దీనావస్థలో ఉందని దానికి కారణం మగవాడని ఎందుకు పాడిందె పాడరా పాచిపళ్ళ దాసరి అన్నట్టు వల్లిస్తారు? స్త్రీ పరిస్థితి పూర్తిగా మారిందని నేనూ అనను. కానీ ఒకప్పుడు 70-30 ఉంటే ఇప్పుడు 30-70 అయింది. మారిన స్థితికి సంతోషిస్తూ మారని జీవితాలని మార్పు వైపుకి తీసుకెళ్ళే ప్రయత్నం చెయ్యాలి అంతే కానీ కారణాలు ఎంచుతూ కూచుంటే ఒరిగేది ఏదీ లేదు. తన కాళ్ళ మీద నిలబడగలిగి సాటి స్త్రీని కూడా పైకి తీసుకురావాలని ప్రతి స్త్రీ కోరుకుంటే ఏ మగవాడు ఏమీ చెయ్యలేడు సాయం తప్ప.

ఇక రెండో పాయింటు స్త్రీ స్వాభిమానం. :) ఈ కవితవిక రాసిన రచయిత్రి ఆఖరికి తన సొంతపేరు మీద కూడ మనగలననే నమ్మకం లేని ఆవిడ. పేరు ముందు శ్రీమతి, పేరు తర్వాత భర్త పేరు అలంకారంగా పెట్టుకున్న మహానుభావురాలు. మరి ఆవిడ స్త్రీ స్వాభిమానాన్ని గురించి ఎలా మాట్లాడగలుగుతోందో నాకైతే అర్థం కాలేదు. పెళ్ళి కావాలి. ఆ పెళ్ళితో పాటూ వచ్చే సాంఘిక భద్రత, గౌరవం కావాలి. కానీ ఆ మొగుడనే మగవాడు అక్కరలేదు. ఏంటో వీళ్ళ లెక్కలు. ఇన్ని లెక్చర్లు ఇస్తారు పోనీ ఏమైనా కాంక్రీటుగా వెలగబెడతారా అంటే ఊహూ. మిసెస్ శ్రీరాం అనో మిసెస్ గోపాల్ అనో పిలిపించుకుంటూ చీర నలక్కుండా మైకులు విరగ్గొడుతుంటారు, కలంలో సిరా అవగొడుతుంటారు లేదా కీబోర్డ్ కీస్ చెడగొడుతుంటారు. రావణాసురుడికన్నా, లంఖినికన్నా పెద్ద పిశాచాలు వీళ్ళే. ఎప్పటికి బాగుపడతారో. వీళ్ళ మీద ఉపయోగించటానికి రెయిడ్ లాంటిది ఏదైనా ఎవరైనా కనిపెడితే బావుంటుంది. సమాజం బోల్డు బోల్డు బాగుపడిపోతుంది.