Saturday, August 18, 2007

మేల్కొలుపు ఎప్పుడు?

శ్రీరామనామాలు శతకోటి. ఆయన నామం తేనెకన్నా, చెరుకురసంకన్నా రుచి అన్నారు రామదాసు. బ్రహ్మరుద్రాదులకు సతతము ఆత్మమంత్రమైన రామనామ భజన చెయ్యమంటారు త్యాగరాజస్వామి. రామనామం రామబాణంతో సమానం అని సాక్షాత్తూ హనుమంతులవారే అన్నారు. శ్రీరామ అన్న మూడక్షరాల నామానికి దాసులయినవారెందరు. నాకు నచ్చే పేర్లలో శ్రీరామ్ ఒకటి. వినటానికి ఎంత బావుంటుందో. అసలు విష్ణువు అన్ని అవతారాల్లోకి నాకు నచ్చినది రాముడి అవతారం. మిగతా అవతారాల్లో దేవుడు కాబట్టి మాయలని, శక్తిని చూపించాడేమో కానీ రాముడి అవతారంలో ఆయన సాధించిన ఘనత అంతా ఒక మానవుడిగా, సాధారణ మనిషిగా. కొడుకుగా ఎలా ఉండాలో, భర్తగా ఎలా ఉండాలో, అన్నగా, రాజుగా ఏ ధర్మాలని పాటించాలో మాటల్లో చెప్పలేదు. చేసి చూపించాడు. అటువంటి ఆదర్శపురుషుడు పుట్టిన స్థలంలో గుడి లేకపోవటం శోచనీయం. అయోధ్యకి వెళ్ళినప్పుడు నిజంగా కడుపులో మెలిపెట్టి తిప్పినంత బాధ వేసింది. ధర్మాన్ని ఆచరించటం నేర్పిన రాముడి నెత్తిన కేవలం ఒక గొడుగులాంటి గుడ్డ అడ్డం పెట్టి ఉండటం చూస్తే ఏ రామభక్తుడికైనా పట్టరాని దు:ఖం కలుగుతుందేమో. ఆయన దర్శనం కోసం వెళ్ళినప్పుడు రకరకాల సెక్యూరిటీ చెక్స్ ని దాటుకుంటూ అఖరికి మంచినీళ్ళ సీసా కూడా తీసుకెళ్ళడానికి లేకుండా ..... మన దేశంలో మన ఇష్టదైవాన్ని దర్శించుకోవటానికి ఇన్ని రెస్ట్రిక్షన్స్ ఏంటో అర్థం కాదు. కనీసం ఆయన నెత్తిన ఎండా వానా బారినపడకుండా ఒక గూడు ఉందా అంటే అదీ లేదు. మహారాజు ఆయన. రామరాజ్యం అంటే ఇలా ఉంటుంది అని చూపించిన రవికులశేఖరుడు. ఈరోజు తల దాచుకోవటానికి గూడు కూడా లేదు. కాశీకి వెళ్తే అక్కడ ఉండవలసిన చోట గుడి లేదు. మధురకి వెళ్తే అక్కడా అంతే. సరే. అవన్నీ ఎప్పుడో జరిగాయి, పరాయి పాలనలో ఉన్నప్పుడు, అందుకే మనమేమీ చెయ్యలేకపోయాం అనుకుందాం. కానీ ఈరోజు? ఎప్పుడో యుగాల క్రితం నిర్మించినది అయినా చెక్కుచెదరకుండా ఉన్న సేతువుని ఎందుకు ధ్వంసం చెయ్యటం? ఎందుకింత అధమ స్థితిలో ఉన్నాం మనం? కట్టటం ఎలానూ చేతకాదు. ఉన్నవాటిని కూడా చెడగొట్టుకోవటం మనకి తెలిసినట్టు ఇంకెవరికీ తెలియదేమో. ఇదేమిటయ్యా అని అడిగితే కరడుగట్టిన హిందూవాది అయిపోతారు. ఎవరింటికన్నా వెళ్ళి వాళ్ళ వస్తువులు నాశనం చేస్తే వాళ్ళు ఊరుకోరుగా. కనీసం ఇదేంటని అయినా అడుగుతారుగా. ఆ అడగటం హిందూవాదో ఇస్లాంవాదో అవటం అయిపోతుందా? గట్టిగా అడిగితే మతమౌఢ్యం అంటారు. అసలు హిందుత్వం మతం ఎలా అయింది? హిందుత్వం అంటే ఒక సంస్కృతి కానీ మతం కానే కాదు. ఆ సంస్కృతి నించి మిగతా మతాలు పుట్టుకొచ్చాయి అన్నది జగమెరిగిన నిజం. మరింక హిందుత్వానికి ఎవరికి తోచిన అర్థాలు వాళ్ళిచ్చేసుకుని నాలిక ఎటు తిరిగితే అటు మాట్లాడటంలో అర్థం ఉందా? మనదేశంలో మనకి గౌరవం నిలవాలంటే ఏం చెయ్యాలి? సాధ్వి రితంభర చెప్పిన మాట గుర్తొస్తోంది. సాత్వికంగానే ఉండు. మంచిగానే మాట్లాడు. కానీ వేలికి సుదర్శనచక్రం ధరించి మాట్లాడు. ఎదుటివాడికి తను తప్పు మాట్లాడితే ఆ సుదర్శనచక్రాన్ని ఉపయోగిస్తావనే భయం కలగాలి. అప్పుడు నీకు రావలసిన గౌరవం నీకు దక్కుతుంది. ఆవిడ నూరుశాతం కరెక్ట్ కదూ.

No comments: