Saturday, August 25, 2007

శంకరాభరణం డాబా ఇల్లు

కె.విశ్వనాథ్ గారి సినిమాలలో ఇళ్ళు భలే నచ్చుతాయి నాకు. పూరి గుడిసెలైనా చక్కగా మంచి డిజైన్స్ తో ఏ ఏరు పక్కనో చుట్టూ దడి ఉండి లోపల బాగా విచ్చుకున్న బంతిపూల మొక్కలు హ్మ్మ్మ్ ..... వెంటనే అక్కడికి వెళ్ళి ఉండాలనిపిస్తుంది. :) ఇందాక శంకరాభరణంలో సామజవరగమనా పాట చూశాను. అందులో రెండో చరణం వేసవి రేయిలా లో ఒక డాబా ఇల్లు చూపిస్తారు. ఎదురుగా కొండలు వాటి మధ్య ఒక నది వంపులు తిరిగి ఉంటుంది. వర్ణించనలవి కాని అందమైన అద్భుత దృశ్యం. ఆ ఇల్లు ఎక్కడ ఉందో, ఎక్కడ షూట్ చేశారో తెలీదు కానీ అసలా ఇల్లు కట్టుకున్నవారిది ఎంత చక్కటి అభిరుచి అయ్యుండాలి. అదృష్టవంతులు. మామూలు రోజుల్లోనే అంత చక్కటి దృశ్యాన్ని చూస్తూ అన్నీ మర్చిపోవచ్చు. ఇంక పౌర్ణమి రోజుల్లో చెప్పక్కరలేదేమో. వెన్నెల ఆ నీళ్ళ మీద పడి రిఫ్లెక్ట్ అవుతూ ..... ప్రకృతిని మించిన సౌందర్యం ఇంకెక్కడ ఉంది? ఇంకా రెండు రోజుల్లో శ్రావణ పౌర్ణమి. ఇప్పటికిప్పుడు మేఘాల మీద కూచుని అక్కడికి చేరుకుంటే ..... పక్కన ఉన్న బుజ్జి స్విమ్మింగ్ పూల్ లో వెన్నెల పడి ఇంత బావుంటే ఇంక ఆ నదిలో అలల మీద వెన్నెల కిరణాలు తేలుతూ సాగిపోతుంటే ..... ఆ ఇల్లు అలా ఉందో లేదో, ఆ కొండలు, నది అలా ఉన్నాయో లేవో, మన భూఆక్రమణదారులు వాటిని ఇంకా అలానే ఉంచారో లేదో. అన్నీ అప్పటిలానే ఉంటే, ఆ ఇల్లు నాకు అమ్మేస్తే ఎంత బావుంటుందో (దారుణమైన ఆలోచనే కానీ ..... బావుంటుంది :)).

1 comment:

Anonymous said...

మనుషులకు దూరంగా .. అలాంటి ఇల్లెక్కడన్నా వుంటే నాకూ చూపండి, నాకూ అలాంటి ఇంట్లో వుంటూ..
"ఆకొండవాగు ఆనంద సీమలో
వెన్నెల స్నానాలు చేయుదమా
..అహా హా అహ హా " అని పాడుకుంటూ, ఒంటరిగా కొన్నాళ్ళు గడపాలని వుంది.

విశ్వనాథ్ :)