Saturday, August 11, 2007

సమ్ టైమ్స్ విన్నింగ్ ఈజ్ ఎవ్రీథింగ్.

ఇప్పుడే ఒక మంచి సినిమా చూసి వస్తున్నాను. గత మూడు వారాలుగా ఆఫీసులో రక్తం చిందించి చిందించి ఇంక చిందించటానికి రక్తం మిగలక సరే శుక్రవారం కదా తొందరగా ఇంటికి వచ్చి బోలెడు రెస్ట్ తీసుకుందాం అనీ శని ఆదివారాలు ఎవరికీ దొరకకుండా ఎంచక్కా బజ్జుందాం అని మన పంచ వర్ష ప్రణాళికలాగా ఈ వారాంతానికి ఒక ప్రణాళిక పకడ్బందీగా వేశాను. కానీ మధ్యానం ఫోన్. సినిమాకి వెళ్దాం. ఈరోజే రిలీజ్ టికెట్స్ బుక్ చేస్తున్నాను అని. అప్పటికే మా డామేజర్ ఈరోజు కూడా నా సాయంత్రం ఆఫీసుకి బలి ఇద్దామని వీర లెవెల్ లో ప్లానేస్తున్నాడు. సందిగ్ధ పరిస్థితి. ఏం చెయ్యాలో ఏమవుతుందో తెలీదు. చెప్పొద్దూ. చిరాకేసింది. కానీ ఎలాగో ఎనిమిదింటికి ఆఫీసు నించి బైటపడి ఇంటికి చేరుకున్నాను. అప్పటికి సినిమా పేరేంటో కూడా తెలీదు. ఏదో హిందీ సినిమా అని 10.00 కి షో అనీ తెలుసు. అంతే. సరే 9.15 కి బైల్దేరి మెల్లగా వెళ్ళి. పాపకారం, మౌంటెన్ డ్యూ కొనుక్కుని థియేటర్ లో సెటిల్ అయ్యాం. అప్పటికి 5 నిమిషాలు అయింది సినిమా స్టార్ట్ అయి. ఎవరో హాకీ యమా సీరియస్ గా ఆడుతున్నాడు. ఎవరా అని చూస్తే షారుక్ ఖాన్. అరే! షారుక్ ఖాన్ సినిమా కొత్తది రిలీజ్ అయిందా అని కొంచెం ఇంటరెస్ట్ పెరిగి చూడటం మొదలెట్టాను. సినిమా అయ్యేవరకు కదలలేదు.

సినిమా కథ టూకీగా,

కబీర్ ఖాన్ ఇండియా హాకీ టీమ్ కి కెప్టెన్. వరల్డ్ కప్ ఫైనల్స్ లో పాకిస్తాన్ చేతిలో ఓడిపోతుంది ఇండియా టీం. కబీర్ ఖాన్ పాకిస్తాన్ వాళ్ళతో చేతులు కలిపాడనీ, డబ్బుల కోసం దేశానికి ద్రోహం చేశాడనీ, ముస్లిం కాబట్టి టెర్రరిస్ట్ అనీ బోలెడు విమర్శలు వస్తాయి. హాకీ బోర్డ్ చైర్మన్ కూడా షారుక్ ని దోషి గా నమ్ముతాడు. షారుక్ ని టీమ్ నించి పీకేస్తారు. వాళ్ళు ఉండే మొహల్లాలో కూడా దేశద్రోహి అని ముద్ర వేస్తారు. చివరికి షారుక్ ఆ ఇల్లు వదిలి తల్లిని తీసుకుని ఎక్కడికో వెళ్ళిపోతాడు. ఏడేళ్ళ తర్వాత హాకీ వరల్డ్ కప్ కి ఇండియన్ విమెన్ హాకీ టీమ్‌ని పంపించాలి అనుకుని హాకీ బోర్డ్ ఒక నిర్ణయం తీసుకుంటుంది. ఎలాగు ఓడిపోయేదే కాబట్టి సరదాగా హాకీ ఆడటం రాని వారిని అయినా సరే కోచ్ గా నియమించి గడిపేద్దాం అనుకుంటారు. అప్పుడూ షారుక్ రంగప్రవేశం చేసి తను కోచ్ గా ఉండి ఎవరికీ ఆశలు నమ్మకాలు ఏ మాత్రం లేని భారతీయ ఆడవాళ్ళ హాకీ టీమ్‌ని ప్రపంచ కప్ లో గెలిపిస్తాడు.


కొంచెం లగాన్ పోలికలు ఉన్నాయి ప్లస్ చివరికి ఏమవుతుందో కూడా తెలిసిపోతుంది. ఇలాంటి సినిమాలలో కథ కన్నా కథనానికి ప్రాముఖ్యత ఎక్కువ. అది దర్శకుడు చక్కగా మెయింటైన్ చేశాడు. ఎక్కడా చెప్పదలచుకున్న పాయింటు నించి డీవియేట్ అవటం కానీ చెప్పాలనుకున్నదాని కన్నా ఎక్కువ చెప్పటం కానీ లేదు. నీట్ గా చెప్ప్దలచుకున్నది స్పష్టంగా చెప్పారు. అలా అని కేవలం ప్రపంచ కప్ లో గెలవటం ఒకటే పాయింటు కాకుండా రెండు మూడు చేర్చినా ఎక్కడా బోర్ కొట్టించలేదు. భారద్దేశ ముస్లింస్ టెర్రరిస్ట్స్ కారు, వాళ్ళకి దేశభక్తి ఉంటుంది అన్నది ఒక పాయింటు అయితే, హాకీ మన దేశ అధికారిక ఆట అయినా క్రికెట్ కంటే చాలా తక్కువ ఆదరణ ఉండటం గురించి, భారతీయ స్త్రీలు కేవలం వంటింటి కుందేళ్ళు కారనీ, వాళ్ళకీ కెరియర్ చాలా ముఖ్యమనీ, కేవలం ఒకరికి భార్యగా మిగిలిపోవటానికి వారు ఎంత మాత్రం అంగీకరించరనీ ఇలా చాలా పాయింట్లు కవర్ చేశారు. కానీ ఎక్కడా దేన్నీ జీళ్ళపాకంలా సాగదీయలేదు.

రకరకాల రాష్ట్రాలనించీ రకరకాల అంతస్థులనించీ భాషాభేదాలతో విచిత్రమైన మనస్తత్వాలతో వచ్చిన 16 మంది అమ్మాయిలని ఒక చోట చేర్చి వాళ్ళల్లో టీం స్పిరిట్ నింపి ఆత్మవిశ్వాసం పెంచి ఆటని ఆటగా కాక ఒక లక్ష్యంగా ఎలా మార్చుకోవాలో, మార్చుకుని ఎలా సాధించాలో చక్కగా చెప్పాడు. షారుక్ కూడా ఎక్కడా షారుక్ లా అనిపించలేదు. కబీర్ ఖానే కనిపించాడు. అదొకటి నచ్చింది. వెర్రి మొర్ర్రి బాలీవుడ్ హీరో వేషాలెయ్యకుందా బాగా చేశాడు. షారుక్ ఇంకా ఇద్దరు ముగ్గురు నుక్కడ్ సీరియల్ లో వాళ్ళు తప్ప మిగతా అందరూ కొత్తవాళ్ళు. ముఖ్యంగా అమ్మాయిలు చక్కగా చేశారు. పాటలు అన్నీ బాక్ గ్రౌండ్ లో వచ్చేవే. కానీ బావున్నాయి. విన్నింగ్ షాట్ సీన్ ఇంకా కొంచెం క్రిస్పీగా తీస్తే బావుండేది అనిపించింది. చూడాల్సిన సినిమా. నేను రికమెండ్ చేస్తాను. ఇంతకీ సినిమా పేరు చెప్పలేదు కదా. చక్ దే ఇండియా.

నాకు బాగా నచ్చింది, అమ్మాయిల దగ్గర షారుక్ అనే మాట.

" ముఝే స్టేట్స్ కే నాం న సునాయీ దేతే హై నా దిఖాయీ దేతే హై. సిర్ఫ్ ముల్క్ కే నాం దిఖాయీ దేతీ హై. ఇండియా. "

మనం దేశం కోసం మొదట ఆలోచించాలనీ, ఆడాలనీ తర్వాత టీం గురించి ఆలోచించాలనీ ఆ తర్వాత తన గురించి ఆలోచించాలనీ అంటాడు. ఎంత నిజం కదా. :)

సినిమాలో అన్నట్టు " సమ్ టైమ్స్ విన్నింగ్ ఈజ్ ఎవ్రీథింగ్. "

కుచ్ కరియే కుచ్ కరియే
నస్ నస్ మేరీ ఖౌలే హోయే కుచ్ కరియే .....
కుచ్ కరియే కుచ్ కరియే
బస్ బస్ బడా బోలే అబ్ కుచ్ కరియే
హో కొయీ తో చల్ జిద్ ఫడియే
డూబే దరియే యా మరియే
హాయే..కొయీ తో చల్ జిద్ ఫడియే
డూబే దరియే యా మరియే .....

చక్ దే .....
హో చక్ దే ఇండియా
చక్ దే .....
హో చక్ దే ఇండియా

నో వేర్ టు రన్ నో వేర్ టు హైడ్
దిస్ ఈజ్ ద టైం టు డూ ఇట్ నౌ

No comments: