Thursday, July 26, 2007

నగుమోము గనలేని

రాగం : ఆభేరి
తాళం : ఆది

నగుమోము గనలేని నా జాలి తెలిసి నను బ్రోవగ రాదా శ్రీ రఘువర ..... నీ
నగుమోము గనలేని నా జాలి తెలిసి నను బ్రోవగ రాదా శ్రీ రఘువర

నగరాజధర నీదు పరివారులెల్ల ఒగి బోధన జేసేవారలు గారే అటులుండరుగా నీ .....
నగుమోము గనలేని నా జాలి తెలిసి నను బ్రోవగ రాదా శ్రీ రఘువర

ఖగరాజు నీ యానతి విని వేగ చనలేదో
గగనానికి ఇలకు బహుదూరంబనినాడో
జగమేలే పరమాత్మ ఎవరితో మొరలిడుదు
వగ జూపకు తళను నన్నేలుకోరా త్యాగరాజనుత నీ .....

నగుమోము గనలేని నా జాలి తెలిసి నను బ్రోవగ రాదా శ్రీ రఘువర

ఈ కీర్తన ఎందుకు ఇష్టం అని అడిగితే రెండు పేజీల్లో చెప్పటం క్లుప్తంగా చెప్పటం అవుతుందేమో. త్యాగరాజులవారి అన్ని భావాలు ఇందులో కనిపిస్తాయి నాకు. జాలి, వేడుకోలు, అనుమానాలు అన్నింటి కలబోత. నీ చుట్టూ ఉన్న నీ పరివార బృందం నీ మనసు విరిచేసుంటారా, అటువంటివారు కారే లేక పదవయ్యా అన్న నీ ఆనతి విని ఖగరాజు త్వరగా రాలేకపోయాడా లేక గగనానికి భూమికి చాలా దూరం ఉంది వెళ్ళటం కష్టం అన్నాడో, ఇంకా ఏమైందో అని బోలెడు అనుమానాలు వ్యక్తం చేసినా ఓ జగాలనేలే పరమాత్మా నీకు కాక ఇంక ఎవరితో చెప్పుకోను, అన్యధా శరణం నాస్తి, వగ చూపించకు నీ దర్శనాన్ని ప్రసాదించి ఏలుకోవయ్యా అని ప్రార్ధించటం ఇవన్నీ చిన్న చిన్న పదాలలో భావార్ధ ప్రకటన చెయ్యటం త్యాగరాజులవారికే చెల్లింది. :)


పండరీపురం గుళ్ళో ముందర హాల్లో ఒక స్తంభం మీద గజేంద్రమోక్షం చెక్కి ఉంటుంది. అది చూడగానే నాకూ అమ్మకి ఒకేసారి ఈ పాట గుర్తుకు వచ్చింది.

ఖగరాజు నీ ఆనతి విని వేగ చనలేదో గగనానికి ఇలకు బహు దూరంబనినాడో జగమేలే పరమాత్మా ఎవరితో మొరలిడుదు, వగ చూపకు తాళను నన్నేలుకోరా .....

No comments: