Monday, July 23, 2007

చాన్నాళ్ళకి :)

ఇక నించైనా కాస్త రెగ్యులర్ గా బ్లాగాలి.

ఈరోజు ఆఫీస్ లో బోలెడుసేపు పని చేశా. ఏంటో ఏ దేశమేగినా ఎందుకాలిడినా ఈ రక్తం ధారపొయ్యటం తప్పదల్లే ఉంది.

ఈరోజంతా వర్షం పడుతూనే ఉంది. సాయంత్రం బైటికి వచ్చి చూస్తే వర్షంలో తడిసిన ప్రకృతి ఎంత బావుందో. ఇన్ని రోజులు గమనించలేదు కానీ ఎంత బావుందో మా ఆఫీసు చుట్టుపక్కల. మా ఆఫీసు ఎత్తుగా కొండ మీద ఉంటుందేమో, చుట్టూ పచ్చని కొండలు. ఏ హంగామా లేకుండా ప్రశాంతంగా ఉన్న పరిసరాలు. పల్లెటూరైనా మొదట్లో విసుక్కున్నా ఇప్పుడు నచ్చుతున్నట్టే ఉంది. :) ఏది నచ్చినా నచ్చకపోయినా మన సాటి భారతీయులు ఎందుకు నచ్చేలా ఉండరు? మిలియన్ డాలర్ ప్రశ్నేమో ఇది. ఎందుకని చూడగానే మొహం తిప్పుకుంటారు? చిన్న చిరునవ్వు నవ్వితే సొమ్మేం పోదు అన్న చిన్న విషయం ఎందుకు పట్టదు? ఎవరినో అడిగితే అన్నారు, నవ్వితే సాన్నిహిత్యం పెరిగి సహాయం చెయ్యమంటారేమో అని. ఇది ఇంకా విడ్డూరంగా అనిపించింది నాకు. పలకరింపుగా చిరునవ్వు నవ్వితే అది సన్నిహితంగా ఉండటం అయిపోతుందా? అయినంత మాత్రాన సహాయం అడిగేస్తారా? ఒకవేళ అడిగినా చెయ్యగలిగితే చేస్తారు లేదంటే లేదు. ఆ మాత్రానికి బెదరటం ఎందుకు? పైగా చెయ్యగలిగిన సహాయం చెయ్యటం తప్పేమీ కాదుగా. ఈ పలకరిస్తే సహాయం అడుగుతారు అన్నమాట కూడా సరికాదని నాకు అనుమానం. ఎందుకంటే ఈ దేశపు వాళ్ళని మొహం ఇంత చేసుకుని మరీ పలకరిస్తారు మరి. :) స్వదేశీయులంటే ఎందుకంత విరక్తో వారికే తెలియాలి.

No comments: