Friday, August 17, 2007

జడకుప్పెలు, నాగరం, చామంతిబిళ్ళ

వెలుగు నీడలులో పాడవోయి భారతీయుడా పాట రాద్దామని చాలారోజుల తర్వాత ఆ పాట విన్నాను. ఆ సినిమాలో పాటలన్నీ నచ్చుతాయి నాకు కానీ ఈ పాట కొంచెం స్పెషల్. పాట భావం, అర్థం, గానం ఇవన్నీ ఒక కారణం అయితే ఇందులో రాజసులోచన చాలా నచ్చుతుంది నాకు. తెలుగింటి చీరకట్టు, నడుముకి వడ్డాణం, బారెడు జడకి కుప్పెలు, చామంతిబిళ్ళ, పాపిటబిళ్ళ అన్నీ కలిసి అసలు సిసలు ఆంధ్రుల ఆడపడుచులా ఉంటుంది. అసలు జడకుప్పెలు నాగరం చామంతిబిళ్ళ ఇవన్నీ ఇప్పుడు కనిపిస్తున్నాయా? నేను పుట్టినప్పుడు ఇవి కొందామని హైదరాబాదులో బంగారు కొట్లన్నీ తిరిగారట మా వాళ్ళు. అసలవేంటి అని అడిగారట షాప్ వాళ్ళు. ఇంక లాభం లేదని కోస్తాకి వెళ్ళి కొనుక్కొచ్చారు. ఏం లాభం? :( ఈ ఉరుకులు పరుగుల కాలంలో అవి పెట్టుకునేంత జుట్టు మెయింటైన్ చేసే తీరికా ఓపికా ఎక్కడున్నాయి. బారెడు జడలన్నీ మూరెడు పోనీటెయిల్స్ అయ్యాయి. బంగారం ధర పెరిగిందని చంకలు గుద్దుకుంటూ వాటిని భద్రంగా లాకర్లో పెట్టుకోవటం తప్ప ఇంకేం చెయ్యగలం. :(

2 comments:

Anonymous said...

లాకర్లో ఎందుకు పెట్టడం? చక్కగా వేసుకుని అమెరికాలో తిరగచ్చుగా?! :)) ;)
శంకర్

పద్మ said...

బారెడు జడలు మూరెడు పోనీటెయిల్స్ అని చెప్పాక కూడా ఈ ప్రశ్న ఏంటి శంకూ. :p ఆ బారెడే ఉంటే అమెరికా అయినా ఆంధ్రా అయినా సింగపూరైనా పెట్టుకోవచ్చు ఎంచక్కా. :p