Wednesday, October 24, 2007

నిత్య నూతనం ..... నిత్య సత్యం

కలువకు చంద్రుడు ఎంతో దూరం పాటలో ప్రతీ చరణం గురించి ఒక పేరా రాయచ్చేమో. ఈ పాట రెండు పాత పాటలనించి ఇన్స్పిరేషన్ పొందినట్టనిపిస్తుంది. ఒకటి మాయాబజార్‌లో నీకోసమే నే జీవించునది పాటలో "విరహము కూడా సుఖమే కాదా, నిరతము చింతన మధురము కాదా", రెండు మూగమనసులులో పాడుతా తీయగా చల్లగా. ఈ రెండు పాటల నించి ఇన్‌స్పైర్ అయినట్టు అనిపిస్తుంది. కానీ ఈ పాట చరణాలు నిత్యసత్యాలు.

1.) ఏ నవ్వు ఒక్కరకంగా ఉండదు, పసిపిల్లల బోసినవ్వులు తప్ప. నవ్వటం ఒక వరం అన్నారు పెద్దలు. కానీ ఎంతమందికి ఆ వరం దొరికుంటుంది? నేను కొంతమందిని చూశాను. పక్కవాళ్ళని చూసి నవ్వితే ఎక్కడ చుట్టుకుపోతారో అని ఎప్పుడు మొహం మటమటలాడించుకునేవాళ్ళని బోలెడు మందిని చూశాను. జాలేస్తుంది పాపం వాళ్ళని చూస్తే. కలిమిలేములని, కష్టసుఖాలని మరిపించి అందరినీ స్నేహితులని చేసే చిరునవ్వు విలువ తెలీదు పాపం పిచ్చిమొహాలు. :)


2.) వలపు కన్నా తలపే తీయన. ప్రేమలో పడ్డవాళ్ళందరూ కెవ్వుమనాలా ఇప్పుడు? :) కానీ నిజమే వలపులో ఉన్నవారు దూరం అవవచ్చునేమో కానీ తలపులో ఉన్నవారెప్పుడు మాసిపోరు. ఆ తలపులలో వారు నిత్య యౌవనులు.

మనిషికి రేపు మీద ఉండే ఆశ ఆ రేపుని ఎంతో తియ్యగా చేస్తుంది. నేటిలో ఉన్న దు:ఖం ఆచూకీ రేపటితో మాయం అవుతుందనీ, కన్న కలలన్నీ నిజం అవుతాయనీ, కష్టాలన్నీ తీరిపోతాయనీ మనిషి ఆ రేపు మీద పెట్టుకున్న ఆశే ఆ రేపుని మరింత తీయగా, మరీ మరీ ఎదురు చూసేలా చేస్తుంది. ఆ రేపులో అనుకున్నవి తీరకపోయినా, ఆ మరుసటిరోజు ఇంకా తీయగా కనిపిస్తుంది. అనంతకాల చక్రభ్రమణంలో మనిషి ఆశ కూడా ఆ రేపు చుట్టూ చక్రభ్రమణం చేస్తూనే ఉంటుంది.


3.) మనసు లేని మనిషి జంతువేగా. ఈ మాట కూడా తప్పేనేమో. ఎందుకంటే జంతువులకి కూడా మనసుంటుందని చాలా సంఘటనలు ఋజువు చేశాయి. కాబట్టి మనసులేని మనిషి జంతువు అని జంతువులని తక్కువ చెయ్యకూడదేమో. రాక్షసుడు అనుకుందామా? మనసు మనిషిని మనిషిగ చేస్తుంది ..... ఈ లైన్ చాలా నచ్చింది నాకు. వలపా మనసుకి అందాన్నిస్తుంది. ఎంత నిజం. ప్రేమ మనసుకి అందాన్నిస్తుంది. ఆత్మసౌందర్యం పెరగటం అంటే ఇదేనేమో. ప్రేమ అంటే ఆపోజిట్ సెక్స్ మీద ఏర్పడే ప్రేమ ఒకటే కాదు. మనిషిగా తోటి మనిషి మీద కలిగేదే ప్రేమ. ఆ ప్రేమ, మనసు లేని జీవితానికి విలువేముంది? మనసుతోటి ప్రేమ, ప్రేమతో అనుభూతి పుడతాయి. ఆ భగవంతుడిలా నిర్విచారంగా, నిర్వికారంగా, ఎటువంటి అనుభూతులు, భావావేశాలు లేని జీవితాన్ని ఊహించగలమా? ప్రేమ ఒక రసానుభూతి. ఆ అనుభవం లేని జీవితం నిస్సారం. ఆ ప్రేమ మనిషికే సొంతం కాదు. భూమి మీద ఉన్న చరాచర జీవకోటికి అనుభవమే. లేకపోతే చంద్రుడి కోసం కలువ ఎందుకు ఎదురు చూస్తుంది? సూర్యోదయం అవగానే పద్మం ఎందుకు వికసిస్తుంది? కలువకి చంద్రుడు ఎంతో దూరం, కమలానికి సూర్యుడు మరీ దూరం కానీ వారి మధ్య ప్రేమ నిత్య నూతనం, నిత్య సత్యం.

2 comments:

నిషిగంధ said...

చాలా చక్కగా విశ్లేషించావురా! I like the song more now!!

పద్మ said...

థాంక్స్ నిషి :)