Tuesday, October 2, 2007

ఎందరో వీరులు, వారేరీ?

ఈరోజు గాంధీ జయంతి. భారత్‌లో ఆఫీసులకి, స్కూళ్ళకి, కాలేజీలకి సెలవు. ఛ,ఒకరోజు ముందు వచ్చుంటే లాంగ్ వీకెండ్ వచ్చుండేది కదా అని అనుకోనివారెందరో వేళ్ళ మీద లెక్క పెట్టచ్చేమో. ఆగస్టు పదిహేనో తారీఖే హాలిడే కింద ట్రీట్ చేసి 'సరదా'గా టి.వి ముందో, పార్కులోనో, సినిమా హాళ్లలోనో, లేదా మందు నిషిధ్ధం కాబట్టి ముందు రోజే స్టాక్ చేసి పెట్టుకున్న బాటిల్స్ బైటికి తీసి ఖుషి ఖుషిగా గడిపే మనవాళ్ళకి అక్టోబర్ రెండు ఒక లెక్కా?

ఈ సెలవు కాన్సెప్ట్ నాకు అర్థం కాదు. అసలు సెలవు ఎందుకివ్వాలి? ఇలా ఎంజాయ్ చెయ్యటానికా? భగత్‌సింగ్ ఎంతమందికి తెలుసు ఈ తరంలో? సుభాష్ చంద్ర బోస్ ఎంత మందికి తెలుసు? అల్లూరి సీతారామరాజు ఎంత మందికి తెలుసు? సర్దార్ వల్లభాయ్ పటేల్ తెలిసిన వారెంతమంది? సెలవలు ఇవ్వకపోయినా కనీసం ఏ ప్రభుత్వానికయినా వీరి పుట్టినరోజు ఎప్పుడో తెలుసా? ఎప్పుడైనా ఉత్సవాలు జరిపారా? జలియన్‌వాలాబాగ్ ఉదంతం విని రగిలిపోయి తెల్లదొరల మీద కత్తి దూసి చిరునవ్వుతో ఉరికంబం ఎక్కిన భగత్‌సింగ్ కథ వింటుంటే రోమాలు నిక్కబొడుచుకుంటాయే ఆ భగత్‌సింగ్ పుట్టినరోజు పక్కన పెడదాం, కనీసం ఆయన ఎవరో నా తరంలో ఎంతమందికి తెలుసు? కనీసం ప్రభుత్వాధికారులకి తెలుసా లేక కాలెండర్‌లో లేదు కాబట్టి వారికి కూడా తెలిసే అవకాశం లేదా? ఏ లైబ్రరీలోనో బూజు పట్టిన పుస్తకాలు వెతికితే తప్ప తెలియని విషయమా ఇది? సిగ్గుచేటు కదూ.

"ఎందరొ వీరుల త్యాగఫలం ఈనాటి స్వేఛ్చకే మూల దినం ....." చిన్నప్పుడు స్కూల్‌లో చదువుకున్న పాట. నిజమే. ఎంతోమంది వారి జీవితాలనే అర్పణ చేసి మనకోసం సంపాదించిపెట్టిన స్వాతంత్ర్యం. మనం మన దేశాన్ని ఎంతో ముందుకు తీసుకెళ్తామని, వారు లేకపోయినా వారి వారసులమైన మనం ఆ స్వేఛ్చా వాయువులని పీలుస్తూ అభివృధ్ధిని సాధిస్తామనీ కలలు కన్నారు. కానీ ఏదీ ఆ కల? మనకి ఆ మహానుభావుల పుట్టినరోజులు కాదు కదా పేర్లు కూడా తెలీవు స్మరించుకోవటానికి. నా దృష్టిలో వారు కన్న కలలు సాకారం అయ్యేవరకు ఈ పుట్టినరోజు సెలవులు ఉండకూడదు, ముఖ్యంగా ఆ సెలవు పైన చెప్పిన విధంగా ఎంజాయ్ చేసేటటువంటిదైతే. ప్రతి స్వాతంత్ర్యవీరుడిని వారి పుట్టినరోజు నాడు ప్రతి ఆఫీసులో, కాలేజీలలో, స్కూళ్ళల్లో స్మరించుకునేలా చెయ్యాలి. అంతే కానీ సెలవులిచ్చి అపహాస్యం చెయ్యకూడదు.

3 comments:

Nishigandha said...

ఎన్నో చెత్త చెత్త విషయాలని ఎంతో ఓపికగా సేకరించి మేమే ముందు కవర్ చేసామని గెంతుకుంటూ చూపించే మీడియా వాళ్ళకి ఎందుకు తట్టదో ఈ మహానుభావుల గురించి కాస్తైనా కూస్తైనా తలుచుకోవాలని!! 'రంగ్ దే బసంతి ' లాంటి సినిమాలని నిర్మించడానికి ఎంతమందికి ధైర్యం ఉంటుందంటావ్!?!?

పద్మ said...

నిజమే నిషి. ఒకరిద్దరికి ప్రాముఖ్యతని ఇచ్చి మిగతావారిని తోసిరాజనటం ఎంతవరకు సబబు?

కరక్టే. రంగ్‌దేబసంతి సినిమా నేనైతే క్లైమాక్స్ చూడలేకపోయాను. బాధేసింది. చివరికి వాళ్ళు తీసుకున్న నిర్ణయం తప్పే కావచ్చు కానీ దానికి దారి తీసిన కారణాలు ఏవీ అని ఎవరూ పట్టించుకోరేమో. రియలిస్టిక్‌గా తీశాడు.

Anonymous said...

హాలిడే ఇస్తే ఐనా, జనాలకి గుర్తుంచుకుంటారని.. :) ఆ భావన మనసులో కలగాలి/కలిగించాలి. కాని కాచి కషాయంచేసి గొంతులో గొట్టం పెట్టి పోస్తే, వికటిస్తుంది. కొంతమంది నాయకులు చచ్చినరోజు స్వీట్లు పంచిపెట్టుకుని గుర్తుచేసుకోవాల్సుంటుంది :)
గాంధీ జయంతికి ఇవ్వాలి. స్వతంత్రం కోసం కుల,మత, భాష, ప్రాంత భేధాలు లేకుండా మొత్తం దేశాన్ని కదిలించాడంటే.. అతనో అసాధారణ వ్యక్తి. " అలాంటి వ్యక్తి రక్తమాంసాలతో ఈ భూమి మీద పుట్టాడనేది , భావి తరాలవాళ్ళు నమ్మలేరేమో" అని ఐన్ స్టీన్ అనాడంటే అది అతిశయోక్తి కాదు.

పినాకపాణి