Monday, October 15, 2007

మల్లెతీగ ..... పందిరి

ఇదివరకు ఒక పోస్ట్‌లో చెప్పాను మీనా సినిమాలో పాటలు నాకు ఇష్టం అని. చాలా అర్థవంతమైన పాటలు, ముఖ్యంగా మల్లెతీగ వంటిది పాట. ఆ పాట మొదటి చరణంలో స్త్రీకి ఎప్పుడూ ఒక తోడూ నీడ ఉండాలి అని చెప్తూనే రెండో చరణంలో ఆమె గొప్పదనం వర్ణిస్తారు. జగతికి ఆధారం స్త్రీమూర్తి అని. ఎంత నిజం కదా. :)

మల్లెతీగ ..... పందిరి లేకుండా నిలవలేదు. అలాగే పందిరి కూడా. బోడి పందిరిని చూడబుధ్ధి అవుతుందా? అందుకే మల్లెతీగకి పందిరి ఆధారం, పందిరికి మల్లెతీగ అందం. రెండూ కలిసి ఉన్నచోట ఆ నీడలో ఉన్నవారికి ఆహ్లాదం. ఆడపిల్ల కూడా మల్లెతీగవంటిదే. అందుకే ఆమె జీవితానికి ఆధారం కావాలి, పందిరిలాంటి ఆధారం. ఆ ఆధారం దొరికితే అల్లుకుపోతుంది. ఎంతగా అంటే ఆ పందిరికే అందాన్నిచ్చేంత. ఆ పందిరి చిన్నతనంలో తల్లితండ్రులు, ఈడు వచ్చాక భర్త, వయసు మీరాక పిల్లలు. ఇది ఫెమినిస్టులు చదివితే కర్ర పుచ్చుకుంటారేమో. ;) అయినా సరే నేను స్త్రీ శారీరకంగా అసమాన బలవంతురాలు అని చెప్పాలనుకోవటం లేదు. స్త్రీ అక్షరాలా బలహీనురాలే, మల్లెతీగలాగానే. శారీరకంగా పురుషుడితో ఎప్పటికీ సమానురాలు కాలేదు. కరాటే గట్రా నేర్చుకుని కొంతమంది స్త్రీలు పురుషుడికన్నా బలవంతురాళ్ళు అయ్యారేమో కానీ ప్రకృతి పరంగా స్త్రీ సున్నితమైనది, సుకుమారురాలు. కానీ శారీరకంగా మాత్రమే. మానసికంగా స్త్రీ ' అసమాన బలవంతురాలు '. పురుషుడికి శారీరకమైన బలమే కానీ మానసికంగా స్త్రీకి ఉన్నంత శక్తి లేదు. అందుకే ప్రతి పురుషుడి విజయం వెనుక స్త్రీ ఉంటుంది అన్న నానుడి వచ్చి ఉంటుంది. మగవాడే గొప్ప, ఆడదానిదే పై చేయి అని వాదనలు వింటుంటే నాకు నవ్వొస్తుంది. స్త్రీ పురుషులు ఒకరు లేకుండా ఇంకొకరు మనగలరా? ఇద్దరిలో ఏ ఒక్కరు లేకపోయినా సృష్టే లేదు. అలాంటప్పుడు ఇంక ఎవరు గొప్ప అన్న ప్రశ్నకి చోటెక్కడ? అందుకే భగవంతుడు ఇద్దరిలో ఏ ఒక్కరికి పరిపూర్ణత్వాన్ని ఇవ్వలేదేమో. స్త్రీ సుకుమారత్వాన్ని కాపాడటానికి అన్నివేళలా మగవాడి తోడు నీడా ఉండాలి. మగవాడి మొరటుదనాన్ని కప్పిపుచ్చటానికి స్త్రీ తోడు నీడా అన్నివేళలా ఉండాలి. ఏ ఒక్కరు లేకపోయినా రెండోవారు అసంపూర్ణులు. వారిద్దరు కలిస్తేనే వారికి పరిపూర్ణత, సృష్టికి సంపూర్ణత.

2 comments:

Unknown said...

మీ అనాలజీ బాగుంది.
నా ఆలోచనలు దాదాపు మీవి ఉన్నట్టుగానే ఉంటాయి.

అన్నట్టు మన బ్లాగులలో ఫెమినిస్టులు ఎక్కువ లెండి ;)

అవును ఇంతదాకా మీ బ్లాగు నాకు తగలలేదు. కూడలిలో లేదా ?

పద్మ said...

థాంక్స్ ప్రవీణ్ గారు. :)

ఫెమినిస్టులు లేనిదెక్కడలెండి. :p

లేదండి కూడలిలో నా బ్లాగ్ పెట్టలేదు. :)