Tuesday, January 22, 2008

హేమంతపు పౌర్ణమి

ఈరోజు హేమంతపు పౌర్ణమి. చిన్నప్పటినించి ఈ రోజంటే మహా ఇష్టం. అసలు ఈ రోజు చంద్రుడు నిండుగా, తెల్లగా మెరిసిపోతూ ఉంటాడు. అనటం కాదు కానీ కార్తీక పౌర్ణమి కన్నా ఈ రోజే చంద్రుడు తెల్లగా ఉంటాడు. అన్ని ఋతువుల్లోకి హేమంతం నాకు చాలా ఇష్టం. ముఖ్యంగా జనవరి నెల. కొత్త సంవత్సరంతో మొదలు సంక్రాంతి ఈ నెలలోనే వస్తుంది. ఎగ్జిబిషన్ ఈ నెలలోనే మొదలవుతుంది (చిన్నప్పుడు అదొక పిచ్చి. ఇప్పుడంటే బోలెడు మాల్స్ గట్రా వచ్చాయి, ఇంకా ప్రపంచమంతా ఒక చిన్న గ్లోబల్ విలేజ్ అయింది కానీ చిన్నప్పుడు ఎక్కడెక్కడివి చూడాలంటే ఎగ్జిబిషనే.) నాకిష్టమైన నేను పుట్టిన హేమంతపు పౌర్ణమి ఈ నెలలోనే వస్తుంది. అందుకే ఇంకా ఇంకా ఇష్టం. ఆ మధ్యెప్పుడో మా మావయ్య నా జాతకం చూస్తానని చెప్పి కిందా పైనా కాగితం తిరగేసి ఇంకే విషయం చెప్పలేదు కానీ నువ్వెందుకింత తెల్లగా ఉంటావో తెలిసిందే, పౌర్ణమి రోజు పుట్టావు కదూ అందుకు అన్నాడు. మరి అమావాస్య రోజు పుట్టినవాళ్ళందరు నల్లగా పుడతారా అని నాకొక అనుమానం తదనంతరం బోల్డు ఆవేశం కలిగాయి. మరి ఏదో భవిష్యత్తు చెప్పేస్తాడని గడ్డం కింద చెయ్యి పెట్టుకుని గంటసేపటి నించి కూచునుంటే ఆ విషయమా చెప్పేది.

ఈరోజు సాయంత్రం కూడా నిండు చందమామని చూసి ఈ రోజే ఎక్కువ మెరుస్తున్నాడు అని కన్‌ఫర్మ్ చేసేసుకుని కాసేపు చంద్రుడితో కబుర్లు చెప్పి వచ్చాను. మరి చంద్రుడు నా ఫస్ట్ బాయ్ ఫ్రెండ్ కదా. :p

10 comments:

Anonymous said...

aitE hEmanta paurNami janmadina Subhaakaankshalu!

hEmantam lO ekkuva tellagaa vunTaaDaa? adi naaku teleedu kaani, naakoo endukO alaa DifarenT gaa anipinchi naa mobail kemaraalO chandamaama fOTO teeSaanu. mee modaTi baay frenDu amerikaaku kooDaa venTabaDi vachchaaDannamaaTa! Em kaburlu cheppaaDO .. :))

Anonymous said...

ఐతే హేమంత పౌర్ణమి జన్మదిన శుభాకాంక్షలు!

హేమంతం లో ఎక్కువ తెల్లగా వుంటాడా? అది నాకు తెలీదు కాని, నాకూ ఎందుకో అలా డిఫరెంట్ గా అనిపించి నా మొబైల్ కెమరాలో చందమామ ఫోటో తీశాను. మీ మొదటి బాయ్ ఫ్రెండు అమెరికాకు కూడా వెంటబడి వచ్చాడన్నమాట! ఏం కబుర్లు చెప్పాడో .. ;) :)

" చందమామ అందాల మామ
నీ ఎదుటనేను, వారెదుట ఎదుట నీవు
మా ఎదుట ఓ మామ ఎప్పుడొస్తావు "

అని పాడావా లేదా? :))

పద్మ said...

ఓ!!! పాడుతూనే ఉన్నాను కానీ పాపం ఈ మామ ఏం చేస్తాడు, ఆ ' వారు ' రావద్దూ. అందుకే ఇంక లాభం లేదని నిన్న ఇండియన్ స్టోర్‌కి వెళ్ళినప్పుడు ఒక మాంఛి అప్పడాల కర్ర కొనేశాను. దానికి పనిన్ జెప్పెద. :p

Anonymous said...

వేడి వేడిగా చపాతీలు , కూర్మా చేసిపెట్టాలనే! :))
ఔరా! అమ్మకచెల్లా!!

శరత్

పద్మ said...

శంకూ :))

నేను ఈ కాలం అమ్మాయిని కదా మరి. టూవే యుటిలైజేషన్ కూడా తెలుసు నాకు. :p

నిషిగంధ said...

మొదటి లైన్ చదువుతూనే అనుకున్నా, ఇందులో ఎక్కడో 'కార్తీక పౌర్ణమి కంటే నాకిదే ఇష్టం' అంటావని :-)

అయితే నేను అనుకున్నట్లు అసలు రహస్యం Fair and Lovely కాదన్నమాట! :p

పద్మ said...

అబ్బే!!! నాకు తెలిసయితే చిన్నప్పుడు పాండ్స్ ప్రస్తుతం జెర్గన్స్. :p

కొత్త పాళీ said...

చాలా బాగా రాస్తున్నారు.
కూడలిలో లేటెస్ట్ టపా లంకె నొక్కి అక్కణ్ణించి తీగ లాగి డొంకంతా చూసుకూంటూ వస్తున్నా ..
హేమంత చంద్రుడు అంత బాగుంటాడా? .. మీ బయాస్ ఏమో .. నా మట్టుకి నాకు ఆకురాలు కాలమంటేనే ఇష్టం!

పద్మ said...

థాంక్స్ కొత్తపాళీ గారు.

:) నేను బయాస్డ్ అంటారా అయితే. ఏమో. అయ్యుండచ్చు. మరి పుట్టినరోజన్నాక ఆమాత్రం ఇష్టం ఉండటం, ఇష్టంతో మీరన్న ఈ బయాస్ ఉండటం సహజమే కదండీ. :) కానీ ఋతువులన్నింటిలోకి హేమంతంలోనే చంద్రుడు ఎక్కువ కాంతివంతంగా ఉంటాడని నా నమ్మకం, కవులు శరత్కాలం అంటారనుకోండి. నేనొప్పుకోను ఆ మాట. :p

అమెరికాలో అత్యంత అందమైన కాలం వీళ్ళు ఫాల్ అని పిలిచే కాలమే. ఆకులు కూడా అన్ని అందమైన రంగులు అద్దుకుంటాయంటే అబ్బురం అనిపిస్తుంది. కానీ యాజ్ యూజ్వల్ వీళ్ళ భాష ఒక పట్టాన అర్థం కాదు నాకు. :O. చక్కగా రంగులు రంగులతో కళకళలాడుతూ ఉంటే రాలే కాలం అని ఎందుకంటారో?

కొత్త పాళీ said...

I am an unbiased supporter of extreme bias :-)
బయాస్ కచ్చితంగా ఉండల్సిందే ..
ఇంకో రెండు ఋతువుల గురించి రాసిన ఈ రెండు టపాలు కూడా మీకు నచ్చుతాయేమో చూడండి.
http://kottapali.blogspot.com/2007/05/blog-post_09.html
http://kottapali.blogspot.com/2008/01/blog-post.html
ఇవి కాక నేను సంగీత సాహిత్యాల గురించివిన్నవీ కన్నవీ అని ఇంకో బ్లాగు రాస్తుంటాను. వీలెంబడి చూడండి. మరోసారి తెలుగ్ బ్లాగ్లోకానికి సాదర ఆహ్వానం. మీ కీబోర్డునించి మరిన్ని చక్కటి భావుకతతో నిండిన టపాల్ని ఆశిస్తున్నాం.