Saturday, May 29, 2010

చింతయేయుం?

భావయామి గోపాలబాలం నేను చాలా చిన్నప్పుడు విన్న కీర్తనల్లో ఒకటి. అందుకేనేమో నాకు బాగా నచ్చిన, ఇష్టమైన పాటల్లో ఇదొకటి. చిన్నప్పుడు మా ఇంట్లో ఎల్.పి ప్లేయర్ ఉండేది. అది ప్లే చెయ్యటం ఒక సరదా అప్పట్లో. బినాకా గీత్ మాలా వి ఎన్ని రికార్డ్స్ ఉండేవో. అందులో అమీన్ సయాని గొంతు గంభీరంగా అసలెంత బావుండేదో. అప్పట్లో నాకు తెలీకుండానే ఆయన గొంతుని తెగ ప్రేమించేశాను. :) ఇంకా పాండవ వనవాసం, నర్తనశాల ..... (అసలు ఈ సినిమాల్లో పద్యాలు, పాటలు ఇంకా నాకు గుర్తున్నాయంటే అది ఎల్.పి ల మహిమే. ఆరు నించి పదేళ్ళ వయసులో ఏదైనా మనసుకి హత్తుకుంటే ఇంక వాటిని కావాలన్నా మర్చిపోలేమేమో. :) ). ఎం.ఎస్.సుబ్బులక్ష్మి గారి వెంకటేశ్వర సుప్రభాతం కూడా ఉండేది. అదే రికార్డ్‌లో రెండో వైపు స్వాతి తిరునాళ్ వారి కృతులుండేవి. భావయామి రఘురామం, శ్రీరంగపుర విహారా. ఈ రెండు కృతులు విని విని నోటికి వచ్చేసాయి కూడా. అందులో భావయామి రఘురామం రామాయణ రాగమాలిక. మొత్తం రామాయణం వస్తుంది సంస్కృతంలో. అద్భుతమైన కృతి. అలా భావయామి అంటే స్వాతి తిరునాళ్ కృతి తప్ప ఇంకోటి కాదు అని గాఠ్ఠిగా నమ్మే రోజులు. ఆ సమయంలోనే టివి లో ఒకసారి ఢిల్లి నించి వచ్చే ప్రోగ్రాంలో కూచిపూడి శాస్త్రీయనృత్యం వస్తుంటే అపురూపం కదా అని వి.సి.ఆర్‌లో రికార్డ్ చేశాం. అప్పట్లో వి.సి.ఆర్ మాకు ఒక్కళ్ళకే ఉండేది. అందరిళ్ళల్లోనూ వి.సి.పిలు ఉండేవి. నేను మా అన్నయ్య దర్జాగా అవసరం ఉన్నా లేకపోయినా ప్రోగ్రాంస్ రికార్డ్ చేసేవాళ్ళం. రామాయణం, మహాభారతంతో సహా. ఇప్పటికీ ఇండియాలో ఉండాలి ఆ కాసెట్స్. అలా రికార్డ్ చేసిన ప్రోగ్రాం ఒక శాస్త్రీయ నృత్యం. ఆ కళాకారిణి గుర్తులేదు కానీ ఆవిడ నృత్యం చేసిన పాట మటుకు బాగా గుర్తుంది. అదే అన్నమాచార్యుల కృతి భావయామి గోపాలబాలం. మొదటిసారి విన్నప్పుడు ఈవిడేంటి తప్పు పాడుతోంది భావయామి రఘురామం పాడాలి కదా అనుకుని మరి కాసేపు విని అబ్బే ఈవిడ తప్పే పాడుతోంది అని తీర్మానించేసుకుని ఎమ్మెస్ అంత ఆవిడే తప్పు పాడేస్తోంది నే కనిపెట్టేశాననుకుని గొప్పగా ఫీల్ అయిపోయి మా ఇంట్లో వాళ్ళకి చెప్పి అవి రెండు వేరు వేరు పాటలమ్మా అని చెప్పినా నమ్మక ఏవీ కాదు రెండూ ఒకటే అని తీర్మానించేసుకున్న రోజులు. తర్వాత్తరువాత విషయం అర్థమై భావయామి రెండు పాటల్నీ నేర్చుకున్నాను. :) ఒకటి రాముడి గురించైతే రెండోది కృష్ణుడి గురించి. రెండూ ఆయన పాటలే. రెండూ ఆయనని మనసులో నింపుకుని సేవిస్తే ఇంక ఆ మనసులో ఎటువంటి చింతలకీ తావు లేదని చెప్పే జీవిత సారాంశాలే.

4 comments:

Pavan said...

నమస్కారం,

మీరు చెప్తున్న ఆ భావయామి కృతి గురించి నేను ఎప్పుదు వినలేదు. దయచేసి మీ బ్లాగ్ లో పెట్టగలరా...

- పవన్

ఏకాంతపు దిలీప్ said...

:) ఏంటీ వెల్లువ? ఇప్పటి దాకా నే చూడనే లేదు!

పద్మ said...

పవన్ గారు,
మీరు ఏ భావయామి గురించి అడుగుతున్నారు? అన్నమాచార్యులవారిదైతే ఈ పోస్ట్ కిందనే ఉంది. స్వాతి తిరునాళ్ వారిది అయితే త్వరలో పోస్ట్ చెయ్యాలని సంకల్పం. :)

అంతే దీపు గారు. మీ ఏకాంతం తప్ప ఇంక మీకేమీ పట్టదు కదా, మళ్ళీ అభిమానం అంటారు. ;) :P Just Kidding. వసంతకాలం కదా అందుకని వసంతాలు అలా వచ్చేస్తున్నాయి. :)

Anonymous said...

హే రాగం .. దీన్నే యాదౄఛ్చికము అంటారేమో గాని..గత కొద్ది రోజులుగా నేను ఎక్కువగా ఈ 'భావయామి రఘురామం' అనే స్వాతి తిరునాళ్ కీర్తన వింటున్నాను. అప్పుడప్పుడు ఖూనీ కూడా చేస్తున్నాను. మీ పోస్ట్ ఈ రోజు చూసి బోలెడంత ఆశ్చర్య పోయాను. రామాయణ గాథను అత్యద్భుతం గా ఆ రాగమాలిక లో కూర్చటం ..అదీ సుబ్బలక్ష్మి అమ్మగారి గొంతులో వింటుంటే ఏవో లోకాలకు కొద్ది దూరం లో ఉన్నట్లే ఉంటుంది. చాలా బాగా వ్రాసారు..ఈ మధ్యన ఇదే కీర్తన చిత్ర గొంతులో కూడా విన్నాను. ఫరవాలేదు..తనదైనా రీతిలో ఆమె కూడా న్యాయం చేసారు.

thanks for posting about this beautiful kriti.

Amrapaali