Sunday, November 11, 2007

డెమోక్రసీ అంటే?

హ్మ్మ్మ్మ్మ్. ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరూహించెదరు. జరిగేది ఊహించటంలో సాధ్యాసాధ్యాలు పక్కన పెడితే అసలు ముందు జరగబోయేది తెలిస్తే జీవితం రసవంతమనిపించుకుంటుందా? జరగబోయేవి అన్నీ మనిషి అధీనంలోనే ఉండిపోతాయి. చావుపుట్టుకలని కూడా మనిషే కంట్రోల్ చేస్తాడు. విధివిధానాలని కూడా మనిషే మార్చేస్తాడు. ఏదీ తన అధీనంలో లేనప్పుడే మనిషి బుధ్ధి వెర్రి తలలు వేస్తుంటే ఇక అన్నీ చెయ్యగలిగిననాడు మనిషి బుధ్ధి ఎటు మళ్ళుతుందో. అందుకే భగవంతుడు భవిష్యత్తుని ఎప్పుడు ఒక పజిల్‌లానే ఉంచాడు. గుప్పిట మూసి ఉన్నంతవరకే అందులో ఏముందో తెలుసుకోవాలనే ఆత్రం, తపన, ఆరాటం, ప్రయత్నం. అదే గుప్పిట తెరిస్తే నిరాసక్తత, నిర్లిప్తత ..... ఇది కాదుగా జీవితం అంటే.

మనిషి ఎప్పుడు తను ఊహించినదే రైట్ అని, తను అనుకున్నవన్నీ జరగాలనుకుంటాడు. ఆశించినది జరగకపోతే నిరాశ చెంది తనకి అన్యాయం చేశాడని భగవంతుడిని వచ్చిన నాలుగు తిట్లు తిడతాడు. అన్యాయం చేశాడని, చేసిన పూజలకి ఫలితం దక్కలేదని బాధపడతాడు. ఒక కోర్ట్ కేస్‌లో వాది, ప్రతివాది ఇద్దరిలో ఒక్కరే కేస్ గెలవచ్చు. ఒకరి ఓటమి తప్పనిసరి. ఒకరికి మంచి అనిపించినది ఇంకొకరికి చెడు అనిపించవచ్చు. ఒకరికి సరి అయినది ఇంకొకరికి తప్పు కావచ్చు. ఏదో పాటలో అన్నట్టు ఒకరికి మోదం మరియొకరికి ఖేదం అని ఒకరికి ఆనందం కలిగించిన విషయమే మరియొకరికి దు:ఖాన్ని కలిగించవచ్చు. దానికి భగవంతుడిని నిందించటం న్యాయమా? భగవంతుడికి ప్రీతిపాత్రులు అంటూ ఉంటారా? ఆయనకి అందరూ ఒకటే. రాజధర్మం కూడా అదే చెప్తుంది. రాజుకి ఉండవలసిన ప్రథమ లక్షణం ఆశ్రిత పక్షపాతం లేకపోవటం. అందరినీ సమానంగా చూడటం. రాముడు చేసినది కూడ అదే. అందుకే అల్పుడైన చాకలివాడి మాటని కూడా మన్నించాడు. లక్ష్మణుడికి సరి అనిపించినది చాకలివాడికి అనిపించలేదు. కానీ లక్ష్మణుడు ఎలా సాకేతపురంలో పౌరుడో చాకలివాడు అంతే. అల్పుడైన చాకలివాడు, వాడి మాటకి విలువిచ్చేది ఏంటి అని రాముడు తీసిపారెయ్యలేదు. ఆ అల్పుడి మాటకి కూడా విలువనిచ్చాడు. మామూలు స్త్రీ మీద ఆ నింద వేసి ఉంటే ఆయన ఇంకోరకంగా ఆలోచించేవాడేమో కానీ ఆ నింద పడింది రాజ్యపు పట్టపురాణి మీద. రాముడు అప్పుడు ఏ నిర్ణయం తీసుకోకపోయినా ఆయన పక్షపాతి అని ప్రజలు అనుమానం పడే అవకాశం ఉంది. రాజు నిర్ణయాల మీద విశ్వాసం తొలిగిపోయే అవకాశం ఉంది. అగ్నిపునీత సీత. ఆవిడ పాతివ్రత్యాన్ని ఇంకే రకంగా ఆయన నిరూపించగలడు? రాజుగా ఆ నిర్ణయం తీసుకోవటం తప్పనిసరి. అందుకే ఆయన రాజ్యం వద్దు, నా భార్యని తీసుకుని అడవులకి పోతానన్నా ఏ ఒక్కరు ఒప్పుకోలేదు. ఇంక రాజుగా ఆయన చేయగలిగింది ఏముంది? నాకు ఒక్కటే అర్థం కాదు. రాముడిని అంత తేలిగ్గా మాటలనేస్తారే, సీతని అడవులకి పంపించేసి ఆయన బాగుపడింది ఏముంది? ఇంకో పెళ్ళి చేసుకున్నాడా? సుఖంగా ఉన్నాడా? తను మాట ఇవ్వకపోయినా తన తండ్రి ఇచ్చిన మాట కోసం ఆ తండ్రి పోయినా అరణ్యవాసం చేసాడే. కొడుకంటే ఇలానే కదా ఉండాల్సింది. భార్యని అమితంగా ప్రేమించి ఆవిడని రావణాసురుడు ఎత్తుకుపోతే యుధ్ధం చేసి ఆవిడని చెరనించి విడిపించాడు. ఆవిడ అరణ్యవాసానికి వెళ్ళిపోయినా ఇంకొక స్త్రీ వంక కన్నెత్తి చూడలేదు. భర్త అంటే ఇంత ప్రేమానురాగాలతో ఉండాలనే కదా కోరుకునేది. రాజుగా ధర్మపాలన చేసి ఒక చాకలివాడి మాటకి కూడా విలువిచ్చి భార్యని దూరం చేసుకున్నాడు. తన వ్యక్తిగత జీవితాన్ని కోల్పోయాడు, నష్టపోయాడు. కానీ నాయకుడు అన్నవాడు ఎలా ఉండాలో చేసి చూపించాడు. రాజంటే ఇలా కాదూ ఉండాల్సింది? రాజ్యంలో ప్రతి ఒక్కరి మాటకి విలువ ఉందంటే, అదే కదా ప్రజారాజ్యం అంటే, ఇది కాదా డెమోక్రసీ అంటే?

3 comments:

Anonymous said...

ఇక్కడ చదువురాని చాకలి వాడికే కాదు , లక్షమణుడికి రాముడు చేసింది అన్యాయం అనిపించిందని చూపారు. ఎవరికైనా సహజంగా కలిగే ఆక్రోశం / బాధే, అందులోనూ అడవుల్లో సీతరాములతో సన్నిహితంగా వున్న లక్ష్మణుడి బాధ సున్నితంగా వ్యక్తం చేశాడు, సముద్రాల! అది కృతయుగం!

ఇలాంటి తప్పే ధర్మరాజు చేస్తే , సహదేవుడు అన్నమీద కత్తిదూస్తాడట! కృష్ణుడు వారిస్తాడు. అది ద్వాపరయుగం.

ఈ కాలంలో తప్పో ఒప్పో కాదు గాని , ఆస్థులకోసం తోబుట్టువులను, తల్లిదండ్రులను ఏకంగా పొడిచేసే వాళ్ళని చూస్తున్నాము. ఇది కలియుగం! :)

అది ఒక కాలానికి, ఇంకో కాలానికి వున్న తేడా..

బాగా చెప్పావ్ , మోరా.

శంకర్

పద్మ said...

థాంక్స్ శంకూ.

కృతయుగంలో ధర్మం నాలుగు పాదాల మీద నడిస్తే త్రేతాయుగంకి వచ్చేసరికి ఒక కాలు విరిగిందట. అందుకే సీతాదేవిని చెరపట్టటం లాంటివి జరిగాయట. ద్వాపరయుగంకి వచ్చేసరికి ఇంకోకాలు విరిగి రెండు కాళ్ళ మీదే నడిచిందట ధర్మదేవత. అందుకే అన్నదమ్ముల మధ్య గొడవలు, కుట్రలు, కుతంత్రాలు. కలియుగంకి వచ్చేసరికి మూడో కాలు విరిగి ప్రస్తుతం ఒంటికాలి కుంటి నడక నడుస్తోందట. నయం కదూ. నాలుగు యుగాలే. ఇంకో యుగం కూడా ఉండి ఉంటే?

gsmanyam said...

meeku kunti nadaka laagaa anipistondaa padmaa gaaru naaku ayitae ikkada dharmam anedi unnattu kuudaa anipinchadam laedu