Friday, September 28, 2007

మనసా తుళ్ళిపడకే అతిగా ఆశపడకే

మనసా తుళ్ళిపడకే అతిగా ఆశపడకే
అతనికి నీవు నచ్చావొ లేదో
ఆ శుభఘడియా వచ్చేనొ రాదో
తొందరపడితే అలుసే మనసా ..... తెలుసా
మనసా తుళ్ళిపడకే అతిగా ఆశపడకే

ఏమంత అందాలు కలవనీ ..... వస్తాడు నిన్ను వలచి
ఏమంత సిరి ఉంది నీకనీ ..... మురిసేను నిన్ను తలచి
చదువా ..... పదవా ..... ఏముంది నీకు
తళుకు ..... కులుకు ..... లేవమ్మ నీకు
శ్రుతిమించకే నీవు మనసా

మనసా తుళ్ళిపడకే అతిగా ఆశపడకే
అతనికి నీవు నచ్చావొ లేదో
ఆ శుభఘడియా వచ్చేనొ రాదో
తొందరపడితే అలుసే మనసా ..... తెలుసా
మనసా తుళ్ళిపడకే అతిగా ఆశపడకే

ఏ నోము నోచావు నీవనీ ..... దొరికేను ఆ ప్రేమఫలము
ఏ దేవుడిస్తాడు నీకనీ ..... అరుదైన అంత వరము
మనసా వినవే మహ అందగాడు కనుకా జతగా మనకందిరాడు
కలలాపవే కన్నె మనసా

మనసా తుళ్ళిపడకే అతిగా ఆశపడకే
అతనికి నీవు నచ్చావొ లేదో
ఆ శుభఘడియా వచ్చేనొ రాదో
తొందరపడితే అలుసే మనసా ..... తెలుసా
మనసా తుళ్ళిపడకే అతిగా ఆశపడకే

సినిమా : శ్రీవారికి ప్రేమలేఖ
సంగీతం : రమేష్ నాయుడు గారు
సాహిత్యం : వేటూరి సుందరరామముర్తి గారు
గానం : ఎస్.జానకి గారు

నిన్నటి తరం హాస్య సినిమాలలో ఒక ట్రెండ్ సృష్టించిన సినిమా ఇదేనేమో. శ్రీలక్ష్మి సినిమా పిచ్చి, సంగీత వంటల పిచ్చి, సుత్తి వీరభద్రరావు తిట్ల పిచ్చి వెరసి పిచ్చి సినిమా :) కానే కాదు. ఒక మంచి ఎంటర్‌టైనర్. జంధ్యాల సినిమాల్లో పాటలన్నీ బానే ఉంటాయి. ఆయన సినిమాలు చాలా వాటికి సంగీతం అందించింది రమేష్ నాయుడు గారే. రమేష్ నాయుడు గారు బాణీలు కట్టిన పాటలు అన్నీ ఏవిధమైన రణగొణధ్వనులు లేకుండా సున్నితంగా ఉంటాయి. దేవుడు చేసిన మనుషులు, మీనా, ముద్దమందారం, నాలుగు స్తంభాలాట, స్వయంకృషి, శివరంజని ..... లిస్ట్ గోస్ ఆన్. :)

ఈ సినిమాలో వైజాగ్ బ్యాక్‌డ్రాప్ బావుంటుంది. ముఖ్యంగా సముద్రం. ఎంతెంతెంత బావుంటుందో. :) నాకెందుకంత ఇష్టం సముద్రం అంటే చెప్పలేను కానీ బోలెడంత ఇష్టం. గంటలు గంటలు గడిపెయ్యగలను అలా చూస్తూ. చెన్నై మెరీనా, బాంబే జుహు ఇంకా అమెరికా బీచ్‌లు ఎన్ని చూసినా మన తెలుగు బీచ్‌కి సాటి రావు కదా. :p సముద్రం ఒకటే అయినా దానికి ప్రాంతీయత్వం అంటగట్టేస్తున్నాను, ఏం చేస్తాం నిన్నటి అరవ వాసన ఇంకా వదల్లేదు. :))))) మొన్నా మధ్య వెళ్ళిన హంసలదీవి కూడా. కృష్ణా నది సంగమం. ఎంత బావుందో. మాటల్లో చెప్పలేను. ఒక పక్క కృష్ణ, ఒక పక్క సముద్రం ఎంత స్పష్టంగా కనిపించిందో ఆ సంగమం. కృష్ణ ఉరుకులు పరుగులతో వచ్చి సముద్రంలో కలిసింది. అక్కడ ఎంతసేపు కూర్చున్నానో. వేణుగోపాలస్వామి గుడి మూసేస్తారని అమ్మానాన్న హెచ్చరిస్తే బలవంతాన బైల్దేరాను. ఆ గుడి గురించి ఇంకోసారి.

1 comment:

Anonymous said...

మీ వర్ణన చూస్తుంటే అర్జంటుగా హంసనై, హంసలదీవికి ఎగిరిపోవాలని అనిపిస్తోంది :)

శరత్ చంద్ర