Thursday, January 5, 2012

హమ్ కరే రాష్ట్ర ఆరాధన్ ......

శ్రీ విశ్వనాధ్ శుక్లాజీ రచించిన హమ్ కరే రాష్ట్ర ఆరాధన్ పాట నేను మొదటిసారి చాణక్య సీరియల్లో విన్నాను. బాగా నచ్చేసిన పాట. నచ్చిన కారణం పాట కూర్చిన రాగం. కానీ తర్వాత్తర్వాత పాట భావం, అర్థం తెలిసిన తర్వాత మరింత ప్రియం అయింది పాట.

దేశమాతని తన, మన, ధన, ప్రాణాలతో ఆరాధిస్తాము
శ్రధ్ధగా, మనస్పూర్తిగా, నిశ్చలమైన మనస్సుతో తలవంచి అభివాదం చేస్తున్నాము
నవ్వులు చిందే బాల్యంతో, ఉత్సాహం పొంగిపొర్లే యౌవనంతో, అనుభవం అందించిన శక్తితో రాష్ట్ర మాతని అర్చిస్తాము
చరిత్ర పుటలని తిరగేసుకుంటూ, గతం నేర్పించిన పాఠాలని మననం చేసుకొంటూ, మన భవిష్యత్తుగా భావించి మన దేశం గురించి చింతిద్దాము (ఆలోచిద్దాము)
మా తల్లి సేవకి విపత్తులై, అడ్డంకులై నిలచిన ఎన్నో సంఘటనలు మాకింకా గుర్తున్నాయి
దేశాన్ని కబళించ చూసిన శత్రువులని చీల్చి చెండాడి రక్తంతో జననికి అభిషేకం చేశాము
మనమందించిన సంస్కృతి అనే ఉన్నతమైన సింహాసనం మీద కూచుని భరతమాత జగతిని పరిపాలించేది
కాలచక్రం గతి తప్పి సింహాసనం నేడు ముక్కలయింది
మన మనశ్శరీరధనప్రాణాలు అర్పించి సింహాసనం పునఃప్రతిష్టిద్దాము
మన రాష్ట్రాన్ని ఆరాధిద్దాము.

ఒక్క పాటలో దేశం మీద అభిమానము, అర్చన, ఆరాధన, భవిష్యత్తుని గురించిన ఆలోచన, వర్తమానాన్ని తలుచుకుని ఆవేదన, తిరిగి నా దేశాన్ని అత్యున్నతమైన స్థానానికి తీసుకెళ్ళాలనే ఆవేశము ఇన్ని కలగలిసిన గీతం జాతీయ గీతం అవలేకపోయింది కానీ ప్రతి పాఠశాలలో ప్రతిరోజు పిల్లల చేత పాడించి వాళ్ళల్లో ఆవేదన కలిగించి ఆలోచన కల్పించి ఆవేశం రగిలించి అనుభవంతో వెన్నంటి నడిపిస్తే మన దేశానికి పూర్వ వైభవం తీసుకురావటం అసాధ్యం ఎంత మాత్రము కాదు.

1 comment:

Sravya V said...

Nice one పద్మ గారు !