Monday, November 21, 2011

శ్రీకాళహస్తీశ్వర దండకం

జయజయ మహాదేవ శంభో హరా శంకరా సత్యశివసుందరా నిత్య గంగాధరా ......
బ్రహ్మ విష్ణుల్ సురల్ తాపసుల్ నిన్ను వర్ణించలేరన్న నేనెంతవాడన్ ...... దయాసాగరా ......
భీకారారణ్య మధ్యంబునన్ బోయనై పుట్టి పశుపక్షిసంతానముల్ కూల్చి భక్షించు పాపాత్ముడన్ ......
దివ్య జపహోమతపమంత్ర కృషి లేని జ్ఞానాంధుడన్ ......
దేవుడే లేడు లేడంచు దూషించు దుష్టాత్ముడన్ ...... దుష్టాత్ముడన్ ......
విశ్వరూపా ...... మహా మేరుచాపా ...... జగత్‌సృష్టి సంరక్ష సంహార కార్యత్కలాపా ......
మహిన్ పంచభూతాత్మవీవే కదా ...... దేవ దేవా ...... శివా ......
పృధ్వి జలవాయురాకాశ తేజోవిలాసా ...... మహేశా ...... ప్రభో ......

రంగుబంగారు గంగా తరంగాల రాజిల్లు కాశీపురాధీశ విశ్వేశ్వరా ...... కాశీపురాధీశ విశ్వేశ్వరా ......
నీలి మేఘాల కేళీ వినోదాలలో తేలు శ్రీశైల మల్లేశ్వరా ..... శ్రీశైల మల్లేశ్వరా .....
కోటి నదులందు సుస్నానముల్ చేయు ఫలమిచ్చు క్షేత్రాన వసియించు శ్రీరామలింగేశ్వరా ...... శ్రీరామలింగేశ్వరా ......
నిత్య గోదావరీ నృత్య సంగీత నీరాజనాలందు ద్రాక్షారమావాస భీమేశ్వరా ...... భీమేశ్వరా ......
దివ్యఫలపుష్పసందోహ బృందార్చితానంద భూలోక కైలాస శైలాన వసియించు శ్రీకాళహస్తీశ్వరా ...... శ్రీకాళహస్తీశ్వరా ...... దేవ దేవా ......
నమస్తే నమస్తే నమస్తే నమ: ......

చిత్రం : కాళహస్తి మహత్యం
గానం : ఘంటసాల గారు
సంగీతం : సుదర్శనం గారు, గోవర్ధనం గారు
సాహిత్యం : తోలేటి వెంకటరెడ్డి గారు

కార్తీకమాసం సోమవారం సందర్భంగా ......
ఈ పాటని ఘంటసాల గారు పాడినట్టు ఎవరైనా పాడగలరా? అందుకే ఆయనది గంధర్వగానం అంటారేమో. :)



వీడియో : ఇక్కడ

Thursday, September 29, 2011

అందని ద్రాక్ష అప్రజాస్వామ్యమా?

దొరక్క దొరక్క కాస్త టైం దొరికితే అది కాస్తా నిన్న ఒక చెత్త పోస్ట్ చదవటం లో వేస్ట్ చేసుకున్నాను. టూకీగా ఆ పోస్ట్ విషయం ఏంటంటే  భారత దేశం తప్ప ప్రపంచంలో ఎక్కడైనా సరే ఉండేవాళ్ళకి దేశభక్తి ఉండదు. వాళ్ళకి ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే హక్కు లేదు. ఇంకా స్పెసిఫిక్ గా భారతదేశానికి సంబంధించి ఏ విషయము మాట్లాడకూడదు. ఎందుకంటే పరాయి దేశంలో బతుకుతున్నారు కాబట్టి. కానీ ఆ రాసినాయన, ఇంకా ఇటువంటి 'భావజాలం' ఉన్నవాళ్ళు మటుకు పరాయి దేశం నించి ఎటువంటి సిధ్ధాంతాన్నైనా తెచ్చుకుని దాని గురించి పేజీలకి పేజీలు చెత్త రాయచ్చు. పిసరంత అయినా అర్థం ఉందనిపిస్తోందా? నాకనిపించలేదు. అక్కడే కామెంట్ రాద్దామనుకుంటే అదేదో వారి బ్లాగు వారిష్టం అన్నారు. అందుకని ఇక్కడ ఇలా.

వారా పోస్ట్ లో అన్నది, నాకు చిర్రెత్తుకొచ్చింది ఇండియాలో చదువుకుని, ఇండియా డబ్బులతో పెరిగి అమెరికాకి దాస్యం చేస్తూ అమెరికా పౌరసత్వం కోసం తహతహలాడుతూ వగైరా వగైరా ...... ఈ చెత్త చాలా మంది అనగా/రాయగా విన్నాను/చూశాను. ఎప్పుడూ ఒకటే సామెత గుర్తొస్తుంది. "ఆడలేక మద్దెల ఓడినట్టు." భారతంలో పుట్టి అక్కడ చదువుకుంటే ఇంక అక్కడే ఉద్యోగం చేసుకుంటూ ఉండాలా? అలా ఉంటేనే దేశానికి సేవ చేసినట్టా? భారతంలో బతుకుతూ ఈ దేశం నాకేమిచ్చింది అని దేశాన్ని తిట్టిపోసేవాళ్ళు, పరాయి దేశపు సిధ్ధాంతాలు మన దేశకాలమాన పరిస్థితులకి నప్పుతాయా లేదా అని కూడా ఆలోచించకుండా కబుర్లు చెప్పేవాళ్ళు సేవ చేసినట్టా లేక పరాయి దేశంలో ఉండి కూడా దేశానికి ఏదో రకంగా ఉపయోగపడాలని తపన పడేవాళ్ళకున్నట్టా దేశభక్తి? ఇదివరకు మా వాళ్ళ దగ్గర ఒక డ్రైవర్ ఉండేవాడు. వాడు పిల్లల్ని కనటం తప్ప ఇంకే పని లేనట్టు కనేసి ఈ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం నాకేం చేసిందమ్మా, నేనెందుకు ఓటెయ్యాలి. నా పిల్లల్ని పోషిస్తోందా అని అడిగేవాడు. ఇష్టం వచ్చినట్టు కనేసావు, నీ పిల్లల్ని నువ్వే కదా పోషించుకోవాలి అంటే  నన్ను నా పిల్లల్ని ఈ ప్రభుత్వమే పోషించాలి అని వాదించేవాడు. అలా ఉంది వీళ్ళ వాదన కూడా.

భారతంలో చదువుకుంటే అక్కడే ఉద్యోగం చెయ్యాలి. ఇంక వేరే దేశాల్లో ఊడిగాలు చెయ్యకూడదనుకుంటే మరి గాంధి, నెహ్రూ ఇంకా వీళ్ళు పూజించే ప్రముఖుల్ని చాలా మందినే నిలదీయాలి కదా. మరి వాళ్ళందరూ ఇతర దేశాల్లో చదువుకుని భారతానికి తిరిగొచ్చినవారే కదా. మరి వీరి లెక్కన ఆ దేశానికి సేవ చెయ్యాలి కదా అక్కడ చదువుకున్నందుకు? లేదా ప్రాధమిక విద్య భారతంలో చేశారు కాబట్టి వాళ్ళని రెండు ఖండాలుగా నరికి ఒక ఖండం ఒక దేశానికి ఇంకో ఖండం ఇంకో దేశానికి ఋణం తీర్చుకోటానికి పంపించాలంటారా?

దేశానికి సేవ అక్కడ ఉండే చెయ్యక్కరలేదు. నా చుట్టుపక్కలే, ఇక్కడ ఉన్నవాళ్ళని చూస్తే భారతానికి ఏదో రూపం లో సేవ చేస్తూనే ఉన్నారు.  నన్నే తీసుకుంటే, నేను భారతంలో ఆరుగురు ఆడపిల్లలని దత్తత తీసుకుని చదివిస్తున్నాను. వచ్చే ఏడాది ఇంకో ముగ్గురు అమ్మాయిలని దత్తత తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నాను. అక్కడ ఉన్న నా ప్రాపెర్టీస్ కి ప్రతి సంవత్సరం టాక్స్ కడుతున్నాను. అక్కడ కొన్ని శరణాలయాలకి ప్రతి సంవత్సరం డబ్బులు పంపిస్తున్నాను. ఈ సంపాదించిన డబ్బులకి ఇక్కడ టాక్స్ కడుతున్నాను. ఇక్కడ చాలా తరచుగా డొనేట్ చేస్తుంటాను. పెంచిన దేశానికి, ఉంటున్న దేశానికి కొద్దో గొప్పో సేవ చేస్తున్నట్టే అనుకుంటున్నాను. భారతంలో ఉండి కూడా ఇవన్నీ ఖచ్చితంగా చెయ్యచ్చు కానీ ఇక్కడ ఉండటం మూలాన పరిధి చాలా పెరిగింది. ఒక మామూలు ఉద్యోగం చేస్తూ తొమ్మిదిమంది ఆడపిల్లలని దత్తత తీసుకుని చదివించటం భారతంలో సులభమా? ఇది ఒక రకంగా స్త్రీ జనోధ్ధరణ కాదా? లేక తనకన్నా పెద్దదైనా వదిన్ని జాలిపడి పెళ్ళి చేసుకున్న మరిది చేసేది స్త్రీ జనోధ్ధరణ? ఇంతకీ అమెరికన్ భారతీయులని తిట్టిపోస్తూ రాతలు  రాసిన శేఖర్ గారు దేశానికి ఏ రకమైన సేవ చేశారో కాస్త చెప్పగలరా? ఇలాంటి రాతలు రాయటం తక్క? పరాయి దేశం లో ఉన్నంత మాత్రాన కని పెంచిన దేశానికి పరాయి అయిపోరు. ఎక్కడ పుట్టినవారు అక్కడ ఉండే ఋణం తీర్చుకోవాలి అనుకుంటే ఇంక హైదరాబాదులో చదువుకున్నవాళ్ళు అక్కడే ఉద్యోగం చేసుకోవాలి. బెంగుళూరు లేదా మరో ఊరు వెళ్ళకూడదు. అమలాపురం లో చదువుకున్నవాడు అక్కడే ఉండాలి. వెరసి బావిలో కప్పకు మల్లే తయారవ్వాలి. ఈ రాసినాయన లాగా. కాస్త చుట్టూ ప్రపంచాన్ని చూడండి. పరాయి దేశం వెళ్ళినా అక్కడ తమదైన అస్థిత్వాన్ని నిలుపుకుని ఆ దేశానికి, పుట్టిన దేశానికి పేరు తెచ్చిన గొప్పవారిని కాస్త గమనించండి.

మీరనే ఈ పరాయి దేశం అమెరికాలో ఎన్ని భారతీయులు స్థాపించిన సంస్థలున్నాయో తెల్సా? అవన్నీ భారతీయులకి/భారతదేశానికి ఎంతెంత మద్దతు ఇస్తుంటాయో తెల్సా? ఎన్ని సేవా సంస్థలున్నాయో తెల్సా? ఇక్కడ మా హిందూ స్వయం సేవక సంఘాలు ఎన్నెన్ని ఉన్నాయో అవి ఏ రకంగా మన దేశ గౌరవాన్ని నిలుపుతూ ఇక్కడి వాళ్లకి మన గొప్పదనం చెప్తూ ఎన్ని రకాలుగా సేవలు చేస్తున్నాయో తెల్సా? బీచెస్ క్లీన్ చెయ్యటంలో కానీ,
ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు కానీ వాళ్లకి తోచినట్టుగా సేవ చేస్తారు. కానీ అస్థిత్వాన్ని కోల్పోరు.

 నిజమే ఇక్కడ గ్రీన్ కార్డ్ కోసం పౌరసత్వం కోసం తహతహలాడతారు. కొన్ని అదనపు సౌకర్యాలు సులభంగా దొరుకుతున్న చోట మనిషి ఆశ పడకుండా ఉంటాడా? అంత మాత్రాన దేశభక్తి లేనట్టా? భారతంలో మటుకు ఉన్న ఊళ్ళో కాక వేరే పెద్ద ఊళ్ళో జీతం, ఇంకొన్ని సౌకర్యాలు  ఎక్కువ ఇస్తారంటే వెళ్ళకుండానే ఉంటారా?

ఉన్న ఊరొదిలి ఏ దేశానికైనా, ఏ ప్రాంతానికైనా వెళ్ళేది పొట్టకూటి కోసం, కొత్త విషయాలు నేర్చుకోవాలన్న ఆసక్తి మీద, ఏదో సాధించాలన్న తపన తీర్చుకోవటం కోసం.

అందని ద్రాక్ష పుల్లన. కరక్టే. కానీ అంత మాత్రాన భూమిలోంచి పుట్టిన తీగకి కాసిన పళ్ళు ఆ భూమికే అందనంత ఎత్తులో ఉన్నాయి అని తిట్టిపోయటం మూర్ఖత్వం. అంత ఎత్తున ఉన్నా ఆ పళ్ళు కిందకి భూమి వైపే వేళ్ళాడుతూ ఉంటాయి. వాటి వేళ్ళు అక్కడే ఉన్నాయని తెలుసు కాబట్టి, చాలామంది ఎన్.ఆర్.ఐల లాగా.

Friday, August 19, 2011

అందాల రాముడు ...... ఎందువలన దేవుడు?

ఇదిగో ఇందుకే ...... :)

అందాల రాముడు ఇందీవర శ్యాముడు ఇనకులాబ్ధిశోముడు ఎందువలన దేవుడు ......
అందాల రాముడు ఇందీవర శ్యాముడు ఇనకులాబ్ధిశోముడు ఎందువలన దేవుడు ...... ఎందువలన దేవుడు

తండ్రి మాటకై పదవుల త్యాగమే చేసెను ......
తండ్రి మాటకై పదవుల త్యాగమే చేసెను
తన తమ్ముని బాగుకై తాను బాధ పొందెను
అందాల రాముడు అందువలన దేవుడు

అందాల రాముడు ఇందీవర శ్యాముడు ఇనకులాబ్ధిశోముడు ఎందువలన దేవుడు ......

అంభవించదగిన వయసు అడవి పాలు చేసెను ......
అంభవించదగిన వయసు అడవి పాలు చేసెను
అడుగు పెట్టినంత మేర ఆర్యభూమి చేసెను
అందాల రాముడు అందువలన దేవుడు.

అందాల రాముడు ఇందీవర శ్యాముడు ఇనకులాబ్ధిశోముడు ఎందువలన దేవుడు ......

ధర్మపత్ని చెర బాపగ దనుజుని దునుమాడెను ......
ధర్మపత్ని చెర బాపగ దనుజుని దునుమాడెను
ధర్మం కాపాడుటకా సతినే విడనాడెను
అందాల రాముడు అందువలన దేవుడు.

అందాల రాముడు ఇందీవర శ్యాముడు ఇనకులాబ్ధిశోముడు ఇలలో మన దేవుడు ......

సినిమా : ఉయ్యాల జంపాల
సంగీతం : పెండ్యాల నాగేశ్వర రావు గారు
సాహిత్యం : ఆరుద్ర
గానం : స్వర్ణలత

వీడియో : ఇక్కడ
ఆడియో : ఇక్కడ

"నన్నెందుకు వదిలేశావని ఆనాడే సీత రాముడిని అడిగుంటే" అని మైకుల ముందర అరిచే వాళ్ళందరు ఈ పాట వింటే బావుణ్ణు. బుధ్ధి వచ్చినా రాకపోయినా కాస్త పాపం అన్నా తగ్గుతుంది.

Monday, August 8, 2011

ఈ నెల వనితామాలికలో ......

ఈ నెల వనితామాలికలో ......

వర్షాకాలంలో అందం, ఆరోగ్యం
భర్తలు భార్యలని ఇలానే ఊహిస్తుంటారా?
మహా మేధావి జిడ్డు కృష్ణమూర్తి గారి గురించి తెలుసుకుందామా?
పిల్లలు ఏడుస్తుంటే ఏం చెయ్యాలి
రోం లో రోమన్ లా ఉండాలా?
పుష్కర ప్రాభవం - గంగ

తూర్పున వేడి వేడి గా కారం కారం గా, పశ్చిమంలో చల్ల చల్లగా తియ్య తియ్యగా, వనితామాలిక మీకోసం.

చదవండి ...... చదివించండి ...... వనితామాలిక.

Monday, November 29, 2010

నాన్న

అందరూ ఆడపిల్లలు బరువనుకునే రోజుల్లో ఆడపిల్ల కావాలి అని ఆరాటపడ్డ నాన్న .....
ఏ కాలమైనా ఆడపిల్లకి చదువు చాలా అవసరం అని నా ఉన్నత విద్య కోసం నా కన్నా ఎక్కువ శ్రమించిన నాన్న .....
ఆడపిల్లకి చదువెందుకు పెళ్ళి చేసి బరువు దించుకోక అన్న మాటల్ని ఖాతరు చెయ్యకుండా మగపిల్లలతో సమానంగా చదివించిన నాన్న .....
జీవితంలో ఒక్కో మెట్టు ఎక్కుతున్న నన్ను చూసి మురిసిపోయిన నాన్న .....

మా నాన్న ఇక లేరంటే మనసు నమ్మటం లేదు. ఏదో ఒక పక్క నించి అమ్మలూ అని పిలుస్తూ వస్తారనే నమ్ముతోంది.
కాలం స్థంభించింది అనిపిస్తుంటే ఎందుకు రోజులు ఆగకుండా గడిచిపోతున్నాయి? ఎందుకు కళ్ళల్లో నీళ్ళు ఇంకడం లేదు?
అందరూ ఇది పెద్ద నష్టం అంటున్నారు కానీ నష్టం అనే చిన్న పదం జీవితంలో ఏర్పడిన ఈ వెలితిని వివరించగలదా? ఊహూ, తెలుగు భాషలో ఈ బాధని వివరించగల పదం లేదు. ఏ భాషలోనూ ఏ పదానికి అంత శక్తి లేదు.

జీవితాన్నిచ్చిన నాన్న ఇంక జ్ఞాపకాల్లోనే ......

Friday, October 29, 2010

నువ్వు - నేను

చంద్రుడివి నువ్వు ...... చకోరాన్ని నేను
భ్రమరానివి నువ్వు ...... మధువును నింపుకున్న కుసుమాన్ని నేను
ఉదయించే సూర్యుడివి నీవైతే ...... విచ్చుకునే పద్మాన్ని నేనౌతా
పురుషుడివి నువ్వు ...... ప్రకృతిని నేను
నీ ప్రతి రూపానికి నా ప్రతిరూపం ఇదిగో ఇక్కడే.

Monday, October 25, 2010

ఎదురుచూపు

ప్రకృతి చల్లని వెన్నెలనిచ్చే రేరాజు కోసం ఎదురు చూస్తోంది .....
నా ఎదురు చూపులు నాకోసమే వెన్నెల తెచ్చే నీ కోసం .....
ఇంకాసేపట్లో ఆరుబయలంతా పుచ్చపువ్వులాంటి పున్నమి వెన్నెల పరచుకుంటుంది
నా మనసుకి ఇంకా అమాసే
సెలయేటిలో చిరునవ్వుతో విచ్చుకున్న కలువపువ్వు
చిరుగాలి చలికి ముడుచుకుని ఉన్న నేను
పండు వెన్నెల్లో హేమంత తుషారాలలో తడుస్తూ .....
ఒడిలో అలసి సొలసిన సఖుడి కోసం మోహనాన్ని మధిస్తూ .....
మనసుని మధువుతో నింపుతూ, నింపుకుంటూ .....
జీవనరాగం ఆలపించేదెన్నడో, ఎప్పుడో?

Wednesday, June 30, 2010

5వ కాలిఫోర్నియా సాహితీ సదస్సు

5వ కాలిఫోర్నియా సాహితీ సదస్సు అని బ్రహ్మానందం గారి బ్లాగ్'లో చూడగానే వెళ్ళాలన్న సంకల్పం కలిగింది. బ్రహ్మానందం గారు కూడా వెంటనే వివరాలు అవి పంపి రమ్మని ఆహ్వానించారు. అలా మా ఊరి నించి 390 మైళ్ళ దూరంలో జరిగిన సాహితీ సదస్సులో ఎటెండెన్స్ వేయించుకుని వచ్చాను.

జూన్ ౧౮,శుక్రవారం డ్రైవ్ చేసి రాత్రికి మిల్పిటస్ చేరుకుని రాత్రికి చక్కగా రెస్ట్ తీసుకుని పొద్దున ఠంచనుగా పదింటికల్లా సదస్సు జరిగే కమ్యూనిటీ సెంటర్లో ఉండాలన్న బృహత్తర ప్రణాళిక కొన్ని అనివార్య కారణాల వల్ల రూపాంతరం జెంది శుక్రవారం డ్రైవ్ కాస్తా శనివారం పొద్దున విమానం అయింది. ఆ విమానం కూడా నా తొందరకి తగ్గట్టే ఆలస్యం చేసి తీరిగ్గా శాంఫ్రాన్సిస్కో ఏర్ పోర్ట్'లో దించింది. అక్కడి నించి మిల్పిటస్ వెళ్ళి రిఫ్రెష్ అయి సదస్సు జరిగే ప్రాంతానికి వెళ్ళేసరికి భోజనాలకి స్వాగతం పలికే వేళ అయింది. లోలికి అడుగు పెట్టగానే తాటిపామల మృత్యుంజయుడు గారు రండి రండి అని ఆహ్వానించారు. భోజనాలు అయిన వెంటనే జె. గోపాలకృష్ణ గారు మతసాహిత్యాలు - ఆంతర్యాల గురించి ప్రసంగించారు. లంచ్ తర్వాత మతసాహిత్యం లాంటి భారీ విషయం మీద ఉపన్యాసం అనేసరికి చాలా కుతూహలం కలిగింది. కానీ, గోపాలకృష్ణ గారు వివాదాస్పద విషయాల జోలికి వెళ్ళకుండా మనలో చాలామందికి భగవంతుడి మీద ఉండే చిన్న చిన్న (అతి) నమ్మకాల గురించి మాట్లాడారు. మనం చేసే పాపాలన్నీ చేసి దేవుడికో కొబ్బరికాయ కొట్టేస్తే పాపాలన్నీ పటాపంచలవుతాయి అనుకుంటాం. కానీ పాపం దారి పాపానిదే, పుణ్యం దారి పుణ్యానిదే. దేవుడు తండ్రిలాంటి వాడు కాబట్టే బిడ్డ తప్పు దారిలో వెళుతుంటే శిక్షించైనా సరైన దారిలో పెట్టే తండ్రిలానే పాపాలు చేసినప్పుడు, పొగిడారు కదా, కానుకలిచ్చారు కదా అని పొంగిపోకుండా ఆ పాపాలకి శిక్షించే తీరతాడు అని బాగా చెప్పారు.

తర్వాత కె.వరలక్ష్మి గారు తమ కథా పరిణామం గురించి వివరించారు. ఆవిడ తన అనుభవాన్ని కథగా రాసి అందులో తను తన పక్షాన నిలబడి తన వాదన మటుకే వినిపించటం రచయిత్రిగా తప్పని గ్రహించి ఆ తరువాత తమ కథా రచనలలో ఆ తప్పు జరగకుండా జాగ్రత్త పడిన తీరు వివరించారు. వరలక్ష్మి గారివి రంగనాయకమ్మ గారి లాంటి ' స్త్రీవాద ' రచనలన్నారు ఎవరో. కానీ వారి మాటతీరు అదీ సో కాల్డ్ ఫెమినిస్ట్ అనిపించలేదు. వారి పుస్తకాలు కొన్ని తీసుకున్నాను. చదవాలి.

వరలక్ష్మి గారి తర్వాత జెజ్జాల కృష్ణమోహన్ గారు పద్యం లయాత్మకం ఛందస్ అంటూ ఛందస్సు తీరు తెన్ను వివరించారు. చిన్నప్పుడెప్పుడో స్కూల్లో నేర్చుకుని కాలేజ్'లో చేరగానే మర్చిపోయిన గురువు లఘువులని గుర్తు చేసారు. వీరు తయారు చేసిన టెంప్లేట్ ఉపయోగించి ఎవరైనా పద్యాలని రాయచ్చు అన్నారు. వచ్చే లాంగ్ వీకెండ్ చేసే పనుల్లో పద్యం రాయటం ఒకటి ఉత్పలమాలలో. :)

నాకు గౌరీకృపానందన్ గారి ప్రసంగం కూడా బాగా నచ్చింది. చాలా సింపుల్ గా ఉన్నారు. యండమూరి నవలలు చాలా మటుకు, యద్దనపూడి నవలలు కొన్ని ఓల్గావి ఇంకా కొన్ని నవలలు అనువాదం చేశారట. కత్తికి రెండువైపులా పదును ఉన్నట్లు తమిళం నించి తెలుగుకి కూడా అనువాదం చేశారట. మరి వీరు అనువాదం చేసినవో కాదో నాకు తెలీదు కానీ కొన్ని అనురాధారమణన్, శివశంకరిగార్ల రచనలు చదివాను. నా అభిమాన తమిళ రచనలవి. అనురాధా రమణన్ మరణం సాహిత్యలోకానికి తీరని లోటు.

వేమూరి వెంకటేశ్వరరావు గారు తెలుగు భాషకి వచ్చిన ఇక్కట్ల గురించి చాలా హాస్యంగా వివరించారు. బర్కీలి యూనివర్సిటీలో తెలుగుని బోధిస్తూ అమెరికాలో తెలుగు వ్యాప్తి చెందటానికి కృషి చేస్తున్న వెంకటేశ్వరరావు గారి బాధ అర్థం చేసుకోతగ్గది. కొంతమంది, కాదు చాలా మంది భాష వింటుంటే వారు మాట్లాడేది తెలుగేనా అని సందేహం వస్తుంది. పోనీ ఇంగ్లిష్ అన్నా సరిగ్గా మాట్లాడతారా అంటే అదీ లేదు. రెంటికి చెడ్డ రేవడుకి ప్రతిరూపాలు. తెలుగులోనే మాట్లాడాలి అంటూ తెలుగులో మంటనక్కలని, అంతర్జాలాలని సృష్టించే పెద్దలు అటు వైపు దృష్టి పెట్టి వారికి సహాయం చేసి తెలుగు వ్యాప్తికి దోహదపడితే బావుంటుందేమో.

తర్వాత స్వీయ కవితా పఠనం. ఇందులో నాకు అన్నీ బానే ఉన్నాయి కానీ కొన్ని ఇంకొంచెం ఎక్కువ నచ్చాయి.

గీత గారి కవిత వారి పాపాయి గురించి. అందులో ఒక లైన్ నాకు చాలా నచ్చింది.
" నెలకో బాధ నిలబడనీకుండా చేసినా
ఎటు ఒత్తిగిల్లీ నిద్రపోలేకున్నా
బైటి లోకపు ద్వారపాలకురాలినై
రాత్రింబగళ్లు నీ కోసమే పహారా కాస్తున్నా "

కాకపోతే చిరు చిన్న పాపాయి అన్న పద ప్రయోగం నాకు అర్థం కాలేదు. చిరు, చిన్న రెంటికీ ఒకటే అర్థం ఉన్నప్పుడు, రెంటినీ ఉపయోగించాల్సిన అవసరం నాకు తెలీలేదు. గీత గారి పుస్తకం కూడా తీసుకున్నాను. అది కూడా చదవాలి.

కృష్ణ అక్కులు గారి గాలి సోదరుల కవిత బావుంది. ఉక్కు కవచాలున్నా సరే వీరితో పెట్టుకున్న వారు గాల్లో కొట్టుకుపోతారు అని వీరి భావన. :)

నేమాన గోపాల్ గారు, మధు ప్రఖ్య, శారద, ఉపాధ్యాయుల కృష్ణమూర్తి గారు, తల్లాప్రగడ రావు గారు, సరస్వతి దర్భ గారు, వరప్రసాద్ గారి స్వీయ కవితా పఠనంతో సదస్సు ముగిసింది.

పొద్దున జరిగిన కార్యక్రమాలు నేను మిస్ అవటం వలన కొన్ని మంచి ప్రసంగాలు వినలేకపోయాను; అపర్ణ గునుపూడి గారి ' స్త్రీ నాడు నేడు ', ప్రఖ్య మధుబాబు గారి ' సాహిత్యంలో ప్రకృతి - ఋతంభర ', మృత్యుంజయుడు గారి ' రావిశాస్త్రి కథల్లో వర్ణనలు ', వంశీ ప్రఖ్య గారి ' తెలుగు సంస్కృతముల సంబంధము - కొత్త కోణం ', కె.వి.ఎస్.రామారావు గారి ' ధ్వనులు, శ్లేషలు ', బోయ జంగయ్య గారి ప్రసంగం.

మొత్తానికి నాకు చాలా నచ్చింది. ఎప్పుడు వర్క్, వర్క్'లో రక్తదానం (ఎగైన్ రక్తపాతం కాదని మనవి) వగైరాలతో టైం తెలీకుండా గడిచిపోయే నాకు ఈ సాహితీ సదస్సు నిజంగా ఒక ఆటవిడుపు. మధ్య మధ్యలో క్విజ్ రూపేణా అడిగిన ప్రశ్నలు, వాటి సమాధానాల ద్వారా కొన్ని తెలియని విషయాలని తెలుసుకున్నాను. :)

కొత్త పరిచయాలు, కొత్త దృక్పధాలు మంచైనా, చెడైనా, ఒప్పుకున్నా, విభేదించినా మనిషికి ఉత్తేజాన్ని ఇస్తాయి, కొత్త ఆలోచనలు కలిగిస్తాయి. ఆ కొత్త ఆలోచనలు జీవనగమ్యాన్ని, గమనాన్ని మార్చేయగలవు. సంగీత, సాహిత్యాలకి సంబంధించిన ఏ సమావేశానికైనా ఇక నించి క్రమం తప్పక వెళ్ళాలన్నదే నా కొత్త ఆలోచన. :)

Thursday, June 10, 2010

భారతీయత - నా అభిప్రాయం

Well, adding to Karthik's points అని కత్తి గారి సైట్లో కామెంట్ మొదలెట్టాను. చూస్తే ఒక పోస్ట్ సైజ్ కి పెరగటంతో అక్కడ కామెంట్ పెట్టటం కన్నా ఇక్కడ పోస్ట్ వెయ్యటం బావుంటుందనిపించి, ఇదిగో ఇలా.

భారతీయత - నా అభిప్రాయం

ఇక్కడ అనగా అమెరికాలో, in fact in all the countries I lived or visited so far except for India, high school అవగానే పిల్లలు బైటికి వెళ్ళిపోతారు. అప్పటి నించి వాళ్ళ కష్టాలు వాళ్ళే పడతారు. అందుకే ఇక్కడి విద్యాధికుల సంఖ్య కూడా తక్కువ ఎందుకంటే ఆ వయసుకి సరైన నిర్ణయాలు తీసుకునే వయసు, అనుభవం వాళ్ళకి ఉండవు. ప్రభుత్వపు ఫ్రీ చదువు ఉండదు. 17 యేళ్ళ తర్వాత తల్లితండ్రుల దగ్గర ఉండటం అవమానంగా భావిస్తారు ఇక్కడి పిల్లలు. ఇక్కడ స్థిరపడ్డ మాకు తెలిసిన భారతీయ కుటుంబంలో ఆడపిల్ల తనని అలా వెళ్ళనివ్వలేదని ఈ మధ్యే రెండు సార్లు ఆత్మహత్యాయత్నం చేసింది కూడా. కానీ భారత దేశంలో పిల్లలు చదువుకుని స్థిరపడేవరకు తల్లితండ్రులు వారితోనే ఉంటారు. వారి మంచీ, చెడ్డా చూస్తారు. మరి ఈ కొత్త జనరేషన్ తల్లితండ్రులు ఠాఠ్, నాకీ భారతీయ విలువలు అనవసరం, నువ్వు నీ ఏడుపేదో ఏడు, మాతో ఉండొద్దంతే అని పిల్లల్ని తన్ని తగలేస్తే తప్ప. :)

ఇక కుటుంబ వ్యవస్థ విషయానికి వస్తే వీళ్ళకి కుటుంబ విలువలు తెలీవు అన్నది ఎంత అబధ్ధమో వీళ్ళు వ్యవస్థని భారతీయుల్లా గట్టి పునాది వేసుకుని నిలబెట్టుకుంటారనటం కూడా అబధ్ధం. వీళ్ళు కుటుంబానికి విలువ ఇస్తారు, తల్లితండ్రులని, అక్కచెళ్ళెళ్ళని ప్రేమిస్తారు. కానీ ఎవరైనా, ఏదైనా వారికి వారి తర్వాతే. భార్యైనా, భర్తైనా, పిల్లలైనా ఎవరైనా "తమ" తర్వాతే. భారత దేశంలో పిల్లలు పుట్టిన తరువాత విడాకులు తీసుకునేవారి సంఖ్య ఎంతుండొచ్చు? పిల్లలు పెరిగి పెద్దవారైన తరువాత విడాకులు తీసుకునేవారి సంఖ్య ఎంతుండొచ్చు? ఒకసారి పెళ్ళి అయ్యాక భార్య, భర్త ఇద్దరూ సద్దుకుపోతూ సంసారాన్ని ముందుకు లాగాలనే చూస్తారు కానీ విడిపోయి ఏదో సాధిద్దాం అనుకోరు. కనీసం అది భారతీయ తత్వం కాదు. కానీ ఇక్కడ? ఉదాహరణకి అమెరికా అధ్యక్ష పదవికి పోటీ చేసిన Al Gore, ఆయన భార్య 40 ఏళ్ళ వైవాహిక జీవితం అనంతరం విడాకులు తీసుకున్నారు. ఇంక ఆయన పిల్లలు ఇద్దరూ అదే దారిలో నడిచారంటే వింతేమీ కాదు కదా. భారతదేశంలో నలభైయేళ్ళ వైవాహిక జీవితం తర్వాత విడాకులు తీసుకోవటం అన్నది ఊహలోకి కూడా రాదు ఎవరికీ. అది మంచేనా లేక చెడా, ఇష్టం ఉన్నా లేకపోయినా జీవితాంతం సద్దుకుపోవాలా అన్న విషయం ఇక్కడ అప్రస్తుతం. కానీ కుటుంబ వ్యవస్థ పటిష్టంగా ఉంటేనే దేశం కూడా పటిష్టంగా మనగలుగుతుంది. పిల్లలు ఎలా పెరుగుతారు, వాళ్ళ జీవితాన్ని ఎలా తీర్చిదిద్దుకుంటారు అనేది తల్లితండ్రుల మీద చాలా ఆధారపడి ఉంటుంది. పిల్లలకి సాధారణంగా తల్లితండ్రులే రోల్ మోడల్స్ అవుతారు దేశంలోనైనా. వారు చిన్నప్పటినించి చూసిన ప్రవర్తనే వారికి ఆచరణీయం అనిపిస్తుంది సాధారణంగా. అది తల్లితండ్రులని కావిట్లో మోసి పుణ్యక్షేత్రాలు చూపించిన శ్రవణుడికైనా, మీనాన్నకి నువ్వు తీసిన గొయ్యి రేపు నీకు తియ్యాలి కదయ్యా అనే పిల్లవాడికైనా. అందుకే భారతదేశంలో కుటుంబవ్యవస్థకి అంత విలువ, అందుకే అది అంత పటిష్టమైన పునాది మీద నిలబడగలిగింది.

ఇక "వీళ్ళు ఎగేసుకెళ్ళేదీ అక్కడికే. అక్కడికి వెళ్ళి డాలర్లు సంపాదిస్తేగానీ భారతీయత వీళ్ళకు బూతద్దంలో పెట్టినట్లుకనిపించదు." విషయానికి వస్తే, మొట్టమొదట చిన్న కరెక్షన్. భూతద్దం అనుకుంటాను బూతద్దం కాదేమో. :( అర్థం దరిద్రంగా మారింది బూతద్దం అనేసరికి.

ఎవరైనా ఎక్కడికైనా వెళ్ళేది బ్రతుకుతెరువు కోసమే కదా. వెళ్ళింది అమెరికా అయినా, అమలాపురం అయినా, బెంగుళూరు అయినా చదువు కోసమో, బ్రతుకుతెరువు కోసమో తప్ప భారతీయత తెలుసుకోవటం కాదు కదా. లెక్కన, తెలుగువాళ్ళు కన్నడదేశానికి వెళ్తేనే వాళ్ళకి తెలుగుతనం, మహారాష్ట్రీయులకి పక్కన ఉన్న గుజరాత్ వెళ్తేనే శివాజి గుర్తొస్తాడు అన్నట్టుంది. :) అయినా ఇందులోనూ తప్పు లేదేమో. భారతదేశంలో ఉండి కూడా భారతీయ విలువలు తెలియకుండా ఉండటం కన్నా పరాయి దేశంలో ఉండి తెలుసుకుని ఆరాధించటం తప్పు కాదేమో.

"They have an institutional mechanism to take care of old."

I don''t think Karthik meant machine in his comment. Anyways, could you please explain what that mechanism is? కిందపడి లేవలేకపోతే మెళ్ళో ఉన్న విజిల్ ఊదితే ఎక్కడో ఉన్న కాప్స్ కి పిలుపంది వాళ్ళు వచ్చి రక్షించటం అంటారా? లేక నడవటానికి చేతకాక రకరకాల బటన్స్ ఉన్న చక్రాల బండి "కొనుక్కుని" రోజులు భారంగా గడపటం అంటారా? Do you even have an idea about how hard senior citizens here have to work to earn even at the age of 70 and above to meet their basic minimum needs? their insurance premiums?

ఇక ఆప్యాయత విషయానికి వస్తే మీరన్నది కరక్టే, ఆప్యాయతలు చాలా ఎక్కువ. సంవత్సరానికి ఒకసారి మదర్స్ డే, ఫాదర్స్ డే అంటూ పూలు, కేక్స్ పంపించి వాళ్ళ ఆప్యాయతని చాటుకుంటారు. :)

మిడిల్ క్లాస్ అని అంత తేలిగ్గా అనేసారు మరి మీరు హై క్లాస్ వారా మిడిల్ క్లాస్ అంటే చిన్నచూపుకి? లేక లో క్లాస్ వారా మిడిల్ క్లాస్ అంటే కుళ్ళుకోవటానికి? :)

నిజమే, మనం భారతీయ విలువలతో అమెరికాని లేక ఇతర దేశాల్ని కొలవకూడదు. మరి ఇతర దేశాలకి సంబంధించిన వేటితోనైనా భారతదేశాన్ని ఎందుకు కొలవటం? అది తప్పు కాదా? ఎందుకు భారతదేశం అంటే ఇంత చులకన? అదీ దేశంలోనే ఉంటూ? కొంచెం ఎక్కువ ప్రజాస్వామ్యం ఉంటే ఇదేనేమో జరిగేది. ఎక్కడైనా, వ్యవస్థలోనైనా, దేశంలోనైనా అన్నీ అద్భుతమైనవే ఉండవు. అలా ఉంటే అది రామరాజ్యమే అవుతుంది. మంచిని తీసుకోకుండా ద్వేషాన్ని వెల్లగక్కడం వల్ల ఉపయోగం ఏముంది? మనిషి మీద ద్వేషం ఉంటే మనిషి మీద వెదజల్లండి. అది మీకు మీకు పరిమితం అవుతుంది కానీ ఒక దేశాన్ని, దేశపు విలువల్ని విమర్శించి ప్రపంచంలో తీవ్రవాదం కన్నా ప్రమాదమైనది స్వేచ్చగా మాట్లాడి, మనగలిగే ప్రజాస్వామ్యం అనిపించేలా చెయ్యకండి.
"