Showing posts with label హేమంతాలు : నేను - నా ఆలోచనలు. Show all posts
Showing posts with label హేమంతాలు : నేను - నా ఆలోచనలు. Show all posts

Saturday, March 31, 2012

మనసెరిగినవాడు మా దేవుడు ...... శ్రీరాముడు ......

శ్రీరామనవమి శుభాకాంక్షలతో ......

మనసెరిగినవాడు మా దేవుడు ...... శ్రీరాముడు ......
మధుర మధుర తర శుభనాముడు ...... గుణధాముడు ......
మనసెరిగినవాడు మా దేవుడు ...... శ్రీరాముడు ......

ఎరిగినవారికి ఎదలో ఉన్నాడు ...... ఎరుగనివారికి ఎదుటే ఉన్నాడు
మానవుడై పుట్టి మాధవుడైనాడు .....
తలచినవారికి తారకనాముడు ...... పిలిచిన పలికే చెలికాడు సైదోడు ......
కొలువై ఉన్నాడూ కోదండరాముడు ...... మనతోడుగా నీడగా రఘురాముడు

మనసెరిగినవాడు మా దేవుడు ...... శ్రీరాముడు ......

కరకుబోయను ఆది కవిని చేసిన పేరు ...... గరళకంఠుని నోట తరలి వచ్చిన పేరు
ఇహపరసాధనకు ఇహమైన పేరు ......
శబరి ఎంగిలి గంగ తానమాడిన పేరు ...... హనుమ ఎదలో భక్తి ఇనుండించిన పేరు
రామ ...... రామ ...... అంటే కామితమే తీరు ...... కలకాలమూ మము కాపాడు పేరు

మనసెరిగినవాడు మా దేవుడు ...... శ్రీరాముడు ......
మధుర మధుర తర శుభనాముడు ...... గుణధాముడు ......
మనసెరిగినవాడు మా దేవుడు ...... శ్రీరాముడు ......

చిత్రం : పంతులమ్మ
సాహిత్యం : వేటూరి గారు
సంగీతం : రాజన్-నాగేంద్ర గార్లు
గానం : పి. సుశీల గారు

ఆడియో

Thursday, January 5, 2012

హమ్ కరే రాష్ట్ర ఆరాధన్ ......

శ్రీ విశ్వనాధ్ శుక్లాజీ రచించిన హమ్ కరే రాష్ట్ర ఆరాధన్ పాట నేను మొదటిసారి చాణక్య సీరియల్‌లో విన్నాను. బాగా నచ్చేసిన పాట. నచ్చిన కారణం ఆ పాట కూర్చిన రాగం. కానీ తర్వాత్తర్వాత ఆ పాట భావం, అర్థం తెలిసిన తర్వాత మరింత ప్రియం అయింది ఆ పాట.

దేశమాతని తన, మన, ధన, ప్రాణాలతో ఆరాధిస్తాము
శ్రధ్ధగా, మనస్పూర్తిగా, నిశ్చలమైన మనస్సుతో తలవంచి అభివాదం చేస్తున్నాము
నవ్వులు చిందే బాల్యంతో, ఉత్సాహం పొంగిపొర్లే యౌవనంతో, అనుభవం అందించిన శక్తితో రాష్ట్ర మాతని అర్చిస్తాము
చరిత్ర పుటలని తిరగేసుకుంటూ, గతం నేర్పించిన పాఠాలని మననం చేసుకొంటూ, మన భవిష్యత్తుగా భావించి మన దేశం గురించి చింతిద్దాము (ఆలోచిద్దాము)
మా తల్లి సేవకి విపత్తులై, అడ్డంకులై నిలచిన ఎన్నో సంఘటనలు మాకింకా గుర్తున్నాయి
దేశాన్ని కబళించ చూసిన శత్రువులని చీల్చి చెండాడి ఆ రక్తంతో జననికి అభిషేకం చేశాము
మనమందించిన సంస్కృతి అనే ఉన్నతమైన సింహాసనం మీద కూచుని భరతమాత జగతిని పరిపాలించేది
కాలచక్రం గతి తప్పి ఆ సింహాసనం నేడు ముక్కలయింది
మన మనశ్శరీరధనప్రాణాలు అర్పించి ఆ సింహాసనం పునఃప్రతిష్టిద్దాము
మన రాష్ట్రాన్ని ఆరాధిద్దాము.

ఒక్క పాటలో దేశం మీద అభిమానము, అర్చన, ఆరాధన, భవిష్యత్తుని గురించిన ఆలోచన, వర్తమానాన్ని తలుచుకుని ఆవేదన, తిరిగి నా దేశాన్ని అత్యున్నతమైన స్థానానికి తీసుకెళ్ళాలనే ఆవేశము ఇన్ని కలగలిసిన ఈ గీతం జాతీయ గీతం అవలేకపోయింది కానీ ప్రతి పాఠశాలలో ప్రతిరోజు పిల్లల చేత పాడించి వాళ్ళల్లో ఆవేదన కలిగించి ఆలోచన కల్పించి ఆవేశం రగిలించి అనుభవంతో వెన్నంటి నడిపిస్తే మన దేశానికి పూర్వ వైభవం తీసుకురావటం అసాధ్యం ఎంత మాత్రము కాదు.

हम करें राष्ट्र आराधन - హమ్ కరే రాష్ట్ర ఆరాధన్

हम करें राष्ट्र आराधन ...... आराधन
हम करें राष्ट्र आराधन ...... आराधन
तन से, मन से, धन से ...... तन मन धन जीवन से ......
हम करें राष्ट्र आराधन ...... आराधन

अंतर से, मुख से, कृति से ...... निश्चल हो निर्मल मति से
श्रद्धा से मस्तक नत से ...... हम करें राष्ट्र अभिवादन ...... अभिवादन

हम करें राष्ट्र आराधन ...... हम करें राष्ट्र आराधन ......
हम करें राष्ट्र आराधन ...... हम करें राष्ट्र आराधन ......
तन से, मन से, धन से ...... तन मन धन जीवन से ......
हम करें राष्ट्र आराधन ...... हम करें राष्ट्र आराधन ...... हम करें राष्ट्र आराधन ...... आराधन ...... करें राष्ट्र आराधन

अपने हँसते शैशव से ...... अपने खिलते यौवन से
अपने हँसते शैशव से ...... अपने खिलते यौवन से
प्रौढ़ता पूर्ण जीवन से ...... हम करें राष्ट्र का अर्चन
हम करें राष्ट्र का अर्चन
हम करें राष्ट्र आराधन ...... हम करें राष्ट्र आराधन ...... हम करें राष्ट्र आराधन ...... आराधन ...... करें राष्ट्र आराधन

अपने अतीत को पढ़कर ...... अपना इतिहास उलट कर
अपने अतीत को पढ़कर ...... अपना इतिहास उलट कर
अपना भवितव्य समझ कर ...... हम करें राष्ट्र का चिंतन
हम करें राष्ट्र का चिंतन
हम करें राष्ट्र आराधन ...... हम करें राष्ट्र आराधन ...... हम करें राष्ट्र आराधन ...... आराधन ...... करें राष्ट्र आराधन

है याद हमें युग युग की ...... जलती अनेक घटनायें,
जो माँ की सेवा पथ पर ...... आई बन कर विपदायें,
हमने अभिषेक किया था ...... जननी का अरि षोणित से,
हमने श्रिंगार किया था ...... माता का अरि-मुंडों से,
हमने ही उसे दिया था ...... सांस्कृतिक उच्च सिंहासन,
माँ जिस पर बैठी सुख से करती थी जग का शासन,
अब काल चक्र की गति से वह टूट गया सिंहासन,
अपना तन मन धन देकर ...... हम करें पुनः संस्थापन
हम करें राष्ट्र आराधन ...... हम करें राष्ट्र आराधन ...... हम करें राष्ट्र आराधन ......
तन से, मन से, धन से ...... तन मन धन जीवन से
हम करें राष्ट्र आराधन ...... हम करें राष्ट्र आराधन ...... हम करें राष्ट्र आराधन ...... आराधन ...... करें राष्ट्र आराधन

హమ్ కరే రాష్ట్ర ఆరాధన్ ...... ఆరాధన్ ......
హమ్ కరే రాష్ట్ర ఆరాధన్ ...... ఆరాధన్ ......
తన్‌సే మన్‌సే ధన్‌సే ...... తన్ మన్ ధన్ జీవన్‌సే ......
హమ్ కరే రాష్ట్ర ఆరాధన్ ...... ఆరాధన్ ......
అంతర్‌సే ముఖ్‌సే కృతి్‌సే ...... నిశ్చల్ హో నిర్మల్ మతి్‌సే
శ్రధ్ధా సే మస్తక్ నత్‌సే
హమ్ కరే రాష్ట్ర అభివాదన్ ...... అభివాదన్ ......
హమ్ కరే రాష్ట్ర ఆరాధన్ ...... హమ్ కరే రాష్ట్ర ఆరాధన్
హమ్ కరే రాష్ట్ర ఆరాధన్ ...... హమ్ కరే రాష్ట్ర ఆరాధన్
తన్‌సే మన్‌సే ధన్‌సే ...... తన్ మన్ ధన్ జీవన్‌సే ......
హమ్ కరే రాష్ట్ర ఆరాధన్ ...... హమ్ కరే రాష్ట్ర ఆరాధన్ ...... హమ్ కరే రాష్ట్ర ఆరాధన్ ...... ఆరాధన్ ...... కరే రాష్ట్ర ఆరాధన్ ......
అంతర్‌సే ముఖ్‌సే కృతి్‌సే ...... నిశ్చల్ హో నిర్మల్ మతి్‌సే ......
అంతర్‌సే ముఖ్‌సే కృతి్‌సే ...... నిశ్చల్ హో నిర్మల్ మతి్‌సే ......
శ్రధ్ధా సే మస్తక్ నత్‌సే
హమ్ కరే రాష్ట్ర అభివాదన్ ......
హమ్ కరే రాష్ట్ర అభివాదన్ ......
హమ్ కరే రాష్ట్ర ఆరాధన్ ...... హమ్ కరే రాష్ట్ర ఆరాధన్ ...... ఆరాధన్ ...... కరే రాష్ట్ర ఆరాధన్ ......

అప్నే హస్తే శైశవ్‌సే ...... అప్నే ఖిల్తే యౌవన్‌సే ......
అప్నే హస్తే శైశవ్‌సే ...... అప్నే ఖిల్తే యౌవన్‌సే
ప్రౌఢతా పూర్ణ జీవన్‌సే ...... హమ్ కరే రాష్ట్ర కా అర్చన్
హమ్ కరే రాష్ట్ర కా అర్చన్
హమ్ కరే రాష్ట్ర ఆరాధన్ ...... హమ్ కరే రాష్ట్ర ఆరాధన్ ...... ఆరాధన్ ...... కరే రాష్ట్ర ఆరాధన్ ......

అప్నే అతీత్‌కో పఢ్‌కర్ ...... అప్నా ఇతిహాస్ ఉలట్ కర్ ......
అప్నే అతీత్‌కో పఢ్‌కర్ ...... అప్నా ఇతిహాస్ ఉలట్ కర్
అప్నా భవితవ్య సమఝ్‌కర్ ...... హమ్ కరే రాష్ట్ర కా చింతన్ ......
హమ్ కరే రాష్ట్ర కా చింతన్
హమ్ కరే రాష్ట్ర ఆరాధన్ ...... హమ్ కరే రాష్ట్ర ఆరాధన్ ...... ఆరాధన్ ...... కరే రాష్ట్ర ఆరాధన్ ......

హే యాద్ హమే యుగ్ యుగ్ కీ జల్తీ అనేక్ ఘట్‌నాయే
జో మా కీ సేవా పధ్ పర్ ఆయీ బన్ కర్ విప్‌దాయే
హమ్‌నే అభిషేక్ కియాథా జననికా అరి షోణిత్‌సే
హమ్‌నే శృంగార్ కియాథా మాతా కా అరి ముండోసే
హమ్‌నే హీ ఉసే దియా థా సాంస్కృతిక్ ఉఛ్ఛ్ సింఘాసన్
మా జిస్ పర్ బైఠీ సుఖ్‌సే కర్తీథి జగ్ కా శాసన్
అబ్ కాలచక్ర కీ గతిసే వహ్ టూట్‌గయా సింఘాసన్
అప్నా తన్ మన్ ధన్ దేకర్ హమ్ కరే పునఃసంస్థాపన్
హమ్ కరే రాష్ట్ర ఆరాధన్ ...... హమ్ కరే రాష్ట్ర ఆరాధన్ ...... హమ్ కరే రాష్ట్ర ఆరాధన్ ......
తన్‌సే మన్‌సే ధన్‌సే ...... తన్ మన్ ధన్ జీవన్‌సే ......
హమ్ కరే రాష్ట్ర ఆరాధన్ ...... హమ్ కరే రాష్ట్ర ఆరాధన్ ...... హమ్ కరే రాష్ట్ర ఆరాధన్ ...... ఆరాధన్ ...... కరే రాష్ట్ర ఆరాధన్ ......

చాణక్య వీడియో

సాహిత్యం : శ్రీ విశ్వనాధ్ శుక్లాజీ
సంగీతం : చాణక్య సీరియల్‌కి : ఆశిత్ దేశాయ్

Monday, November 29, 2010

నాన్న

అందరూ ఆడపిల్లలు బరువనుకునే రోజుల్లో ఆడపిల్ల కావాలి అని ఆరాటపడ్డ నాన్న .....
ఏ కాలమైనా ఆడపిల్లకి చదువు చాలా అవసరం అని నా ఉన్నత విద్య కోసం నా కన్నా ఎక్కువ శ్రమించిన నాన్న .....
ఆడపిల్లకి చదువెందుకు పెళ్ళి చేసి బరువు దించుకోక అన్న మాటల్ని ఖాతరు చెయ్యకుండా మగపిల్లలతో సమానంగా చదివించిన నాన్న .....
జీవితంలో ఒక్కో మెట్టు ఎక్కుతున్న నన్ను చూసి మురిసిపోయిన నాన్న .....

మా నాన్న ఇక లేరంటే మనసు నమ్మటం లేదు. ఏదో ఒక పక్క నించి అమ్మలూ అని పిలుస్తూ వస్తారనే నమ్ముతోంది.
కాలం స్థంభించింది అనిపిస్తుంటే ఎందుకు రోజులు ఆగకుండా గడిచిపోతున్నాయి? ఎందుకు కళ్ళల్లో నీళ్ళు ఇంకడం లేదు?
అందరూ ఇది పెద్ద నష్టం అంటున్నారు కానీ నష్టం అనే చిన్న పదం జీవితంలో ఏర్పడిన ఈ వెలితిని వివరించగలదా? ఊహూ, తెలుగు భాషలో ఈ బాధని వివరించగల పదం లేదు. ఏ భాషలోనూ ఏ పదానికి అంత శక్తి లేదు.

జీవితాన్నిచ్చిన నాన్న ఇంక జ్ఞాపకాల్లోనే ......

Friday, October 29, 2010

నువ్వు - నేను

చంద్రుడివి నువ్వు ...... చకోరాన్ని నేను
భ్రమరానివి నువ్వు ...... మధువును నింపుకున్న కుసుమాన్ని నేను
ఉదయించే సూర్యుడివి నీవైతే ...... విచ్చుకునే పద్మాన్ని నేనౌతా
పురుషుడివి నువ్వు ...... ప్రకృతిని నేను
నీ ప్రతి రూపానికి నా ప్రతిరూపం ఇదిగో ఇక్కడే.

Monday, October 25, 2010

ఎదురుచూపు

ప్రకృతి చల్లని వెన్నెలనిచ్చే రేరాజు కోసం ఎదురు చూస్తోంది .....
నా ఎదురు చూపులు నాకోసమే వెన్నెల తెచ్చే నీ కోసం .....
ఇంకాసేపట్లో ఆరుబయలంతా పుచ్చపువ్వులాంటి పున్నమి వెన్నెల పరచుకుంటుంది
నా మనసుకి ఇంకా అమాసే
సెలయేటిలో చిరునవ్వుతో విచ్చుకున్న కలువపువ్వు
చిరుగాలి చలికి ముడుచుకుని ఉన్న నేను
పండు వెన్నెల్లో హేమంత తుషారాలలో తడుస్తూ .....
ఒడిలో అలసి సొలసిన సఖుడి కోసం మోహనాన్ని మధిస్తూ .....
మనసుని మధువుతో నింపుతూ, నింపుకుంటూ .....
జీవనరాగం ఆలపించేదెన్నడో, ఎప్పుడో?

Wednesday, June 30, 2010

5వ కాలిఫోర్నియా సాహితీ సదస్సు

5వ కాలిఫోర్నియా సాహితీ సదస్సు అని బ్రహ్మానందం గారి బ్లాగ్'లో చూడగానే వెళ్ళాలన్న సంకల్పం కలిగింది. బ్రహ్మానందం గారు కూడా వెంటనే వివరాలు అవి పంపి రమ్మని ఆహ్వానించారు. అలా మా ఊరి నించి 390 మైళ్ళ దూరంలో జరిగిన సాహితీ సదస్సులో ఎటెండెన్స్ వేయించుకుని వచ్చాను.

జూన్ ౧౮,శుక్రవారం డ్రైవ్ చేసి రాత్రికి మిల్పిటస్ చేరుకుని రాత్రికి చక్కగా రెస్ట్ తీసుకుని పొద్దున ఠంచనుగా పదింటికల్లా సదస్సు జరిగే కమ్యూనిటీ సెంటర్లో ఉండాలన్న బృహత్తర ప్రణాళిక కొన్ని అనివార్య కారణాల వల్ల రూపాంతరం జెంది శుక్రవారం డ్రైవ్ కాస్తా శనివారం పొద్దున విమానం అయింది. ఆ విమానం కూడా నా తొందరకి తగ్గట్టే ఆలస్యం చేసి తీరిగ్గా శాంఫ్రాన్సిస్కో ఏర్ పోర్ట్'లో దించింది. అక్కడి నించి మిల్పిటస్ వెళ్ళి రిఫ్రెష్ అయి సదస్సు జరిగే ప్రాంతానికి వెళ్ళేసరికి భోజనాలకి స్వాగతం పలికే వేళ అయింది. లోలికి అడుగు పెట్టగానే తాటిపామల మృత్యుంజయుడు గారు రండి రండి అని ఆహ్వానించారు. భోజనాలు అయిన వెంటనే జె. గోపాలకృష్ణ గారు మతసాహిత్యాలు - ఆంతర్యాల గురించి ప్రసంగించారు. లంచ్ తర్వాత మతసాహిత్యం లాంటి భారీ విషయం మీద ఉపన్యాసం అనేసరికి చాలా కుతూహలం కలిగింది. కానీ, గోపాలకృష్ణ గారు వివాదాస్పద విషయాల జోలికి వెళ్ళకుండా మనలో చాలామందికి భగవంతుడి మీద ఉండే చిన్న చిన్న (అతి) నమ్మకాల గురించి మాట్లాడారు. మనం చేసే పాపాలన్నీ చేసి దేవుడికో కొబ్బరికాయ కొట్టేస్తే పాపాలన్నీ పటాపంచలవుతాయి అనుకుంటాం. కానీ పాపం దారి పాపానిదే, పుణ్యం దారి పుణ్యానిదే. దేవుడు తండ్రిలాంటి వాడు కాబట్టే బిడ్డ తప్పు దారిలో వెళుతుంటే శిక్షించైనా సరైన దారిలో పెట్టే తండ్రిలానే పాపాలు చేసినప్పుడు, పొగిడారు కదా, కానుకలిచ్చారు కదా అని పొంగిపోకుండా ఆ పాపాలకి శిక్షించే తీరతాడు అని బాగా చెప్పారు.

తర్వాత కె.వరలక్ష్మి గారు తమ కథా పరిణామం గురించి వివరించారు. ఆవిడ తన అనుభవాన్ని కథగా రాసి అందులో తను తన పక్షాన నిలబడి తన వాదన మటుకే వినిపించటం రచయిత్రిగా తప్పని గ్రహించి ఆ తరువాత తమ కథా రచనలలో ఆ తప్పు జరగకుండా జాగ్రత్త పడిన తీరు వివరించారు. వరలక్ష్మి గారివి రంగనాయకమ్మ గారి లాంటి ' స్త్రీవాద ' రచనలన్నారు ఎవరో. కానీ వారి మాటతీరు అదీ సో కాల్డ్ ఫెమినిస్ట్ అనిపించలేదు. వారి పుస్తకాలు కొన్ని తీసుకున్నాను. చదవాలి.

వరలక్ష్మి గారి తర్వాత జెజ్జాల కృష్ణమోహన్ గారు పద్యం లయాత్మకం ఛందస్ అంటూ ఛందస్సు తీరు తెన్ను వివరించారు. చిన్నప్పుడెప్పుడో స్కూల్లో నేర్చుకుని కాలేజ్'లో చేరగానే మర్చిపోయిన గురువు లఘువులని గుర్తు చేసారు. వీరు తయారు చేసిన టెంప్లేట్ ఉపయోగించి ఎవరైనా పద్యాలని రాయచ్చు అన్నారు. వచ్చే లాంగ్ వీకెండ్ చేసే పనుల్లో పద్యం రాయటం ఒకటి ఉత్పలమాలలో. :)

నాకు గౌరీకృపానందన్ గారి ప్రసంగం కూడా బాగా నచ్చింది. చాలా సింపుల్ గా ఉన్నారు. యండమూరి నవలలు చాలా మటుకు, యద్దనపూడి నవలలు కొన్ని ఓల్గావి ఇంకా కొన్ని నవలలు అనువాదం చేశారట. కత్తికి రెండువైపులా పదును ఉన్నట్లు తమిళం నించి తెలుగుకి కూడా అనువాదం చేశారట. మరి వీరు అనువాదం చేసినవో కాదో నాకు తెలీదు కానీ కొన్ని అనురాధారమణన్, శివశంకరిగార్ల రచనలు చదివాను. నా అభిమాన తమిళ రచనలవి. అనురాధా రమణన్ మరణం సాహిత్యలోకానికి తీరని లోటు.

వేమూరి వెంకటేశ్వరరావు గారు తెలుగు భాషకి వచ్చిన ఇక్కట్ల గురించి చాలా హాస్యంగా వివరించారు. బర్కీలి యూనివర్సిటీలో తెలుగుని బోధిస్తూ అమెరికాలో తెలుగు వ్యాప్తి చెందటానికి కృషి చేస్తున్న వెంకటేశ్వరరావు గారి బాధ అర్థం చేసుకోతగ్గది. కొంతమంది, కాదు చాలా మంది భాష వింటుంటే వారు మాట్లాడేది తెలుగేనా అని సందేహం వస్తుంది. పోనీ ఇంగ్లిష్ అన్నా సరిగ్గా మాట్లాడతారా అంటే అదీ లేదు. రెంటికి చెడ్డ రేవడుకి ప్రతిరూపాలు. తెలుగులోనే మాట్లాడాలి అంటూ తెలుగులో మంటనక్కలని, అంతర్జాలాలని సృష్టించే పెద్దలు అటు వైపు దృష్టి పెట్టి వారికి సహాయం చేసి తెలుగు వ్యాప్తికి దోహదపడితే బావుంటుందేమో.

తర్వాత స్వీయ కవితా పఠనం. ఇందులో నాకు అన్నీ బానే ఉన్నాయి కానీ కొన్ని ఇంకొంచెం ఎక్కువ నచ్చాయి.

గీత గారి కవిత వారి పాపాయి గురించి. అందులో ఒక లైన్ నాకు చాలా నచ్చింది.
" నెలకో బాధ నిలబడనీకుండా చేసినా
ఎటు ఒత్తిగిల్లీ నిద్రపోలేకున్నా
బైటి లోకపు ద్వారపాలకురాలినై
రాత్రింబగళ్లు నీ కోసమే పహారా కాస్తున్నా "

కాకపోతే చిరు చిన్న పాపాయి అన్న పద ప్రయోగం నాకు అర్థం కాలేదు. చిరు, చిన్న రెంటికీ ఒకటే అర్థం ఉన్నప్పుడు, రెంటినీ ఉపయోగించాల్సిన అవసరం నాకు తెలీలేదు. గీత గారి పుస్తకం కూడా తీసుకున్నాను. అది కూడా చదవాలి.

కృష్ణ అక్కులు గారి గాలి సోదరుల కవిత బావుంది. ఉక్కు కవచాలున్నా సరే వీరితో పెట్టుకున్న వారు గాల్లో కొట్టుకుపోతారు అని వీరి భావన. :)

నేమాన గోపాల్ గారు, మధు ప్రఖ్య, శారద, ఉపాధ్యాయుల కృష్ణమూర్తి గారు, తల్లాప్రగడ రావు గారు, సరస్వతి దర్భ గారు, వరప్రసాద్ గారి స్వీయ కవితా పఠనంతో సదస్సు ముగిసింది.

పొద్దున జరిగిన కార్యక్రమాలు నేను మిస్ అవటం వలన కొన్ని మంచి ప్రసంగాలు వినలేకపోయాను; అపర్ణ గునుపూడి గారి ' స్త్రీ నాడు నేడు ', ప్రఖ్య మధుబాబు గారి ' సాహిత్యంలో ప్రకృతి - ఋతంభర ', మృత్యుంజయుడు గారి ' రావిశాస్త్రి కథల్లో వర్ణనలు ', వంశీ ప్రఖ్య గారి ' తెలుగు సంస్కృతముల సంబంధము - కొత్త కోణం ', కె.వి.ఎస్.రామారావు గారి ' ధ్వనులు, శ్లేషలు ', బోయ జంగయ్య గారి ప్రసంగం.

మొత్తానికి నాకు చాలా నచ్చింది. ఎప్పుడు వర్క్, వర్క్'లో రక్తదానం (ఎగైన్ రక్తపాతం కాదని మనవి) వగైరాలతో టైం తెలీకుండా గడిచిపోయే నాకు ఈ సాహితీ సదస్సు నిజంగా ఒక ఆటవిడుపు. మధ్య మధ్యలో క్విజ్ రూపేణా అడిగిన ప్రశ్నలు, వాటి సమాధానాల ద్వారా కొన్ని తెలియని విషయాలని తెలుసుకున్నాను. :)

కొత్త పరిచయాలు, కొత్త దృక్పధాలు మంచైనా, చెడైనా, ఒప్పుకున్నా, విభేదించినా మనిషికి ఉత్తేజాన్ని ఇస్తాయి, కొత్త ఆలోచనలు కలిగిస్తాయి. ఆ కొత్త ఆలోచనలు జీవనగమ్యాన్ని, గమనాన్ని మార్చేయగలవు. సంగీత, సాహిత్యాలకి సంబంధించిన ఏ సమావేశానికైనా ఇక నించి క్రమం తప్పక వెళ్ళాలన్నదే నా కొత్త ఆలోచన. :)

Thursday, June 10, 2010

భారతీయత - నా అభిప్రాయం

Well, adding to Karthik's points అని కత్తి గారి సైట్లో కామెంట్ మొదలెట్టాను. చూస్తే ఒక పోస్ట్ సైజ్ కి పెరగటంతో అక్కడ కామెంట్ పెట్టటం కన్నా ఇక్కడ పోస్ట్ వెయ్యటం బావుంటుందనిపించి, ఇదిగో ఇలా.

భారతీయత - నా అభిప్రాయం

ఇక్కడ అనగా అమెరికాలో, in fact in all the countries I lived or visited so far except for India, high school అవగానే పిల్లలు బైటికి వెళ్ళిపోతారు. అప్పటి నించి వాళ్ళ కష్టాలు వాళ్ళే పడతారు. అందుకే ఇక్కడి విద్యాధికుల సంఖ్య కూడా తక్కువ ఎందుకంటే ఆ వయసుకి సరైన నిర్ణయాలు తీసుకునే వయసు, అనుభవం వాళ్ళకి ఉండవు. ప్రభుత్వపు ఫ్రీ చదువు ఉండదు. 17 యేళ్ళ తర్వాత తల్లితండ్రుల దగ్గర ఉండటం అవమానంగా భావిస్తారు ఇక్కడి పిల్లలు. ఇక్కడ స్థిరపడ్డ మాకు తెలిసిన భారతీయ కుటుంబంలో ఆడపిల్ల తనని అలా వెళ్ళనివ్వలేదని ఈ మధ్యే రెండు సార్లు ఆత్మహత్యాయత్నం చేసింది కూడా. కానీ భారత దేశంలో పిల్లలు చదువుకుని స్థిరపడేవరకు తల్లితండ్రులు వారితోనే ఉంటారు. వారి మంచీ, చెడ్డా చూస్తారు. మరి ఈ కొత్త జనరేషన్ తల్లితండ్రులు ఠాఠ్, నాకీ భారతీయ విలువలు అనవసరం, నువ్వు నీ ఏడుపేదో ఏడు, మాతో ఉండొద్దంతే అని పిల్లల్ని తన్ని తగలేస్తే తప్ప. :)

ఇక కుటుంబ వ్యవస్థ విషయానికి వస్తే వీళ్ళకి కుటుంబ విలువలు తెలీవు అన్నది ఎంత అబధ్ధమో వీళ్ళు ఆ వ్యవస్థని భారతీయుల్లా గట్టి పునాది వేసుకుని నిలబెట్టుకుంటారనటం కూడా అబధ్ధం. వీళ్ళు కుటుంబానికి విలువ ఇస్తారు, తల్లితండ్రులని, అక్కచెళ్ళెళ్ళని ప్రేమిస్తారు. కానీ ఎవరైనా, ఏదైనా వారికి వారి తర్వాతే. భార్యైనా, భర్తైనా, పిల్లలైనా ఎవరైనా "తమ" తర్వాతే. భారత దేశంలో పిల్లలు పుట్టిన తరువాత విడాకులు తీసుకునేవారి సంఖ్య ఎంతుండొచ్చు? పిల్లలు పెరిగి పెద్దవారైన తరువాత విడాకులు తీసుకునేవారి సంఖ్య ఎంతుండొచ్చు? ఒకసారి పెళ్ళి అయ్యాక భార్య, భర్త ఇద్దరూ సద్దుకుపోతూ సంసారాన్ని ముందుకు లాగాలనే చూస్తారు కానీ విడిపోయి ఏదో సాధిద్దాం అనుకోరు. కనీసం అది భారతీయ తత్వం కాదు. కానీ ఇక్కడ? ఉదాహరణకి అమెరికా అధ్యక్ష పదవికి పోటీ చేసిన Al Gore, ఆయన భార్య 40 ఏళ్ళ వైవాహిక జీవితం అనంతరం విడాకులు తీసుకున్నారు. ఇంక ఆయన పిల్లలు ఇద్దరూ అదే దారిలో నడిచారంటే వింతేమీ కాదు కదా. భారతదేశంలో నలభైయేళ్ళ వైవాహిక జీవితం తర్వాత విడాకులు తీసుకోవటం అన్నది ఊహలోకి కూడా రాదు ఎవరికీ. అది మంచేనా లేక చెడా, ఇష్టం ఉన్నా లేకపోయినా జీవితాంతం సద్దుకుపోవాలా అన్న విషయం ఇక్కడ అప్రస్తుతం. కానీ కుటుంబ వ్యవస్థ పటిష్టంగా ఉంటేనే దేశం కూడా పటిష్టంగా మనగలుగుతుంది. పిల్లలు ఎలా పెరుగుతారు, వాళ్ళ జీవితాన్ని ఎలా తీర్చిదిద్దుకుంటారు అనేది తల్లితండ్రుల మీద చాలా ఆధారపడి ఉంటుంది. పిల్లలకి సాధారణంగా తల్లితండ్రులే రోల్ మోడల్స్ అవుతారు ఏ దేశంలోనైనా. వారు చిన్నప్పటినించి చూసిన ప్రవర్తనే వారికి ఆచరణీయం అనిపిస్తుంది సాధారణంగా. అది తల్లితండ్రులని కావిట్లో మోసి పుణ్యక్షేత్రాలు చూపించిన శ్రవణుడికైనా, మీనాన్నకి నువ్వు తీసిన గొయ్యి రేపు నీకు తియ్యాలి కదయ్యా అనే పిల్లవాడికైనా. అందుకే భారతదేశంలో కుటుంబవ్యవస్థకి అంత విలువ, అందుకే అది అంత పటిష్టమైన పునాది మీద నిలబడగలిగింది.

ఇక "వీళ్ళు ఎగేసుకెళ్ళేదీ అక్కడికే. అక్కడికి వెళ్ళి డాలర్లు సంపాదిస్తేగానీ భారతీయత వీళ్ళకు బూతద్దంలో పెట్టినట్లుకనిపించదు." విషయానికి వస్తే, మొట్టమొదట చిన్న కరెక్షన్. భూతద్దం అనుకుంటాను బూతద్దం కాదేమో. :( అర్థం దరిద్రంగా మారింది బూతద్దం అనేసరికి.

ఎవరైనా ఎక్కడికైనా వెళ్ళేది బ్రతుకుతెరువు కోసమే కదా. వెళ్ళింది అమెరికా అయినా, అమలాపురం అయినా, బెంగుళూరు అయినా చదువు కోసమో, బ్రతుకుతెరువు కోసమో తప్ప భారతీయత తెలుసుకోవటం కాదు కదా. ఈ లెక్కన, తెలుగువాళ్ళు కన్నడదేశానికి వెళ్తేనే వాళ్ళకి తెలుగుతనం, మహారాష్ట్రీయులకి పక్కన ఉన్న గుజరాత్ వెళ్తేనే శివాజి గుర్తొస్తాడు అన్నట్టుంది. :) అయినా ఇందులోనూ తప్పు లేదేమో. భారతదేశంలో ఉండి కూడా భారతీయ విలువలు తెలియకుండా ఉండటం కన్నా పరాయి దేశంలో ఉండి తెలుసుకుని ఆరాధించటం తప్పు కాదేమో.

"They have an institutional mechanism to take care of old."

I don''t think Karthik meant machine in his comment. Anyways, could you please explain what that mechanism is? కిందపడి లేవలేకపోతే మెళ్ళో ఉన్న విజిల్ ఊదితే ఎక్కడో ఉన్న కాప్స్ కి పిలుపంది వాళ్ళు వచ్చి రక్షించటం అంటారా? లేక నడవటానికి చేతకాక రకరకాల బటన్స్ ఉన్న చక్రాల బండి "కొనుక్కుని" రోజులు భారంగా గడపటం అంటారా? Do you even have an idea about how hard senior citizens here have to work to earn even at the age of 70 and above to meet their basic minimum needs? their insurance premiums?

ఇక ఆప్యాయత విషయానికి వస్తే మీరన్నది కరక్టే, ఆప్యాయతలు చాలా ఎక్కువ. సంవత్సరానికి ఒకసారి మదర్స్ డే, ఫాదర్స్ డే అంటూ పూలు, కేక్స్ పంపించి వాళ్ళ ఆప్యాయతని చాటుకుంటారు. :)

మిడిల్ క్లాస్ అని అంత తేలిగ్గా అనేసారు మరి మీరు హై క్లాస్ వారా మిడిల్ క్లాస్ అంటే చిన్నచూపుకి? లేక లో క్లాస్ వారా మిడిల్ క్లాస్ అంటే కుళ్ళుకోవటానికి? :)

నిజమే, మనం భారతీయ విలువలతో అమెరికాని లేక ఇతర దేశాల్ని కొలవకూడదు. మరి ఆ ఇతర దేశాలకి సంబంధించిన వేటితోనైనా భారతదేశాన్ని ఎందుకు కొలవటం? అది తప్పు కాదా? ఎందుకు భారతదేశం అంటే ఇంత చులకన? అదీ ఆ దేశంలోనే ఉంటూ? కొంచెం ఎక్కువ ప్రజాస్వామ్యం ఉంటే ఇదేనేమో జరిగేది. ఎక్కడైనా, ఏ వ్యవస్థలోనైనా, ఏ దేశంలోనైనా అన్నీ అద్భుతమైనవే ఉండవు. అలా ఉంటే అది రామరాజ్యమే అవుతుంది. మంచిని తీసుకోకుండా ద్వేషాన్ని వెల్లగక్కడం వల్ల ఉపయోగం ఏముంది? మనిషి మీద ద్వేషం ఉంటే ఆ మనిషి మీద వెదజల్లండి. అది మీకు మీకు పరిమితం అవుతుంది కానీ ఒక దేశాన్ని, ఆ దేశపు విలువల్ని విమర్శించి ప్రపంచంలో తీవ్రవాదం కన్నా ప్రమాదమైనది స్వేచ్చగా మాట్లాడి, మనగలిగే ప్రజాస్వామ్యం అనిపించేలా చెయ్యకండి.
"

Saturday, May 29, 2010

చింతయేయుం?

భావయామి గోపాలబాలం నేను చాలా చిన్నప్పుడు విన్న కీర్తనల్లో ఒకటి. అందుకేనేమో నాకు బాగా నచ్చిన, ఇష్టమైన పాటల్లో ఇదొకటి. చిన్నప్పుడు మా ఇంట్లో ఎల్.పి ప్లేయర్ ఉండేది. అది ప్లే చెయ్యటం ఒక సరదా అప్పట్లో. బినాకా గీత్ మాలా వి ఎన్ని రికార్డ్స్ ఉండేవో. అందులో అమీన్ సయాని గొంతు గంభీరంగా అసలెంత బావుండేదో. అప్పట్లో నాకు తెలీకుండానే ఆయన గొంతుని తెగ ప్రేమించేశాను. :) ఇంకా పాండవ వనవాసం, నర్తనశాల ..... (అసలు ఈ సినిమాల్లో పద్యాలు, పాటలు ఇంకా నాకు గుర్తున్నాయంటే అది ఎల్.పి ల మహిమే. ఆరు నించి పదేళ్ళ వయసులో ఏదైనా మనసుకి హత్తుకుంటే ఇంక వాటిని కావాలన్నా మర్చిపోలేమేమో. :) ). ఎం.ఎస్.సుబ్బులక్ష్మి గారి వెంకటేశ్వర సుప్రభాతం కూడా ఉండేది. అదే రికార్డ్‌లో రెండో వైపు స్వాతి తిరునాళ్ వారి కృతులుండేవి. భావయామి రఘురామం, శ్రీరంగపుర విహారా. ఈ రెండు కృతులు విని విని నోటికి వచ్చేసాయి కూడా. అందులో భావయామి రఘురామం రామాయణ రాగమాలిక. మొత్తం రామాయణం వస్తుంది సంస్కృతంలో. అద్భుతమైన కృతి. అలా భావయామి అంటే స్వాతి తిరునాళ్ కృతి తప్ప ఇంకోటి కాదు అని గాఠ్ఠిగా నమ్మే రోజులు. ఆ సమయంలోనే టివి లో ఒకసారి ఢిల్లి నించి వచ్చే ప్రోగ్రాంలో కూచిపూడి శాస్త్రీయనృత్యం వస్తుంటే అపురూపం కదా అని వి.సి.ఆర్‌లో రికార్డ్ చేశాం. అప్పట్లో వి.సి.ఆర్ మాకు ఒక్కళ్ళకే ఉండేది. అందరిళ్ళల్లోనూ వి.సి.పిలు ఉండేవి. నేను మా అన్నయ్య దర్జాగా అవసరం ఉన్నా లేకపోయినా ప్రోగ్రాంస్ రికార్డ్ చేసేవాళ్ళం. రామాయణం, మహాభారతంతో సహా. ఇప్పటికీ ఇండియాలో ఉండాలి ఆ కాసెట్స్. అలా రికార్డ్ చేసిన ప్రోగ్రాం ఒక శాస్త్రీయ నృత్యం. ఆ కళాకారిణి గుర్తులేదు కానీ ఆవిడ నృత్యం చేసిన పాట మటుకు బాగా గుర్తుంది. అదే అన్నమాచార్యుల కృతి భావయామి గోపాలబాలం. మొదటిసారి విన్నప్పుడు ఈవిడేంటి తప్పు పాడుతోంది భావయామి రఘురామం పాడాలి కదా అనుకుని మరి కాసేపు విని అబ్బే ఈవిడ తప్పే పాడుతోంది అని తీర్మానించేసుకుని ఎమ్మెస్ అంత ఆవిడే తప్పు పాడేస్తోంది నే కనిపెట్టేశాననుకుని గొప్పగా ఫీల్ అయిపోయి మా ఇంట్లో వాళ్ళకి చెప్పి అవి రెండు వేరు వేరు పాటలమ్మా అని చెప్పినా నమ్మక ఏవీ కాదు రెండూ ఒకటే అని తీర్మానించేసుకున్న రోజులు. తర్వాత్తరువాత విషయం అర్థమై భావయామి రెండు పాటల్నీ నేర్చుకున్నాను. :) ఒకటి రాముడి గురించైతే రెండోది కృష్ణుడి గురించి. రెండూ ఆయన పాటలే. రెండూ ఆయనని మనసులో నింపుకుని సేవిస్తే ఇంక ఆ మనసులో ఎటువంటి చింతలకీ తావు లేదని చెప్పే జీవిత సారాంశాలే.

Sunday, May 16, 2010

భక్తి ... ప్రేమ ... నింద ...

విక్రం హజ్రా పాడిన అచ్యుతం కేశవం నాకు బాగా నచ్చిన భజన. చిన్నప్పుడు నేర్చుకున్న అచ్యుతం కేశవం పాట వెతుకుతుంటే ఈభజన దొరికింది. వినగానే ఒక రకమైన అలౌకిక భావన కలిగింది. భగవంతుడు మనం పిలిస్తే పలకడు అనుకుంటాం కానీ ఆ మీరాలాగా పిలుస్తున్నామా? ఆ యశోదమ్మలాగా జోల పాడుతున్నామా? రుచికరమైన పళ్ళే తినాలి అని తను రుచి చూసి తియ్యటిపళ్ళని ఆ స్వామికి అర్పించిన భక్త శబరి భక్తి మనకుందా? భగవంతుడి చేత నాట్యం చేయించిన గోపికలకున్న ప్రేమ మనకుందా? అవి లేనప్పుడు ఆ దేవుడు పలకట్లేదని నిందించగలిగే అర్హత మనకుందా? ఏమో. :)

విక్రం హజ్రా ఈ భజన పాడిన తీరు నాకు బాగా నచ్చింది. మా యశోదా కే జైసే సులాతే నహీ అన్నప్పుడు మెల్లగా మృదువుగాపాడటం; నిజంగా స్వామివారిని నిద్రపుచ్చుతూ జోల పాడుతున్నట్టు ఆ వెంటనే అచ్యుతం కేశవం అందుకున్నప్పుడు గొంతులో నవ్వుచాలా బావుంటుంది.

అచ్యుతం కేశవం కృష్ణదామోదరం .....

అచ్యుతం కేశవం కృష్ణదామోదరం
రామనారాయణం జానకీవల్లభం .....

కౌన్ కెహతే హై భగవాన్ ఆతే నహీ
తుమ్ మీరా కే జైసే బులాతే నహీ .....

అచ్యుతం కేశవం కృష్ణదామోదరం
రామనారాయణం జానకీవల్లభం .....

కౌన్ కెహతే హై భగవాన్ ఖాతే నహీ
బైర్ శబరీ కే జైసే ఖిలాతే నహీ .....

అచ్యుతం కేశవం కృష్ణదామోదరం
రామనారాయణం జానకీవల్లభం .....

కౌన్ కెహతే హై భగవాన్ సోతే నహీ
మా యశోదా కె జైసే సులాతే నహీ .....
మా యశోదా కె జైసే సులాతే నహీ .....

అచ్యుతం కేశవం కృష్ణదామోదరం
రామనారాయణం జానకీవల్లభం .....

కౌన్ కెహతే హై భగవాన్ నాచ్‌తే నహీ
గోపియోంకీ తరహ్ తుమ్ నచాతే నహీ .....

అచ్యుతం కేశవం కృష్ణదామోదరం
రామనారాయణం జానకీవల్లభం .....
అచ్యుతం కేశవం కృష్ణదామోదరం
రామనారాయణం జానకీవల్లభం .....
రామనారాయణం జానకీవల్లభం .....
రామనారాయణం జానకీవల్లభం.

గానం : విక్రం హజ్రా.

ఇక్కడ వినండి.

ఇక్కడ కూడ వినచ్చు.

Friday, January 1, 2010

ఈ రోజు విశేషం (అంటే నిన్న) .....

హేమంత పౌర్ణమి. :) రాస్తున్నది ఈరోజైనా ఇంకా నడిరేయి కాబట్టి నిన్న అన్నట్టే కదా లెక్క. పుట్టినరోజంటే నా దృష్టిలో కొత్తసంవత్సరం అన్నట్టే. ఈ లెక్కన డిసెంబరు ముఫ్పై ఒకటిన హేమంత పౌర్ణమితో కొత్త సంవత్సరం మొదలైతే, వెనువెంటనే౨౦౧౦ సంవత్సరం కూడా మొదలైంది. ౨౦౧౦ నూతన సంవత్సరానికి ఇప్పుడే ఆర్భాటంగా ఆహ్వానం పలికి వచ్చాము. ఈ కొత్త సంవత్సర నిర్ణయాలు కొన్ని ఉన్నాయి. సాధారణంగా న్యూఇయర్ రిజల్యూషన్స్ బ్రేక్ చెయ్యటానికే అంటారు కానీ నేను కొన్ని నిర్ణయాలు తీసుకున్నాను. అవి బ్రేక్ చెయ్యకూడదన్నది ఇంకొక రిజల్యూషన్. ఇంక చూడాలి మరి. :)

Tuesday, August 25, 2009

పురుషాకృతివో స్త్రీవో ..... ఎవరివో నీవెవరివో .....

తిరుమల మందిర సుందరా పాట నాకు, మా అమ్మకి చాలా ఇష్టమైన భక్తి పాటల్లో ఒకటి. రాగం, భావం అత్యద్భుతంగా ఉంటాయి ఈ పాటలో.

ఆ మధ్య ఈ పాట MP3 దొరక్క గిలగిలలాడిన నాకు తన దగ్గర ఉందని చెప్పి వెంటనే పంపించిన నిషికి బోలెడు థాంక్స్ చెప్పుకోవాలి.

తిరు వీధుల మెరిసే దేవదేవుడు అని అన్నమయ్య పాడారేమో కానీ ఇలాంటి భక్తి పాటలు వినిపించే ప్రతి ఇంట్లో పలికించే ప్రతి హృదిలో ఆ దేవదేవుడు మెరుస్తూనే ఉంటాడు.

పాలకడలిలో పవళించిన ఆ లక్ష్మీవిభుడివో తెలీదు, వెండికొండపై నిత్యం ధ్యానంలో ఉండే అర్థనారీశ్వరుడివో తెలీదు, ముగురమ్మల మూలపుటమ్మవైన త్రిజగన్మాతవో తెలీదు కానీ కాంతులు చిందిస్తూ అందర్నీ ఆకర్షించే నీ ముఖబింబము ఒక్క ఘడియ చూసినా అదే ఈ జన్మకి చాలు (అనుకుంటాం కానీ ఆయన రూపం అయస్కాంతం కాదూ, అక్కడ ఉన్న వాలంటీర్స్ తోసెయ్యకపోతే గోవింద నామస్మరణ చేస్తూ ఆ దేవదేవుడి దర్శనం చేసేవారెవరైనా అక్కడినించి కదులుతారా ఘడియలు దాటినా?) నీ గుడి వాకిట దీపమై వెలుగుతూ ఒక్క రాత్రి మనగలిగినా ఆ సేవ చాలు స్వామీ నీ పాదపద్మాలపై పువ్వునై ఒక్క క్షణం నిలిచినా నా జన్మ ధన్యత కాంచును దేవదేవా.

ఈ పాట వినప్పుడల్లా మా తాతగారు రాసిన దేవదేవ మోక్షపథము తెల్పవేమిరా అన్న పాట గుర్తొస్తుంది. ఆ పాట కూడా నీవరివో తెలీదు, అఖరికి పురుషాకృతివో, స్త్రీవో కూడా తెలీదు అని వస్తుంది. భగవంతుడు వైష్ణవుడు అనీ, శైవుడు అనీ, హిందువనీ, ముస్లిం అనీ నానా విధాలుగా తిట్టుకుంటాం కొట్టుకుంటాం. కానీ ఆఖరికి ఆ భగవత్‌స్వరూపం స్త్రీ రూపమో, పురుష రూపమో తెలీదు, ఆ స్వరూపానికి ఒక రూపం ఉందో లేదో తెలీదు కానీ నేను గొప్ప నా దేవుడు గొప్ప అని జుట్టు జుట్టు పట్టుకోటానికి తయారైపోతాము.

మా అమ్మ చెప్పే మాట నాకెప్పుడు నచ్చుతుంది. ఒక ఆర్టిస్ట్ ని అందమైన అమ్మాయి బొమ్మ గీయమంటే తన దృష్టిలో అందమైన అమ్మాయి ఎలా ఉంటుందో ఊహించి గీస్తాడు. అదే బొమ్మ ఇంకొక కళాకారుడిని గీయమంటే అతనూ అలానే ఊహించి గీస్తాడు. ఈ రెండు బొమ్మలు రెండు కళ్ళు ముక్కు నోరు ఉండటం తప్ప ఇంకెందులోనూ కలవవు. చూడకుండా ఊహించి గీసిన బొమ్మకి, చూడకుండా మనం ఊహించి మదిలో నిల్పుకుని పూజించే దేవుడికి తేడా ఉందా? నీళ్ళు గ్లాసులో పోస్తే అదే ఆకారాన్ని సంతరించుకుంటాయి. అవే నీళ్ళు గిన్నెలో పోస్తే గిన్నె ఆకారంలోనే కనిపిస్తాయి. అంతమాత్రం చేత అవి రెండు వేరే వేరే నీళ్ళు అనగలమా? గ్లాస్‌లో మినరల్ వాటర్ , గిన్నెలో టాప్ వాటర్ అని ఎవరైనా వితండవాదం చేస్తే ఎవరేం చెయ్యలేరనుకోండి. అది వేరే విషయం.

భగవంతుడు నిరాకరస్వరూపుడు అంటారు. కానీ మనం ధ్యానం కోసం వీలుగా ఆ దేవుడికి రూపం సృష్టించుకున్నాం. ఆ రూపాన్నే పూజిస్తున్నాం. కానీ అదే ఆయన శాశ్వత రూపం అని కనిపించే ఆయన ఇంకొక రూపాన్ని తిట్టిపోస్తాం. ఏంటో. ఇలా మాట్లాడానని నన్ను నాస్తికురాలిననో, కమ్యూనిస్ట్ టైపు ఆస్తికురాలిననో అనుకోకండి. నన్ను అల్లహ్ ఓ అక్బర్ అనమన్నా అంటాను కానీ నా రాముడిని పల్లెత్తు మాట అన్నా ఊరుకోను. ఆ నాలిక చీరెయ్యటానికి కత్తి పక్కన పెట్టుకునే తిరుగుతాను. :P

Thursday, February 28, 2008

ఫెమినిస్టులు - పనికిమాలిన రాతలు

మొత్తానికి ఈరోజుకి తీరింది బ్లాగటానికి. ఇలా బ్లాగటం అంటుంటే వాగటం అన్నట్టు లేదు? రెంటికీ పెద్ద తేడా ఉన్నట్టు నాకైతే అనిపించదు. వాగుతున్నప్పుడు ఎదుట కూచున్న ఒకరో, ఇద్దరో, ఇంకా ఎక్కువమందో పాపం చెవులు మూసుకోలేక అదేదో సినిమాలో బ్రహ్మానందంలా దీనంగా మొహం పెట్టుకుని కూచునుంటారు. ఆ మొహాలు చూడలేక, చూసినా అమిత ఇష్టంగా ఇస్తున్న ఉపన్యాసరసధారని ఆపలేక వాగేవాళ్ళు కష్టాలు పడతారు. కొంతమంది ఆ మొహాలు చూసి ఆనందంతో వీరావేశంగా విజృంభిస్తారు. అది వేరే విషయం. కానీ బ్లాగేటప్పుడు ఆ కష్టాలు ఉండవు. ఇష్టం వచ్చినట్టు బ్లాగుకోవచ్చు. చదివేవాళ్ళు చదువుతారు. ఇష్టం లేనివాళ్ళు సింపుల్‌గా బ్రౌజర్ అనే పదార్ధాన్ని మూసేస్తారు. బోల్డుమంది చదివే ఉంటార్లే అన్న సంబరం బ్లాగరులదైతే, హమ్మయ్య తప్పించుకున్నాం అనే ఆనందం చదువరిది. కాకపోతే ఈ ఇష్టం వచ్చినట్టు అనే విషయం బ్లాగుల వరకే పరిమితం చేస్తే బానే ఉంటుంది. ఎందుకంటే సాధారణంగా బ్లాగ్స్ అనేవి వ్యక్తిగతమైనవి కాబట్టి. కానీ పబ్లిక్ సైట్స్ లో ఇష్టం వచ్చినట్టు రాసేసి నన్నెవ్వరూ ఏకకూడదో అంటే ఎలా కుదురుతుంది? ఈ మధ్య ఒక స్నేహితుడు చెప్తే ఎప్పుడు వెళ్ళే సైట్‌లోనే అంతగా ఎప్పుడూ వెళ్ళని ఆర్టికల్స్ సెక్షన్‌లో ఒక కవిత (అనబడే పనికిమాలిన రాత) చదివాను. కవయిత్రి అంతకుముందు రాసిన ఒక కవిత (అనబడే ఇంకో పనికిమాలిన రాత)కి వచ్చిన స్పందన భరించలేక తన ప్రతిస్పందన ఇంకో కవిత రూపంలో ఇచ్చిందన్నమాట.ఆవిడ బాధేంటంటే(లేదా గోల అనాలేమో) అసలీ భూమ్మీద ఆడదానికి వచ్చే కష్టాలన్నింటికీ కారణం మగవాడు అని. మగవాడన్న జీవి భూమ్మీద లేకపోతే స్త్రీ మహా సుఖంగా బతుకుతుంది అని ఆవిడ ఉవాచ. స్త్రీ స్వాభిమానానికి విలువ లేదని మహా దీనంగా చెప్పింది. అసలా కవితలో ఒక్క ముక్కన్నా అర్థవంతమైనది ఉంటుందేమో అని చాలా ఓపిగ్గా చివరివరకు చదివాను. చివరిలో ఆవిడ పేరు చూసి పొట్ట చెక్కలయ్యేంత నవ్వు వచ్చింది. ఆ విషయం తర్వాత చెప్తాను. అసలు ఆవిడ వాదనలో రెండు పాయింట్లు ప్రస్ఫుటంగా కనిపించాయి.

1. స్త్రీల కష్టకారణం పురుషుడు.
2. స్త్రీ స్వాభిమానానికి విలువ లేదు.

మొదటి పాయింటు నాకెప్పుడు అర్థం కాదు. ఎందుకు ఎప్పుడు ఆడవాళ్ళ కష్టాలకి మగవాళ్ళని కారణభూతం చేస్తారు? మగవాడేనా ఎప్పుడూ భూతం, దయ్యం? ఎంతమంది తాటకి, శూర్పణఖలు లేరు? ఒకప్పుడు స్త్రీ చదువుకి దూరంగా ఉండటం కానేమి కుటుంబ పరిస్థితులు కారణం కానేమి సమాజం పోకడలు కానివ్వండి ఆడది ఒక అడుగు వెనక్కే ఉండవలసి వచ్చింది. కానీ కాలం మారింది. కాలంతో పాటు సమాజమూ మారింది. సమాజంతో పాటు మనుషులు మారుతున్నారు. నేటి స్త్రీ అడుగు పెట్టని చోటేది? తన సత్తా చాటని రంగం ఏది? గగనాంగనాలింగనోత్సాహియై అన్నట్టు ఆకాశం అందుకోవటానికి ప్రయత్నిస్తున్న ఈరోజుల్లో కూడా ఇంకా ఆడది దీనావస్థలో ఉందని దానికి కారణం మగవాడని ఎందుకు పాడిందె పాడరా పాచిపళ్ళ దాసరి అన్నట్టు వల్లిస్తారు? స్త్రీ పరిస్థితి పూర్తిగా మారిందని నేనూ అనను. కానీ ఒకప్పుడు 70-30 ఉంటే ఇప్పుడు 30-70 అయింది. మారిన స్థితికి సంతోషిస్తూ మారని జీవితాలని మార్పు వైపుకి తీసుకెళ్ళే ప్రయత్నం చెయ్యాలి అంతే కానీ కారణాలు ఎంచుతూ కూచుంటే ఒరిగేది ఏదీ లేదు. తన కాళ్ళ మీద నిలబడగలిగి సాటి స్త్రీని కూడా పైకి తీసుకురావాలని ప్రతి స్త్రీ కోరుకుంటే ఏ మగవాడు ఏమీ చెయ్యలేడు సాయం తప్ప.

ఇక రెండో పాయింటు స్త్రీ స్వాభిమానం. :) ఈ కవితవిక రాసిన రచయిత్రి ఆఖరికి తన సొంతపేరు మీద కూడ మనగలననే నమ్మకం లేని ఆవిడ. పేరు ముందు శ్రీమతి, పేరు తర్వాత భర్త పేరు అలంకారంగా పెట్టుకున్న మహానుభావురాలు. మరి ఆవిడ స్త్రీ స్వాభిమానాన్ని గురించి ఎలా మాట్లాడగలుగుతోందో నాకైతే అర్థం కాలేదు. పెళ్ళి కావాలి. ఆ పెళ్ళితో పాటూ వచ్చే సాంఘిక భద్రత, గౌరవం కావాలి. కానీ ఆ మొగుడనే మగవాడు అక్కరలేదు. ఏంటో వీళ్ళ లెక్కలు. ఇన్ని లెక్చర్లు ఇస్తారు పోనీ ఏమైనా కాంక్రీటుగా వెలగబెడతారా అంటే ఊహూ. మిసెస్ శ్రీరాం అనో మిసెస్ గోపాల్ అనో పిలిపించుకుంటూ చీర నలక్కుండా మైకులు విరగ్గొడుతుంటారు, కలంలో సిరా అవగొడుతుంటారు లేదా కీబోర్డ్ కీస్ చెడగొడుతుంటారు. రావణాసురుడికన్నా, లంఖినికన్నా పెద్ద పిశాచాలు వీళ్ళే. ఎప్పటికి బాగుపడతారో. వీళ్ళ మీద ఉపయోగించటానికి రెయిడ్ లాంటిది ఏదైనా ఎవరైనా కనిపెడితే బావుంటుంది. సమాజం బోల్డు బోల్డు బాగుపడిపోతుంది.

Sunday, January 27, 2008

నీ ఎదుట నేను వారెదుట నీవు

తేనె మనసుల్లో నీ ఎదుట నేను వారెదుట నీవు పాట నాకు నచ్చిన పాటల్లో ఒకటి. కొన్ని చిన్నతనంలో విన్న పాటలైనా ఎందుకో మనసుకి హత్తుకుపోతాయి. ఈ పాట అలాంటిదే. ఈ పాట సంగీతం, సాహిత్యం రెండు మంచి ముత్యాలైతే సాహిత్యం వైపు ఇంకొంచెం ఎక్కువ మొగ్గుతాను. మొదటి లైన్‌లోనే చూస్తే "నీ ఎదుట నేను వారెదుట నీవు" - నీ ఎదుట నేను అని తన విషయంలో మొదటి స్థానం చందమామకి ఇచ్చినా కాబోయే భర్త విషయం వచ్చేసరికి వారెదుట నీవు అనే అంటుంది ఆ అమ్మాయి. వారి ఎదుట నీవు అంటుంది చందమామతో. వారెదుట వీరున్నా, వీరెదుట వారున్నా, రెండూ ఒకటే అయినా భర్తకి మొదటి స్థానం ఇచ్చి ఆ తర్వాతే ఇంకెవరైనా అన్న ఆలోచన సాహిత్యంలో అంత సున్నితంగా చెప్పటం చాలా నచ్చింది నాకు. అఫ్‌కోర్స్ ఎదురుగా ఉండటం అంటే ముందు ఉండటం కదా సో చంద్రుడికే మొదటి స్థానం ఇచ్చినట్టు కదా అనచ్చు. పర్సెప్షన్ :) :p

ఎప్పటి నించో ఈ పాట కోసం వెతుకుతున్నాను. మరెందుకు ఆంధ్రావిలాస్‌లో కనిపించలేదో నాకు. :O

ఈ సినిమాలో నచ్చే ఇంకో పాట దివి నుండి భువికి. ఆ పాట సంగీతపరంగా ఇష్టం.

Tuesday, January 22, 2008

హేమంతపు పౌర్ణమి

ఈరోజు హేమంతపు పౌర్ణమి. చిన్నప్పటినించి ఈ రోజంటే మహా ఇష్టం. అసలు ఈ రోజు చంద్రుడు నిండుగా, తెల్లగా మెరిసిపోతూ ఉంటాడు. అనటం కాదు కానీ కార్తీక పౌర్ణమి కన్నా ఈ రోజే చంద్రుడు తెల్లగా ఉంటాడు. అన్ని ఋతువుల్లోకి హేమంతం నాకు చాలా ఇష్టం. ముఖ్యంగా జనవరి నెల. కొత్త సంవత్సరంతో మొదలు సంక్రాంతి ఈ నెలలోనే వస్తుంది. ఎగ్జిబిషన్ ఈ నెలలోనే మొదలవుతుంది (చిన్నప్పుడు అదొక పిచ్చి. ఇప్పుడంటే బోలెడు మాల్స్ గట్రా వచ్చాయి, ఇంకా ప్రపంచమంతా ఒక చిన్న గ్లోబల్ విలేజ్ అయింది కానీ చిన్నప్పుడు ఎక్కడెక్కడివి చూడాలంటే ఎగ్జిబిషనే.) నాకిష్టమైన నేను పుట్టిన హేమంతపు పౌర్ణమి ఈ నెలలోనే వస్తుంది. అందుకే ఇంకా ఇంకా ఇష్టం. ఆ మధ్యెప్పుడో మా మావయ్య నా జాతకం చూస్తానని చెప్పి కిందా పైనా కాగితం తిరగేసి ఇంకే విషయం చెప్పలేదు కానీ నువ్వెందుకింత తెల్లగా ఉంటావో తెలిసిందే, పౌర్ణమి రోజు పుట్టావు కదూ అందుకు అన్నాడు. మరి అమావాస్య రోజు పుట్టినవాళ్ళందరు నల్లగా పుడతారా అని నాకొక అనుమానం తదనంతరం బోల్డు ఆవేశం కలిగాయి. మరి ఏదో భవిష్యత్తు చెప్పేస్తాడని గడ్డం కింద చెయ్యి పెట్టుకుని గంటసేపటి నించి కూచునుంటే ఆ విషయమా చెప్పేది.

ఈరోజు సాయంత్రం కూడా నిండు చందమామని చూసి ఈ రోజే ఎక్కువ మెరుస్తున్నాడు అని కన్‌ఫర్మ్ చేసేసుకుని కాసేపు చంద్రుడితో కబుర్లు చెప్పి వచ్చాను. మరి చంద్రుడు నా ఫస్ట్ బాయ్ ఫ్రెండ్ కదా. :p

Tuesday, January 15, 2008

స్పైడర్ మాన్ స్పైడర్ మాన్ .....

పాటలు వింటూ పడుకోవటం చాలా చెడ్డ అలవాటు. అదీ లాప్‌టాప్‌లో వింటూ పడుకోవటం చాలా చాలా చెడ్డ అలవాటు. :( లాప్‌టాప్ మానిటర్ విరక్కొట్టాక అయింది ఈ జ్ఞానోదయం. ఇంత సున్నితంగా ఉంటాయేంటో ఈ ఎలక్ట్రానిక్ వస్తువులు. హు. మళ్ళీ ఖరీదు చూస్తే ఆకాశంలో విహారం.

పైకి కనిపించని పగులు, పోలీసు దెబ్బల్లా. :((( అసలా పగలటం కూడా కళాత్మకంగా పగిలింది. ఒక పక్క అంతా తెల్లగా మధ్యలో కోడిగుడ్డు ఆకారంలో నల్లగా ఆ నలుపు మధ్యలో పొడుగ్గా పెద్ద పగులు గీతలు కింద అడ్డంగా చిన్నవి. అచ్చం చిన్నప్పుడు టి.విలో స్పైడర్ మాన్ స్పైడర్ మాన్ అంటూ పైనించి కిందకి దూకుతూ క్లోజప్పులో చూపించే మొహమే. (అంటే ఇప్పటి స్పైడర్ మాన్ మొహం అలా ఉండదా అంటే అలానే ఉంటుంది కానీ చిన్నప్పటి జ్ఞాపకాలే గుండెకి దగ్గర కదా సో టక్కున అవే గుర్తొస్తాయన్నమాట. ఇప్పుడు బాగా ఇష్టమైనది ఏది అంటే పిజ్జా విత్ అలపెన్యోస్ అని చెప్పే ఛాన్స్ తక్కువ కదా చిన్నప్పుడు తిన్న మినప రొట్టె విత్ ఆవకాయ అని చెప్పే కన్నా. అలాగన్నమాట.

ఏతావాతా విషయం ఏంటంటే ప్రస్తుతం స్క్రీన్‌కి ఒక పక్క ఏమవుతోందో మటుకే తెలుస్తోందన్నమాట. రెండోవైపంతా

స్పైడర్ మాన్ స్పైడర్ మాన్ డస్ వాట్ ఎవర్ ఎ స్పైడర్ కాన్
స్పిన్స్ ఎ వెబ్, ఏని సైజ్ కాచెస్ థీవ్స్ జస్ట్ లైక్ ఫ్లైస్
లుక్ ఔట్ హియర్ కమ్స్ ద స్పైడర్ మాన్ .....

Thursday, January 10, 2008

ఏమో .....

ఇన్నాళ్ళూ అస్పష్టంగా ఉన్న రూపం నీదేనేమో ..... తెలీదు
చిన్నప్పటినించి కన్న కలలు నీ గురించేనేమో ..... తెలీదు
నా జీవితంలో ప్రతిక్షణం నీకోసమేనేమో ..... తెలీదు
ఇన్ని అస్పష్టాల మధ్య తెలిసింది ఒక్కటే
నువ్వు కనిపించే ప్రతిరోజు నాకు హేమంతపు పౌర్ణమి

Saturday, January 5, 2008

రేపటికి నిన్న ఏమౌతుంది?

కొత్త సంవత్సరంలో కొత్త పోస్ట్.

సెలవులైపోయాయి. ఏంటో! వీటి కోసం ఎదురు చూసినంత సేపు పట్టదు అయిఫోవటానికి. ఇలా వస్తాయి. అయిపోతున్నాయి అనుకునేలోపు అయిపోతాయి. అసలా సెలవలు కూడా అయిపోతున్నాయి అని దిగులుపడుతూ ఉండటంలోనే గడిచిపోతాయి. అసలు సెలవు రోజుల్లోనైనా రోజుకి ఒక 48గంటలు పెట్టచ్చుగా దేవుడు, ఎంచక్కా. సెలవుల్లో పాత స్నేహితులని కలుసుకోవటం, కబుర్లు చెప్పుకోవటం బానే ఉంది కానీ బుగ్గలు ఇంకా నొప్పెడుతున్నాయి, కబుర్లు చెప్పుకుని, ఆ కబుర్లకి నవ్వుకుని. చిన్నప్పటి రోజులు నిజంగా మధురాలు. అసలు నిన్న అన్నది ఎప్పుడు మధురమే. "నిన్న"లో ఎన్ని కష్టాలున్నా, ఆ రోజు ఆ కష్టాలు భరించలేనివి అనిపించినా "రేపు"లో అవి మధురంగానే ఉంటాయి. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని అందుకే అంటారేమో. అందుకే నిన్నటి సినిమాలు అప్పుడు ఫట్టుమన్నా ఇప్పుడు ఆహా ఓహో అని కళ్ళు తిప్పకుండా చూస్తున్నాము. కానీ ఈ లెక్క ఎందుకో నాకు నచ్చలేదు. మరి ఇదే ఫార్ములా కరెక్ట్ అయితే రేపు పోకిరి కూడా "ఆణిముత్యం" అవుతుందేమో. :O

కొసమెరుపేంటంటే ఇదివరకు నాకొక నమ్మకం ఉండేది. సంవత్సరం మొదటిరోజు ఏది చేస్తే సంవత్సరం అంతా అదే చేస్తామని. అందుకే చిన్నప్పుడు జనవరి ఫస్ట్‌న, ఉగాది రోజు కష్టపడి పుస్తకంలో ఒక పేజీలో ఒక లైన్ అన్నా చదివేదాన్ని. సంవత్సరం అంతా చదువుతానని. పరీక్షలకి పదిరోజులు ముందు తప్ప పుస్తకం తీసిన గుర్తు ఎప్పుడు లేదు. అది వేరే విషయం. అదే లెక్కన కొత్త సంవత్సరంలో మొదటిరోజు డబ్బులు ఓడిపోతే ఇంక సంవత్సరం అంతా అలా ఓడిపోతూనే ఉంటాం అన్న సూత్రం నమ్మి ఆరోజు కాస్త జాగ్రత్తగా ఉందాం అని ట్రై చేసేదాన్ని. (డబ్బులు ఖర్చుపెట్టటం ఓడిపోవటం కింద రాదు అన్న విషయం గమనించాలి, రెంటిలోనూ డబ్బు లాస్ అయినా సరే. :P) కానీ మొన్న ఇదొక మూఢనమ్మకం. ఇకనించి నమ్మకూడదు అని నిర్ణయించేసుకుని మొన్న న్యూ ఇయర్స్ ఈవ్‌కి $40 పెట్టి $5 సంపాదించాను. మరి అది మూఢనమ్మకమో కాదో ఈ సంవత్సరం కాష్ ఇన్‌ఫ్లో ఔట్‌ఫ్లో బట్టి వచ్చే సంవత్సరం చెప్తాను. :p

Thursday, December 6, 2007

నీ మౌనం

నీ మాటలతో పెదవులపై దరహాసం
నీ తలపులతో బుగ్గల్లో సిగ్గు దొంతరలు
నిన్ను చూడగానే నాలో కలిగే అలజడి
నీ మనసుకు ఇంకా అర్థం కానివా?
మరి ఎందుకు ఈ శీతకన్ను నేస్తం
నీ మౌనం నాకు మరణంతో సమానం