Sunday, January 27, 2008

నీ ఎదుట నేను వారెదుట నీవు

తేనె మనసుల్లో నీ ఎదుట నేను వారెదుట నీవు పాట నాకు నచ్చిన పాటల్లో ఒకటి. కొన్ని చిన్నతనంలో విన్న పాటలైనా ఎందుకో మనసుకి హత్తుకుపోతాయి. ఈ పాట అలాంటిదే. ఈ పాట సంగీతం, సాహిత్యం రెండు మంచి ముత్యాలైతే సాహిత్యం వైపు ఇంకొంచెం ఎక్కువ మొగ్గుతాను. మొదటి లైన్‌లోనే చూస్తే "నీ ఎదుట నేను వారెదుట నీవు" - నీ ఎదుట నేను అని తన విషయంలో మొదటి స్థానం చందమామకి ఇచ్చినా కాబోయే భర్త విషయం వచ్చేసరికి వారెదుట నీవు అనే అంటుంది ఆ అమ్మాయి. వారి ఎదుట నీవు అంటుంది చందమామతో. వారెదుట వీరున్నా, వీరెదుట వారున్నా, రెండూ ఒకటే అయినా భర్తకి మొదటి స్థానం ఇచ్చి ఆ తర్వాతే ఇంకెవరైనా అన్న ఆలోచన సాహిత్యంలో అంత సున్నితంగా చెప్పటం చాలా నచ్చింది నాకు. అఫ్‌కోర్స్ ఎదురుగా ఉండటం అంటే ముందు ఉండటం కదా సో చంద్రుడికే మొదటి స్థానం ఇచ్చినట్టు కదా అనచ్చు. పర్సెప్షన్ :) :p

ఎప్పటి నించో ఈ పాట కోసం వెతుకుతున్నాను. మరెందుకు ఆంధ్రావిలాస్‌లో కనిపించలేదో నాకు. :O

ఈ సినిమాలో నచ్చే ఇంకో పాట దివి నుండి భువికి. ఆ పాట సంగీతపరంగా ఇష్టం.

చందమామా ..... అందాల మామా .....

చందమామా ..... అందాల మామా .....

నీ ఎదుట నేను ..... వారెదుట నీవు
మా ఎదుట ఓ మామ ఎప్పుడుంటావు .....
నీ ఎదుట నేను వారెదుట నీవు
మా ఎదుట ఓ మామా ఎప్పుడుంటావు .....

పెళ్ళిచూపులకు వారొచ్చారు

చూడాలని నే ఓరగ చూశా .....
పెళ్ళిచూపులకు వారొచ్చారు
చూడాలని నే ఓరగ చూశా
వల్లమాలినా సిగ్గొచ్చింది
కన్నుల దాకా కన్నులు పోక
మగసిరి ఎడదనె చూశాను .....
మగసిరి ఎడదనె చూశాను
తల దాచుకొనుటకది చాలన్నాను .....

నీ ఎదుట నేను ..... వారెదుట నీవు
మా ఎదుట ఓ మామా ఎప్పుడుంటావు .....

పెళ్ళిచూపులలో బిగుసుకొని
పేరేమి చదువేమి
ప్రేమిస్తావా వయసెంతా .....
పెళ్ళిచూపులలో బిగుసుకొని
పేరేమి నీ చదువేమి నను ప్రేమిస్తావా వయసెంతా
అని అడిగారా ..... అసలొచ్చారా .....
నాలో వారు ఏం చూశారో నావారయ్యారు .....
నాలో వారు ఏం చూశారో నావారయ్యారు
అందులకే మా ఇద్దరి జంట అపురూపం అంటా .....

నీ ఎదుట నేను వారెదుట నీవు
మా ఎదుట ఓ మామ ఎప్పుడుంటావు .....

చల్లని వెన్నెల దొరవంటారు
తీయని నవ్వుల సిరివంటారు .....
చల్లని వెన్నెల దొరవంటారు
తీయని నవ్వుల సిరివంటారు .....
ఆ వెన్నెలలోని వేడిగాడ్పులు
నవ్వులలోని నిప్పురవ్వలు
అనుభవించి అనమంటాను .....
అనుభవించి అనమంటాను
వయసుకు వైరివి నీవంటాను

నీ ఎదుట నేను వారెదుట నీవు
మా ఎదుట ఓ మామ ఎప్పుడుంటావు .....

చందమామా ..... అందాల మామా .....

సినిమా : తేనె మనసులు
సంగీతం : కె.వి.మహదేవన్ గారు
సాహిత్యం : ఆత్రేయ గారు
గానం : పి.సుశీల గారు

ఆడియో : http://www.andhravilas.com/moviedetail.asp?fid=%7C48%7C75%7C133

Tuesday, January 22, 2008

హేమంతపు పౌర్ణమి

ఈరోజు హేమంతపు పౌర్ణమి. చిన్నప్పటినించి ఈ రోజంటే మహా ఇష్టం. అసలు ఈ రోజు చంద్రుడు నిండుగా, తెల్లగా మెరిసిపోతూ ఉంటాడు. అనటం కాదు కానీ కార్తీక పౌర్ణమి కన్నా ఈ రోజే చంద్రుడు తెల్లగా ఉంటాడు. అన్ని ఋతువుల్లోకి హేమంతం నాకు చాలా ఇష్టం. ముఖ్యంగా జనవరి నెల. కొత్త సంవత్సరంతో మొదలు సంక్రాంతి ఈ నెలలోనే వస్తుంది. ఎగ్జిబిషన్ ఈ నెలలోనే మొదలవుతుంది (చిన్నప్పుడు అదొక పిచ్చి. ఇప్పుడంటే బోలెడు మాల్స్ గట్రా వచ్చాయి, ఇంకా ప్రపంచమంతా ఒక చిన్న గ్లోబల్ విలేజ్ అయింది కానీ చిన్నప్పుడు ఎక్కడెక్కడివి చూడాలంటే ఎగ్జిబిషనే.) నాకిష్టమైన నేను పుట్టిన హేమంతపు పౌర్ణమి ఈ నెలలోనే వస్తుంది. అందుకే ఇంకా ఇంకా ఇష్టం. ఆ మధ్యెప్పుడో మా మావయ్య నా జాతకం చూస్తానని చెప్పి కిందా పైనా కాగితం తిరగేసి ఇంకే విషయం చెప్పలేదు కానీ నువ్వెందుకింత తెల్లగా ఉంటావో తెలిసిందే, పౌర్ణమి రోజు పుట్టావు కదూ అందుకు అన్నాడు. మరి అమావాస్య రోజు పుట్టినవాళ్ళందరు నల్లగా పుడతారా అని నాకొక అనుమానం తదనంతరం బోల్డు ఆవేశం కలిగాయి. మరి ఏదో భవిష్యత్తు చెప్పేస్తాడని గడ్డం కింద చెయ్యి పెట్టుకుని గంటసేపటి నించి కూచునుంటే ఆ విషయమా చెప్పేది.

ఈరోజు సాయంత్రం కూడా నిండు చందమామని చూసి ఈ రోజే ఎక్కువ మెరుస్తున్నాడు అని కన్‌ఫర్మ్ చేసేసుకుని కాసేపు చంద్రుడితో కబుర్లు చెప్పి వచ్చాను. మరి చంద్రుడు నా ఫస్ట్ బాయ్ ఫ్రెండ్ కదా. :p

Tuesday, January 15, 2008

స్పైడర్ మాన్ స్పైడర్ మాన్ .....

పాటలు వింటూ పడుకోవటం చాలా చెడ్డ అలవాటు. అదీ లాప్‌టాప్‌లో వింటూ పడుకోవటం చాలా చాలా చెడ్డ అలవాటు. :( లాప్‌టాప్ మానిటర్ విరక్కొట్టాక అయింది ఈ జ్ఞానోదయం. ఇంత సున్నితంగా ఉంటాయేంటో ఈ ఎలక్ట్రానిక్ వస్తువులు. హు. మళ్ళీ ఖరీదు చూస్తే ఆకాశంలో విహారం.

పైకి కనిపించని పగులు, పోలీసు దెబ్బల్లా. :((( అసలా పగలటం కూడా కళాత్మకంగా పగిలింది. ఒక పక్క అంతా తెల్లగా మధ్యలో కోడిగుడ్డు ఆకారంలో నల్లగా ఆ నలుపు మధ్యలో పొడుగ్గా పెద్ద పగులు గీతలు కింద అడ్డంగా చిన్నవి. అచ్చం చిన్నప్పుడు టి.విలో స్పైడర్ మాన్ స్పైడర్ మాన్ అంటూ పైనించి కిందకి దూకుతూ క్లోజప్పులో చూపించే మొహమే. (అంటే ఇప్పటి స్పైడర్ మాన్ మొహం అలా ఉండదా అంటే అలానే ఉంటుంది కానీ చిన్నప్పటి జ్ఞాపకాలే గుండెకి దగ్గర కదా సో టక్కున అవే గుర్తొస్తాయన్నమాట. ఇప్పుడు బాగా ఇష్టమైనది ఏది అంటే పిజ్జా విత్ అలపెన్యోస్ అని చెప్పే ఛాన్స్ తక్కువ కదా చిన్నప్పుడు తిన్న మినప రొట్టె విత్ ఆవకాయ అని చెప్పే కన్నా. అలాగన్నమాట.

ఏతావాతా విషయం ఏంటంటే ప్రస్తుతం స్క్రీన్‌కి ఒక పక్క ఏమవుతోందో మటుకే తెలుస్తోందన్నమాట. రెండోవైపంతా

స్పైడర్ మాన్ స్పైడర్ మాన్ డస్ వాట్ ఎవర్ ఎ స్పైడర్ కాన్
స్పిన్స్ ఎ వెబ్, ఏని సైజ్ కాచెస్ థీవ్స్ జస్ట్ లైక్ ఫ్లైస్
లుక్ ఔట్ హియర్ కమ్స్ ద స్పైడర్ మాన్ .....

Saturday, January 12, 2008

మనీ మేక్స్ మెనీ థింగ్స్ .....

ఈ పాటలోని అర్థం ఆ కాలానికి ఈ కాలానికి ఏ కాలానికైనా వర్తిస్తుందేమో. ధనమేగా అన్నింటికీ మూలం, ఈ కాలంలో మరింత ఎక్కువగా. మనీ మేక్స్ మెనీ థింగ్స్ అన్నారు పెద్దలు. మనీ నాట్ జస్ట్ మేక్స్ మెనీ థింగ్స్ బట్ ఇట్ ఆల్సో బ్రేక్స్ మెనీ థింగ్స్ అని అనుండాల్సిందేమో. మానవ సంబంధాలని శాసించేవాటిల్లో డబ్బు ప్రథమ స్థానంలో ఉండటం దురదృష్టకరం. కానీ అది చాలా చేదు నిజం. మనిషి తన అవసరాల కోసం సృష్టించుకుని ఆడించిన డబ్బు విషయంలో ప్రస్తుతం రోల్ రివర్స్ అయి డబ్బు మనిషిని ఆడిస్తోంది. ఈ పాటలో మొదటి చరణంలో చెప్పినట్టు ధనలక్ష్మిని అదుపులో పెట్టినవాడు గుణవంతుడు, బలవంతుడు, భగవంతుడు. అలా కాక డబ్బుకు దాసోహం అన్నా లేక ఆ శ్రీదేవిని నిరసించినా రెండూ తప్పే. ప్రతి మనిషి జీవితంలో నేర్చుకోవలసినవి టైమ్ మేనేజ్‌మెంట్, మనీ మేనేజ్‌మెంట్. డబ్బుకి ఎంత విలువ ఇవ్వాలో తెలిస్తే మానవసంబంధాలు ఆర్థికసంబంధం దగ్గర ఆగిపోవేమో.

ధనమేరా అన్నిటికీ మూలం .....

ధనమేరా అన్నిటికీ మూలం
ఆ ధనము విలువ తెలుసుకొనుట మానవధర్మం .....
ధనమేరా అన్నిటికీ మూలం
ఆ ధనము విలువ తెలుసుకొనుట మానవధర్మం .....
ధనమేరా అన్నిటికీ మూలం .....

మానవుడే ధనమన్నది సృజియించెనురా
దానికి తానే తెలియని దాసుడాయెరా .....
మానవుడే ధనమన్నది సృజియించెనురా
దానికి తానే తెలియని దాసుడాయెరా
ధనలక్ష్మిని అదుపులోన పెట్టినవాడే .....
ధనలక్ష్మిని అదుపులోన పెట్టినవాడే
గుణవంతుడు బలవంతుడు భగవంతుడురా .....

ధనమేరా అన్నిటికీ మూలం .....

ఉన్ననాడు తెలివి కలిగి పొదుపు చేయరా
లేనినాడు ఒడలు వంచి కూడబెట్టరా .....
ఉన్ననాడు తెలివి కలిగి పొదుపు చేయరా
లేనినాడు ఒడలు వంచి కూడబెట్టరా
కొండలైన కరిగిపోవు కూర్చుని తింటే .....
కొండలైన కరిగిపోవు కూర్చుని తింటే
అయ్యో కూలిపోవు కాపురాలు ఇది తెలియకుంటే .....
ధనమేరా అన్నిటికీ మూలం .....

కూలివాని చెమటలో ధనమున్నదిరా
పాలికాపు కండల్లో ధనమున్నదిరా .....
కూలివాని చెమటలో ధనమున్నదిరా
పాలికాపు కండల్లో ధనమున్నదిరా .....
శ్రమజీవికి జగమంతా లక్ష్మీనివాసం .....
శ్రమజీవికి జగమంతా లక్ష్మీనివాసం
ఆ శ్రీదేవిని నిరసించుట తీరని దోషం .....

ధనమేరా అన్నిటికీ మూలం
ఆ ధనము విలువ తెలుసుకొనుట మానవధర్మం .....
ధనమేరా అన్నిటికీ మూలం .....

సినిమా : లక్ష్మీనివాసం
సంగీతం : కె.వి.మహదేవన్ గారు
సాహిత్యం : ఆరుద్ర గారు
గానం : ఘంటసాల గారు

ఆడియో :
http://chimatamusic.com/search.php?st=dhanamEra
వీడియో :
http://youtube.com/watch?v=HASZ7C44_1E

Thursday, January 10, 2008

ఏమో .....

ఇన్నాళ్ళూ అస్పష్టంగా ఉన్న రూపం నీదేనేమో ..... తెలీదు
చిన్నప్పటినించి కన్న కలలు నీ గురించేనేమో ..... తెలీదు
నా జీవితంలో ప్రతిక్షణం నీకోసమేనేమో ..... తెలీదు
ఇన్ని అస్పష్టాల మధ్య తెలిసింది ఒక్కటే
నువ్వు కనిపించే ప్రతిరోజు నాకు హేమంతపు పౌర్ణమి

Saturday, January 5, 2008

రేపటికి నిన్న ఏమౌతుంది?

కొత్త సంవత్సరంలో కొత్త పోస్ట్.

సెలవులైపోయాయి. ఏంటో! వీటి కోసం ఎదురు చూసినంత సేపు పట్టదు అయిఫోవటానికి. ఇలా వస్తాయి. అయిపోతున్నాయి అనుకునేలోపు అయిపోతాయి. అసలా సెలవలు కూడా అయిపోతున్నాయి అని దిగులుపడుతూ ఉండటంలోనే గడిచిపోతాయి. అసలు సెలవు రోజుల్లోనైనా రోజుకి ఒక 48గంటలు పెట్టచ్చుగా దేవుడు, ఎంచక్కా. సెలవుల్లో పాత స్నేహితులని కలుసుకోవటం, కబుర్లు చెప్పుకోవటం బానే ఉంది కానీ బుగ్గలు ఇంకా నొప్పెడుతున్నాయి, కబుర్లు చెప్పుకుని, ఆ కబుర్లకి నవ్వుకుని. చిన్నప్పటి రోజులు నిజంగా మధురాలు. అసలు నిన్న అన్నది ఎప్పుడు మధురమే. "నిన్న"లో ఎన్ని కష్టాలున్నా, ఆ రోజు ఆ కష్టాలు భరించలేనివి అనిపించినా "రేపు"లో అవి మధురంగానే ఉంటాయి. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని అందుకే అంటారేమో. అందుకే నిన్నటి సినిమాలు అప్పుడు ఫట్టుమన్నా ఇప్పుడు ఆహా ఓహో అని కళ్ళు తిప్పకుండా చూస్తున్నాము. కానీ ఈ లెక్క ఎందుకో నాకు నచ్చలేదు. మరి ఇదే ఫార్ములా కరెక్ట్ అయితే రేపు పోకిరి కూడా "ఆణిముత్యం" అవుతుందేమో. :O

కొసమెరుపేంటంటే ఇదివరకు నాకొక నమ్మకం ఉండేది. సంవత్సరం మొదటిరోజు ఏది చేస్తే సంవత్సరం అంతా అదే చేస్తామని. అందుకే చిన్నప్పుడు జనవరి ఫస్ట్‌న, ఉగాది రోజు కష్టపడి పుస్తకంలో ఒక పేజీలో ఒక లైన్ అన్నా చదివేదాన్ని. సంవత్సరం అంతా చదువుతానని. పరీక్షలకి పదిరోజులు ముందు తప్ప పుస్తకం తీసిన గుర్తు ఎప్పుడు లేదు. అది వేరే విషయం. అదే లెక్కన కొత్త సంవత్సరంలో మొదటిరోజు డబ్బులు ఓడిపోతే ఇంక సంవత్సరం అంతా అలా ఓడిపోతూనే ఉంటాం అన్న సూత్రం నమ్మి ఆరోజు కాస్త జాగ్రత్తగా ఉందాం అని ట్రై చేసేదాన్ని. (డబ్బులు ఖర్చుపెట్టటం ఓడిపోవటం కింద రాదు అన్న విషయం గమనించాలి, రెంటిలోనూ డబ్బు లాస్ అయినా సరే. :P) కానీ మొన్న ఇదొక మూఢనమ్మకం. ఇకనించి నమ్మకూడదు అని నిర్ణయించేసుకుని మొన్న న్యూ ఇయర్స్ ఈవ్‌కి $40 పెట్టి $5 సంపాదించాను. మరి అది మూఢనమ్మకమో కాదో ఈ సంవత్సరం కాష్ ఇన్‌ఫ్లో ఔట్‌ఫ్లో బట్టి వచ్చే సంవత్సరం చెప్తాను. :p